పంప్ హౌజ్ ల నిర్మాణంలోనూ తప్పిదాలేనా… ముంపునకు గురయ్యే విషయాన్ని విస్మరించారా..?

కాళేశ్వరం పంప్ హౌజ్ లపై మరో చర్చ

దిశ దశ, భూపాలపల్లి:

కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు ఎంత ముఖ్యమో వాటి నుండి నీటిని ఎత్తి పోసేందుకు ఏర్పాటు చేసిన పంప్ హౌజ్ లు కూడా అంతే ముఖ్యం.  మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజ్ బ్యాక్ వాటర్ ను కన్నెపల్లి పంప్ హౌజ్ ద్వారా అన్నారం బ్యారేజ్ కి, అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ ను సుందిళ్ల బ్యారేజ్ కి,  సిరిపురం  పంప్ హౌజ్ ద్వారా, సుందిళ్ల బ్యారేజ్ బ్యాక్ వాటర్ ను గోలివాడ పంప్ హౌజ్ ద్వారా ఎగువ ప్రాంతానికి ఎత్తిపోసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశారు. అయితే ఈ పంప్ హౌజ్ లను ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న ప్రాంతాలు సరైనవా కాదా అన్న విషయంపై అంతగా దృష్టి పెట్టలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గోదావరి నీటి ప్రవాహానికి సమీపంలోనే ఏర్పాటు చేసిన పంప్ హౌజ్ మోటార్లు వరద నీటిలో మునిగిపోతే ఎలా అన్న విషయాన్ని అటు ఇరిగేషన్ ఇంజనీర్లు, ఇటు కాంట్రాక్టు కంపెనీలు రెండూ కూడా విస్మరించినట్టుగా ఇప్పటి వరకు ఎదురైన అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ రెండు పంప్ హౌజ్ లు కూడా వరద ఉధృతితో ముంపునకు గురి కావడంతో మోటార్లన్ని కూడా చెడిపోయిన సంగతి తెలిసిందే. అయితే మోటర్లను బాగు చేసేందుకు సంబంధిత కంపెనీలతో ఒప్పందం ఉందని, వాటిని వారే బాగు చేస్తారని అప్పుడు పదే పదే చెప్పుకోచ్చారు. కానీ ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఎంచుకోవడం తాము చేసిన తప్పిదమన్న విషయాన్ని మాత్రం అంగీకరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ తరువాత సాంకేతిక నిపుణులు వచ్చి వాటిని బాగు పర్చేందుకు ప్రయత్నం చేసినప్పుడు కొన్ని మోటర్ల ద్వారా మాత్రమే వాటర్ పంపింగ్ సిస్టం ప్రారంభం అయింది. రెండేళ్లు వరసగా వచ్చిన వరదల్లో ముంపునకు గురైన మోటార్లలో కొన్ని మోటార్లు మాత్రమే బాగు చేయడానికి ఇంతకాలం పట్టిందంటే మిగతా మోటార్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్న వారూ లేకపోలేదు.

తప్పిదాలివే..!

