పీఆర్వోల నియామకం తీరుపై అంతర్మథనంలో కలం కార్మికులు
దిశ దశ, హైదరాబాద్:
బీట్ రిపోర్టర్లుగా పనిచేస్తూ ఆ విభాగం వార్తలు రాసే విధానం మాత్రమే హైదరాబాద్ జర్నలిస్టులది… అన్ని శాఖలు, అన్ని పొలిటికల్ పార్టీల నాయకులతో మమేకమై అన్నింటా అవగాహనతో న్యూస్ కవర్ చేయడం జిల్లా జర్నలిస్టుల విధి. అట్టడుగున ఉన్న గ్రామం నుండి అంతరిక్షం వరకు అన్ని విషయాలపై అంతో ఇంతో అవగాహనతో ఉండేది జిల్లాల్లో పనిచేసే కలం కార్మికులు మాత్రమే. అయితే వీరిని కొత్త సర్కార్ కూడా విస్మరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో న్యూస్ కవరేజ్ చేస్తూ దశాబ్దాల తరబడి జీవనం సాగిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సంపూర్ణ అవగాహన ఉంటుంది. అంతేకాకుండా వారు పనిచేసే జిల్లాల బౌగోళిక స్వరూపంతో పాటు అక్కడి స్థితిగతులు, ఆ ప్రాంత రాజకీయ నాయకులపై కూడా పూర్తి స్థాయిలో పట్టు బిగిస్తారు. అంతేకాకుండా మంత్రులుగా ఎదిగిన ఆ నాయకులకు పునాది రాళ్లను మరిపించే విధంగా ప్రజా క్షేత్రంలో నిలబెట్టింది కూడా ఆయా జిల్లాల్లో పని చేసే జర్నలిస్టులే. అయితే వారు మాత్రం కరివేపాకులా తయారయ్యారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆనాటి పద్దతులే అమలవుతుండడం జిల్లాల్లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులకు గుర్తింపు లేకుండా పోతోందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. రాష్ట్ర క్యాబినెట్ లో ప్రాతినిథ్యం వహిస్తున్న ఎక్కువ మంది మంత్రులు అమలు చేస్తున్న ఈ తీరులో మార్పు రావల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
బీట్ రిపోర్టర్లుగా వారు…
రాజధాని హైదరాబాద్ లో పనిచేసే జర్నలిస్టులు ఒక విభాగానికో ఒక పార్టీకో పరిమితమై విధులు నిర్వర్తిస్తుంటారు. దీనివల్ల ఆ పార్టీల నాయకులు లేదా సంబంధిత శాఖలకు చెందిన అధికారులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. వారికి కెటాయించిన బీట్లపై మాత్రమే సంపూర్ణమైన పట్టు ఉండడంతో వారు ఆయా పార్టీల ముఖ్య నాయకుల దృష్టిలో పడుతుంటారు. దీంతో అధికారంలోకి రాగానే సదరు పార్టీ నాయకులు హైదరాబాద్ బీట్ రిపోర్టర్లకే ప్రాధాన్యత ఇచ్చే ఆనవాయితి కొనసాగుతోంది. శిర స్థానంలో ఉన్న హైదరాబాద్ లో పనిచేసే జర్నలిస్టులు అల్టిమేట్ అన్న భావన కూడా నాయకుల్లో నెలకొని ఉండడం మరో కారణమని చెప్పవచ్చు. కొంతమంది మినహా చాలా మంది మంత్రులు కూడా హైదరాబాద్ జర్నలిస్టులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇందులో భాగంగానే వారినే పీఆర్వోలుగా నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారన్న అభిప్రాయం జిల్లా జర్నలిస్టుల్లో నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డికి పీఆర్వోలుగా జిల్లాల్లో పని చేసి హైదరాబాద్ లో స్థిరపడ్డ వారిని తీసుకున్నారు. దీనివల్ల జిల్లాల్లోని పరిస్థితులు వీరికి అవగాహన ఉండడం వల్ల సీఎంకు పరిపూర్ణమైన సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆయా జిల్లాల పర్యటనకు వెల్లినప్పుడు కానీ, జిల్లాల్లో చేపట్టవల్సిన అభివృద్ది కోసం నిధుల కెటాయింపు విషయంలో కానీ వీరినుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల విషయంలో వీరు అప్ డేట్ అయి వారికి ఉన్న అవగాహనతో ఇచ్చే సమాచారం ముఖ్యమంత్రికి అత్యంత కీలకంగా అక్కరకు వస్తుంది. కానీ చాలా మంది మంత్రులు ఈ విధానానికి ప్రాధాన్యత ఇవ్వకుండా హైదరాబాద్ జర్నలిస్టుల వైపే మొగ్గు చూపుతుండడంతో జిల్లాల్లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఈ పరిస్థితి దాదాపు అన్ని జిల్లాల్లో నెలకొని ఉండడంతో ఇంతకాలం ఆ నేతలకు వెన్నుదన్నుగా నిలిచి వారి ఎదుగుదలలో తమ వంతు పాత్ర పోషించినా ఫలితం లేకుండా పోయిందా..? అన్న చర్చ జిల్లా జర్నలిస్టుల్లో మొదలైంది.
