కరీంనగర్ సీపీ వ్యూహాత్మక ఎత్తుగడ…
లెక్కలు తవ్వి తీయనున్న ఐటీ…
మింగలేక… కక్కలేక కొట్టుమిట్టాడే ధైన్యం
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ ప్రతిమ హోటల్ లో పోలీసుల దాడుల్లో దొరికిన నగదు విషయంలో సీపీ అభిషేక్ మహంతి వ్యూహాత్మకంగా వ్యవహరించారా..? అర్థరాత్రి సోదాలు చేసేందుకు భారీ స్కెచ్ వేసిన ఆయన సిబ్బందికి కూడా అంతు చిక్కకుండా వ్యవహరించారు. సెల్లార్ లోని అకౌంట్స్ ఆఫీసులో కార్టన్లలో ప్రత్యేకంగా ప్యాక్ చేసిపెట్టిన రూ. 6 కోటల్ల 67 లక్షల 32 వేల 50 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే లెక్కకు మించిన ఈ నగదు లెక్కలు తెల్చేందుకు ఐటీ విభాగానికి అప్పగించారు కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి. ఎన్నికల సమయం ఆరంభమైన నేపథ్యంలో తొలి అడుగులోనే పోలీసులు కరీంనగర్ ను షేక్ చేసేశారన్న వాదనలు వినిపిస్తుంటే ఆ నగదును ఐటీకి అప్పగించి మరింత ఇరకాటంలో పెట్టేలా వ్యవహరించారు.
తవ్వి తీయనున్న ఐటీ..?
ఇన్ కం ట్యాక్స్ విభాగానికి ప్రతిమ హోటల్ లో దొరికిన డబ్బు చేరడంతో లెక్కలన్ని కూడా తవ్వి తీయనున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నిపుణులు ఈ డబ్బులకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు కార్యరంగంలోకి దూకనున్నారు. ప్రతిమ హోటల్స్ కు సంబంధించిన వైట్ మనీ అయితే ప్రత్యేకంగా కార్టన్ బాక్సుల్లో ప్యాక్ చేసి పెట్టకుండా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు కదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒక వేళ హోటల్ లావాదేవీలకు సంబంధించినవేనని హోటల్ నిర్వాహకులు వాంగ్మూలం ఇచ్చినట్టయితే రోజూ వారి లావాదేవీలను పరిశీలించే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ నిజంగానే ప్రతిమ హోటల్స్ లావాదేవీలకు సంబంధించిన నగదే అయినట్టయితే ఎప్పటికప్పుడు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేయకుండా అక్కడ ఎందుకు దాచి పెట్టారన్న ప్రశ్న తలెత్తనుంది. ఈ డబ్బు తమది కాదని ప్రతిమ యాజమాన్యం చెప్పినట్టయితే ప్రభుత్వానికి లెక్కలు చెప్పకుండా తప్పించుకునేందుకు బ్లాక్ మనీ దందాను ప్రోత్సహిస్తున్నారన్న కోణంలో ఐటీ ఆరా తీసే అవకాశం ఉంటుంది. అసలు సంస్థకు సంబంధం లేని నగదును తీసుకోవడం ఒక తప్పయితే… ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడం మరో తప్పిదంగా గుర్తించే ప్రమాదం కూడా లేకపోలేదు. అవి తమ సంస్థకు సంబంధించినవే అన్నట్టయితే ఆ నగదు బ్లాకా… వైటా..? అనేది నిరూపించుకోవల్సి ఉంటుంది. ప్రతిమ హోటల్స్ గ్రూపుకు సంబంధించిన ఇతరాత్ర లావాదేవీలపై కూడా ఐటీ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం లేకపోలేదు. ప్రతిమ సంస్థకు సంబంధించిన అన్ని అకౌంట్స్ ను పరిశీలించడంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పైసా పైసకు లెక్క చెప్పాల్సిన ఆవశ్యకత అయితే ప్రతిమ హోటల్ యాజమన్యంపై ఖచ్చితంగా పడనుంది. గత కొంతకాలంగా పన్నుల రూపంలో చెల్లిస్తున్న వివరాలను, అకౌంట్ల ద్వారా జరుపుతున్న లావాదేవీలను కూడా ఐటీ అధికారులు బేరీజు వేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఐటీ లోతుపాతులను పరిశీలించి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే లెక్కల్లోని బొక్కలు కూడా వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారూ లేకపోలేదు. అయితే కరీంనగర్ పోలీసులు దాడుల్లో స్వాధీనం చేసుకున్న రూ. 6.67 కోట్ల పైగా నగదు ఆధారంగా ఐటీ అధికారులు చేపట్టనున్న ఇన్వెస్టిగేషన్ తో ప్రతిమ హోటల్స్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవల్సి వస్తుందన్న చర్చ సాగుతోంది. ఐటీ అధికారులు వేసే ప్రశ్నలకు రికార్డెడ్ ఎవిడెన్స్ చూపించినప్పుడే నిపుణులు అంగీకరిస్తారని తెలుస్తోంది. లేనట్టయితే జరిమానా భారీ మొత్తంలో విధించడంతో పాటు ఇతరాత్ర చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయని సమాచారం.
ఎక్కడి నుండి వచ్చింది..?
అయితే సాధారణంగా వ్యాపార లావాదేవీలకు సంబంధించిన నగదు అయితే ప్రత్యేకంగా ప్యాక్ చేసి దాచి పెట్టడం ఎందుకు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ నగదును ఇతర ప్రాంతాల నుండి ప్రతిమ హోటల్ కు చేరవేశారా అన్న అనుమానంతో పోలీసులు కూడా ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా హోటల్ కు సరఫరా అయ్యే నిత్యవసరాలకు సంబంధించిన కార్టన్లలో డబ్బును అక్రమ రవాణా చేసినట్టుగా భావిస్తున్నారు. అక్కడ నగదును ఎందుకు దాచి పెట్టారు..? ఎక్కడి నుండి తీసుకవచ్చారు అన్న కోణంలో కూడా నిఘా వర్గాలు సమాచారం సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా శుక్రవారం హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుండి వివిధ మార్గాల గుండా భారీ మొత్తంలో కరీంనగర్ కు నగదు చేరినట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇందులో సింహ భాగం నగదు డంపులగా క్షేత్ర స్థాయిలోకి చేరిందన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తిన పూర్తి వివరాలను రాబట్టేందుకు ఇంటలీజెన్స్ వింగ్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టినట్టుగా సమాచారం.