దిశ దశ, న్యూ ఢిల్లీ:
కీలకమైన సమయంలో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీ ఏన్డీఏ కూటమి ముఖ్య నేతల ముందు పలు డిమాండ్లు ఉంచుతున్నట్టుగా తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కు తక్కువగా బీజేపీ గెలుచుకోవడంతో కూటమి పక్షాల మద్దతు బీజేపీకి కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహించిన ఏన్డీఏ సమావేశానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ లు వెళ్లారు. బుధవారం మద్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న వీరు నేరుగా ఏన్డీఏ సమావేశానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్న నాయకులు మంత్రిత్వ శాఖలను కెటాయించే విషయంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా జాతీయ మీడియా ఛానెల్లు పేర్కొంటున్నాయి. అయితే ఈ సారి ఏన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన సహకారం అందించాలంటే మాత్రం తమ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రతిపాదనను చంద్రబాబు చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా లోకసభ స్పీకర్, ఆర్థిక, వైద్య, విద్య, వ్యవసాయ, జల శక్తి మంత్రిత్వ శాఖలను తమ పార్టీ ఎంపీలకే ఇవ్వాలని ప్రతిపాదించినట్టుగా జాతీయ మీడియా పేర్కొంటోంది. వీటితో పాటు మరిన్ని కీలకమైన పదవులను కట్టబెట్టడంతో పాటు జాతీయ స్థాయిలో టీడీపీకి ఇచ్చే ప్రయారిటీ తదితర అంశాల గురించి కూడా చంద్రబాబు నాయుడు ఏన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతల ముందు ఉంచినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనలపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర ముఖ్య నేతలు సానుకూలంగా వ్యవహరిస్తారా… ఆయనను బుజ్జగించి డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేలా ఒప్పిస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది.