బండి కోర్టుకు హాజరు కాకపోవడానికి కారణమేంటీ..?

బీసీ నేతలు ఇద్దరూ ఒక్కటయ్యారా..?

ఏఐఎఫ్ బి రాష్ట్ర నాయకుడు అంబటి జోజిరెడ్డి

దిశ దశ, కరీంనగర్:

గంగుల కమలాకర్ ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ విషయంపై కోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఎందుకు హాజరు కావడం లేదో చెప్పాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… 2018 ఎన్నికల తరువాత గంగుల దాఖలు చేసిన అఫిడవిట్, ఖర్చులకు సంబంధించిన అంశంపై కోర్టులో పిటిషన్ వేసిన సంజయ్ మూడు సార్లు కూడా కోర్టుకు హాజరు కాలేదన్నారు. తాజాగా ఈ నెల 12 నుండి 17లోగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని కమిషన్ ను కోర్టు ఆదేశించినప్పటికీ బండి సంజయ్ మాత్రం కమిషన్ ముందు హాజరు కాలేదన్నారు. 17 వరకు ఢిల్లీలో ఉన్న ఎంపీ బండి సంజయ్ 18న రాష్ట్రానికి రావడం వెనక ఉన్న కారణం ఆయన కావాలనే కమిషన్ ముందు హాజరు కాకుండా ఉండేందుకేనని భావిస్తున్నామన్నారు. గంగుల కమలాకర్ పై కేసు వేసి వాయిదాలు కోరుతూ కాలయాపన చేయడం వెనక ఆయన చట్టాన్ని తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నాడేమోనన్న అనుమానాలు కల్గుతున్నాయని జోజిరెడ్డి వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 4న వాయిదా ఉన్నదని ఆ రోజు కూడా కోర్టు ముందుకు ఎంపీ బండి సంజయ్ వచ్చి, తాను కోర్టులో వేసిన పిటిషన్ నిజమేనని వాంగ్మూలం ఇవ్వకపోతే మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ ఇద్దరు కూడా ఒక్కటేనని తాము నమ్మాల్సి వస్తుందన్నారు. వీరిద్దరు అంతర్గతంగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకే అటు కోర్టును ఇటు ప్రజలను మభ్య పెడుతున్నట్టుగా ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి కోర్టులో శిక్ష పడడం ఖాయమని, బండి సంజయ్ కోర్టులను ఆశ్రయించి ఆ తరువాత ఆయన వాంగ్మూలం ఇవ్వడంలో జరిగిన లోటు పాట్లపై సమగ్ర విచారణ చేయాలని న్యాయ వ్యవస్థను తాను కోరుతున్నానని అంబటి జోజిరెడ్డి తెలిపారు. దేశంలో అత్యున్నతమైనదే జ్యుడిషియరీ వ్యవస్థ అని ఆ వ్యవస్థనే తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్న వారు చట్టసభలకు ఎంపిక కావవడం సరికాదని వ్యాఖ్యానించారు. గంగులను విమర్శించిన వారికి బీజేపీలో, బండిని విమర్శించిన వారికి బీఆర్ఎస్ లో పదవులు ఎందుకు రావడం లేదో చెప్పాలన్నారు. మేథావులు వీరిద్దరి హిడెన్ ఏజెండాను గమనించి తగిన గుణపాఠం చెప్పాలని, అలాగే మంత్రి గంగుల కమలాకర్ అక్రమాలు ఎంపీకి కనబడడం లేదా, ఆయన్ని ఎందుకు నిలదీయడం లేదని అంబటి జోజిరెడ్డి ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు ముత్యాల విజయ్ కుమార్, పెద్దెల్లి శేఖర్, శంకర్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page