ఉద్యమ కాలం నుండి…
ఉద్యమ కాలం నుండి కూడా ఇదే పరిస్థితి నెలకొందన్న వేదన వ్యక్తం అవుతోంది. ఉద్యమ సమయంలో సీమాంధ్ర పత్రికల్లో పనిచేస్తున్న కొంతమంది స్వరాష్ట్ర కల సాకారం కోసం చిన్న పత్రికలను ఏర్పాటు చేసి తెలంగాణ జెండాను ఎగిసిపట్టడంలో తమ వంతు పాత్ర పోషించగా, మరి కొంతమంది జర్నలిస్టులు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తే బావుండదని యాజమాన్యాలనే ఉద్యమానికి అనుకూలంగా మార్చి చరిత్ర క్రియేట్ చేశారు. సీమాంధ్ర పత్రికల యాజమాన్యాల్లో మార్పు రావడం వెనక జిల్లాల్లో పనిచేసిన జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందన్నది వాస్తవం. గ్రామీణ ప్రాంత ప్రజల అభిప్రాయాన్ని యజమాన్యాలకు తెలపే విషయంలో ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ముందుకే సాగారు ఆనాడు జిల్లాల్లో పనిచేసే జర్నలిస్టులు. అయితే స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత మంత్రులంతా కూడా హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్టులును పీఆర్వోలుగా నియామించుకుని వారికే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో జిల్లాల్లో పనిచేస్తూ ఉద్యమ కాలంలో క్రియాశీలకంగా పనిచేసిన జర్నలిస్టులు మరుగున పడిపోయారు. తాజాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ఘోరమైన ఫలితాలను చవి చూడగా… జిల్లాల్లో విజయ దుంధుబి మోగించింది. ఇందుకు కారణం ప్రజల్లో వచ్చిన ‘మార్పు’ అనే నినాదాన్ని మరింత బలంగా తీసుకెళ్లడంలో జిల్లాల్లోని జర్నలిస్టుల పాత్ర చాలా ఉంది. ఈ కారణంగానే కొన్ని జిల్లాల్లో బోటాటోటి సీట్లతో బీఆర్ఎస్ పార్టీ సరిపెట్టకోవల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో కూడా గ్రౌండ్ రియాల్టిని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేల గెలుపులో తమవంతు పాత్ర పోషించిన జర్నలిస్టులూ ఉన్నారు. ఉద్యమ సమయంలో భేష్ అనిపించుకున్న జర్నలిస్టు సమాజం స్వరాష్ట్ర కల సాకరం అయిన తరువాత స్మాష్ అయ్యే పరిస్థితులు నెలకొనడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇప్పుడు కూడా జిల్లా జర్నలిస్టులకు పీఆర్వోలుగా అవకాశం కల్పించేందుకు మాత్రం మంత్రులు సాహసించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. జిల్లాల్లో పనిచేసే వారిని పబ్లిక్ రిలేషన్స్ ఆపీసర్లుగా నియమించుకున్నట్టయితే మంత్రులకే సగం భారం తగ్గనుందన్న వాదనలూ ఉన్నాయి. ఆయా జిల్లాల పరిస్థితులపై అవగాహన ఉండడం వల్ల మంత్రులకు చాలా వరకు భారం తగ్గే అవకాశాలే మెండుగా ఉంటాయి. జిల్లాలో పనిచేసే జర్నలిస్టులయితే మీడియా, ప్రజలు, పార్టీ క్యాడర్ విషయంలో అన్నింటా అవగాహనతో ముందుకు సాగుతారు. అయినప్పటికీ చాలా మంది మంత్రులు నిత్యం తమ కళ్ల ముందు కదలాడే జర్నలిస్టులను కాదని దూరపు కొండలు నునుపు అన్న రీతిలో హైదరాబాద్ లో పనిచేస్తున్న వారికే అవకాశం కల్పిస్తున్నారు. భాగ్యనగరంలో పనిచేసే జర్నలిస్టులకు ