రచ్చకీడుస్తున్నామా… రాజకీయం చేస్తున్నామా..?

తెలంగాణకు కలిసి రావడం లేదా..?

దిశ దశ, హైదరాబాద్:

అస్తిత్వం కోసం పోరాటం చేసి సాధించుకున్న తరువాత తెరపైకి వస్తున్న వివాదాలు తలవంపులు తెచ్చే విధంగా ఉంటున్నాయన్న విషయాన్ని విస్మరిస్తున్నామా..? నిజాం పాలన నుండి విముక్తి పొందిన అంశం నుండి నేటి వరకు ప్రతి అంశం చుట్టూ విబేధాలేనా..? వాస్తవికతకు భిన్నంగా ముందుకు సాగుతున్నామా..? రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నామా..? ఇప్పుడిదే చర్చ తెలంగాణాలో సాగుతోంది. భారతదేశంలోని సంస్థానాలని విలీనం చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరకంగా హైదరాబాద్ స్టేట్ పాలిస్తున్న నిజాం ప్రభువు నడుచుకోవడంతో సాయుధ పోరాటం సాగిన సంగతి తెలిసిందే. నిజాం పాలిత ప్రాంతాల్లో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో సెప్టెంబర్ 1948 17న నిజాం ప్రభువు వెనక్కి తగ్గాడు. అప్పటి భారత హోం మంత్రి సర్దార్ వల్లాభాయ్ పటేల్ ముందు లొంగిపోవడంతో హైదరాబాద్ స్టేట్ లో నిజాం పరిపాలనకు తెరపడినట్టయింది.

ఇది వివాదమే…

అయితే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలన్న నినాదం బలంగా వినిపించింది. ఆగస్టు 15 స్వాతంత్ర్య, జనవరి 26 గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నట్టుగానే సెప్టెంబర్ 17న కూడా జరపాలన్న డిమాండ్ ను ఆచరణలో పెట్టేందుకు ఆనాటి పాలకులు విముఖత చూపారు. నిజాం పరిపాలిత ప్రాంతమైన కర్ణాటకలోని బళ్లారి ఏరియాలో అధికారికంగా జరుపుతున్నారన్న వాదనలు వినిపించినా పట్టించుకున్న వారు లేకుండాపోయారు. దీంతో అనధికారికంగా సెప్టెంబర్ 17ను హైదరాబాద్ స్టేట్ విమోచన దినోత్సవం జరుపుకునే వారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిని గౌరవించుకునేందు తెలంగాణాలోని స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చేవి. అయితే ఏపీ నుండి తెలంగాణాను సపరేట్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్న క్రమంలో సెప్టెంబర్ 17కు కొత్త కొత్త పేర్లు పెట్టుకోవడం ఆరంభించారు. విమోచనమని, విలీనమని, జాతీయ సమైక్యతమని, తెలంగాణ ప్రజా పాలన దినమని ఇలా ఎవరి ఇష్టం వచ్చిన పేరును వారు తెరపైకి తీసుకొస్తున్నారు. తమ పూర్వీకుల పోరాటాల వచ్చిన స్వాతంత్ర్యానికి ఆనాటి యోధులు పెట్టిన పేర్లను కూడా మార్చేసేందుకు వెనకాడకపోవడం విస్మయం కల్గిస్తోంది. స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను స్పూర్తిగా తీసుకుంటామని వ్యాఖ్యానిస్తున్న నేతలు సెప్టెంబర్ 17కు మాత్రం రకారకాల పేర్లను పెట్టేస్తున్నారు.

ఇప్పుడు తల్లి వంతు…

తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చేసింది. తెలంగాణ తల్లి విగ్రహం కేంద్రీకృతంగా రాజకీయాలు మొదలయ్యాయి. డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించాలని తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు చేయడంతో వివాదం తెరపైకి తీసుకొచ్చారు. ఉద్యమ సమయంలో తెలుగు తల్లి విగ్రహం కాదని తెలంగాణ తల్లి విగ్రహం వేరే ఉంటుందని అందుకు అనుగుణంగా తల్లిని తీర్చిదిద్దామని ప్రకటించారు రాజకీయ పార్టీల నాయకులు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రారంభించడం.. స్వరాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కూడా అదే మోడల్ లో విగ్రహాలను తయారు చేయించడం సాగిపోయింది. అయితే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, చేర్పులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేయించిన విగ్రహం సచివాలయంలో ఆవిష్కరణకు సిద్దమవుతోంది. ఈ విగ్రహానికి సబంధించిన ఫోటోలు బయటకు రావడంతో తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాలు ఊపందుకున్నాయి. కిరీటం లేదని, ఆభరనాలు లేవని తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తుంటే, తెలంగాన పౌరుషంతో పాటు ఫరిడవిల్లుతున్న పచ్చదనానికి ప్రతీక అని, ఇక్కడి పాడి పంటలకు ప్రతీకగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఓ వైపున కొత్తగా తయరు చేసిన విగ్రహం చుట్టూ విమర్శలు, సద్విమర్శలు సాగుతున్న క్రమంలోనే మరో అంశం తెరపైకి వచ్చింది. అసలు తెలంగాణ తల్లి విగ్రహం ఇదేనంటూ సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది. ఉద్యమ సమయంలో రాములమ్మ ఆవిష్కరించిన ఫోటోలు తెరపైకి వచ్చాయి.

ఎందుకిలా..?

అయితే తెలంగాణ విషయంలోనే వివాదాలు తెరపైకి వస్తున్న తీరు సరైంది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల మధ్య వైరుధ్యాలు ఎలా ఉన్నా రాష్ట్రం విషయానికి వస్తే మాత్రం ఏకతాటిపై నడిచే విధానం ఉంటే బావుంటుందని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి విషయంలో రాద్దాంతాలు చోటు చేసుకోవడం వల్ల రాష్ట్రం అబాసుపాలవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు తరాలకు అందించాల్సిన విషయాల్లో సమిష్టి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇలాంటి వివాదాలకు ఆవకాశం ఉండదన్న విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది. 

You cannot copy content of this page