దిశ దశ, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విషయంలో ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అత్యాధునిక డివైజ్ తెప్పించిన విషయంలో నిబంధనలు పాటించకపోవడం ఒక ఎత్తైతే..? ప్రైవేటు వ్యక్తులకు వాటిని ఎలా విక్రయించారన్నదే అంతుచిక్కకుండా పోతోంది. వ్యక్తి స్వేచ్ఛను హరించేవిధంగా పర్సనల్ విషయాలను కూడా ట్యాప్ చేసేందుకు తయారు చేసిన ఈ డివైజ్ వినియోగించేందుకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదా..? అంతర్జాతీయ కంపెనీలు కూడా వెనకా ముందు చూసుకోకుండా విక్రయించడానికి కారణం ఏంటీ..? అన్నదే మిస్టరీగా మారింది…
అదెలా సాధ్యం..?
తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ డివైజ్ వినియోగించిన అంశమే సంచలనంగా మారుతోంది. ఫోన్ ల ద్వారా జరిగే సంభాషణను వినేందుకు భారత ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఆయా టెలికాం సంస్థలు ఇందుకు సంబంధించిన టెక్నాలజీని పోలీసు వర్గాలకు అందించాలంటేనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆ రాష్ట్రానికే పరిమితమైన నంబర్లను ట్యాప్ చేసేందుకు లింక్ ను ఇస్తారు. దీని ద్వారా 15 ఫోన్లను ట్యాప్ చేసే వీలు ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారి మొబైల్స్ ట్యాప్ చేయాలంటే ట్రాయ్ తో పాటు కేంద్ర ప్రభుత్వ నుండి అనుమతులు తీసుకోవల్సి ఉంటుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి గల బలమైన కారణాలు… సదరు ఫోన్ నంబరు వినియోగిస్తున్న వారి నేర తీవ్రత తదితర అంశాలను పరిశీలించిన తరువాతే ఇందుకు అనుమతి ఇస్తారని తెలుస్తోంది. అలాంటిది ఏకంగా ఫోన్ ట్యాపింగ్ డివైజ్ నే ఇజ్రాయిల్ నుండి కొనుగోలు చేయాలంటే కేంద్రం అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉండదా..? ఇందుకు సంబంధించిన లేఖలు పరిశీలించకుండానే సదరు కంపెనీ ఎలా విక్రయించింది అన్నదే పజిల్ గా మారింది. ఆయా దేశాల స్వీయ రక్షణకు సంబంధించిన అంశాలలో ఇతర దేశాలు ఇష్టారీతిన సాంకేతికతను విక్రయించే అవకాశం ఉంటుందా..? చైనాకు చెందిన కొన్ని యాప్స్, శత్రు దేశాలకు అనుకూలంగా ఉండి భారత్ లో విచ్ఛినకర శక్తులను పెంచి పోషిస్తున్నాయన్న కారణంతో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ డివైజ్ కొనేందుకు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు సాహసించడానికి కారణం ఏంటీ..? వీరు అడగగానే ఇజ్రాయిల్ కంపెనీ విక్రయించడానికి అనుకూలంగా ఉన్న నిబంధనలు ఏంటీ అన్నది కూడా మిస్టరీగా మారిపోయింది. ఒక వేళ నిభందనలకు విరుద్దంగా ట్యాపింగ్ డివైజ్ కొనుగోలు చేసినట్టయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించే అవకాశాలు కూడా ఉంటాయి. దేశ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ డివైజ్ విషయంలో ఇజ్రాయిల్ కు చెందిన సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలని కూడా కోరే అవకాశం కూడా లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రైవేటు కంపెనీ..?
ట్యాపింగ్ డివైజ్ కొనుగోలు విషయంలో మరో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. ఈ డివైజ్ ను ప్రైవేటు సాఫ్ట్ వేర్ కంపెనీ పేరిట కొనుగోలు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అంటే ఈ పరికారలు వినియోగించుకునేందుకు సాఫ్ట్ వేర్ కంపెనీలకు అనుమతులు ఉన్నాయా..? లేనట్టయితే ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెన్సీ రవిపాల్ ప్రైవేట్ సంస్థ పేరిట ఎలా కొనుగోలు చేశాడు అన్న విసయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. ప్రైవేటు సంస్థలు ఇలాంటి డివైజెస్ ను వినియోగించుకునే సాంప్రాదాయం కొనసాగుతోందా అన్న విషయంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా పడింది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం కంపెనీలు కోనుగోలు చేసి ట్యాపింగ్ చేసిన వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టేనని తేటతెల్లం అవుతోంది. కాబట్టి అసలు ఈ డివైజ్ కొనుగోలు చేయడమే కాకుండా విక్రయించిన కంపెనీ నుండి కూడా వివరాలను సేకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని స్పష్టం అవుతోంది. ఒకవేళ నిబంధనలకు పాతరేసి కొన్నట్టయితే ఈ నేరం అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పరికరాన్ని విక్రయించిన సంస్థపై కూడా అంతర్జాతీయంగా న్యాయ పోరాటం చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఎలా తెచ్చారో..?
అయితే అన్ని అనుమతులు ఉన్నా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే పరికరాల విషయంలో కస్టమ్స్ అధికారులు సవాలక్ష రకాలుగా తనీఖీలు చేస్తారు. అన్ని సరిగానే ఉన్నాయన్న తరువాతే వాటిని బయటకు పంపించేందుకు క్లియరెన్స్ ఇస్తారు. అలాంటిది వీరు ఇజ్రాయిల్ నుండి ఆ డివైజ్ ను హైదరాబాద్ కు దిగుమతి చేసుకున్నారన్న విషయం కూడా అత్యంత కీలకంగా మారనుంది. వీరు అధికారికంగా తెచ్చినట్టయితే ఇందుకు సంబంధించి ఏఏ డాక్యూమెంట్లు సమర్పించారో కూడా వివరాలు సేకరిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రహస్య మార్గాల ద్వారా ట్యాపింగ్ డివైజ్ ను తెప్పించుకున్నట్టయితే ఇందుకు సంబంధించిన వివరాలపై కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.