ఒక్క కాళేశ్వరం పంప్ హౌజ్ లోని కన్నెపల్లి పంప్ హౌజ్ విషయాన్ని పరిశీలిస్తేనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. పంప్ హౌజ్ లు కూడా డిజైన్ ప్రకారం నిర్మాణం చేపట్టలేదని నిపుణులు ప్రాథమికంగా నిర్దారించినట్టుగా తెలుస్తోంది. పిల్లర్లు, పంప్ హౌజ్ గోడలతో కలిపి నిర్మాణం చేపట్టకుండా వేర్వేరుగా నిర్మించడంతో బలహీనపడిపోయి కూలిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. కాంట్రాక్టు ఏజెన్సీ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో నిర్మించకపోవడం వల్లే ఇలాంటి నిర్మాణం చేపట్టాల్సి వచ్చిందని తేలినట్టు సమాచారం. మూడు పంప్ హౌజ్ లు కూడా నీటిమట్టానికి దిగువన  నిర్మించడం వల్లే ముంపునకు గురువుతున్నాయన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే సిరిపురం పంప్ హౌజ్ రెండు సార్లు నీట మునిగిందని కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. జీవనది అయిన గోదావరి లాంటి ప్రధాన నదుల వద్ద లెవెల్స్‌ని తగ్గించడం పంపుహౌజ్ ల డిజైన్‌ను  చీఫ్ ఇంజనీర్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (CE, CDO) ఆమోదించడం కూడా సరైన నిర్ణయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. పంప్ హౌజ్ ల నిర్మాణం చేసిన ప్రాంతాలను పరిశీలించినట్టయితే… కన్నెపల్లి(లక్ష్మీ) పంప్ హౌజ్ నిర్మాణం కోసం జెన్ కో MGAD ఆమోదించిన ప్రకారం +111.000M కాగా CE, CDO మాత్రం +106.70M ఆమోదించడంతో 4.30M నీటి మట్టానికన్న తక్కువ లోతుకు ఆమోదించారు. దీంతో 2022లో గోదావరి నదిలో వచ్చిన వరదలు +108.M మేర ప్రవహించడంతో పంప్ హౌజ్ ముంపునకు గురైందని గుర్తించినట్టుగా సమాచారం. ఈ లెక్కన +111.000M ఎత్తులో పంప్ హౌజ్ నిర్మాణం జరిపినట్టయితే ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యేవి కావన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అన్నారం (సరస్వతి) పంప్ హౌజ్ జెన్ కో MGAD ఆమోదించిన ప్రకారం +132.000M కాగా CE, CDO +124.000Mలో నిర్మాణం కోసం ఆమోదించడంతో గోదావరి నదికి 8 మీటర్ల దిగువన నిర్మాణం జరిపారు. దీంతో ఈ పంప్ హౌజ్ 2021, 2022 లో వచ్చిన వరదల్లో రెండు సార్లు మునకకు గురైందని తేల్చారు. గోలివాడ (పార్వతి) పంప్ హౌజ్ జెన్ కో MGAD ఆమోదించిన ప్రకారం +143.000M కాగా CE, CDO +137.000M ఆమోదించింది. దీంతో గోదావరి నీటిమట్టానికి 6 మీటర్ల దిగువన ఈ పంప్ హౌజ్ నిర్మాణం జరిపారు. అయితే గోలివాడ పంప్ హౌజ్ ఇప్పటి వరకు ఎలాంటి వరద ముంపునకు గురి కానప్పటికీ భవిష్యత్తులో భారీ వరదలు వచ్చినట్టయితే నష్టాన్ని చవి చూడక తప్పదన్న అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన పంప్ హౌజ్ల లలోని మోటార్లు భవిష్యత్తులో వరద ఉధృతి తీవ్రంగా వచ్చినా అవి మునకకు గురి కాకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, అయితే కాళేశ్వరంలోని మూడు పంప్ హౌజులు కూడా గోదావరి నీటి మట్టానికి దిగువన నిర్మించేందుకు అనుమతించడమే విస్మయం కల్గిస్తోంది.

నో ఎంట్రీ…

అయితే అటు సాగు, తాగు నీటిని అందించడంలో తలమానికంగా నిలిచే ప్రాజెక్టు అంటూ పదే పదే చెప్పుకొచ్చిన అప్పటి ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా కూడా భాసిల్లబోతోందంటూ ఆర్భాటపు ప్రచారం చేశారు. తీరా వరదల తరువాత పంప్ హౌజ్ ల వైపు కన్నెత్తి చూసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. ద్వారాలన్ని మూసివేసి… సెక్యూరిటీ ఏర్పాటు చేసి కట్టడి చేస్తున్నారు. మేడిగడ్డ కుంగిపోయిన తరువాత కూడా ఇదే పరిస్థితి ఎదురు కావడంతో అసలేం జరుగుతోందో సమాజానికి తెలియనీయకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా వ్యవహరించారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినప్పుడు ఎన్నికల వాతవారణం ఏర్పడడంతో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించే అవకాశం ఉంటుందన్న కారణంగా రాజకీయ పార్టీల నాయకులకు కొద్ది మందికి అనుమతి ఇచ్చారు. ఆ తరువాత నర మానవుడిని కూడా ఆ ప్రాంతానికి వెల్లనివ్వడం లేదు. గత సంవత్సరం ముంపునకు గురైన కన్నెపల్లి పంప్ హౌజ్ విషయంలో అయితే నేటికీ కట్టడి చర్యలే సాగుతున్నాయి.

గత సంవత్సరం ముంపునకు గురైన తరువాత కన్నెపల్లి పంప్ హౌజ్ పరిస్థితి

You cannot copy content of this page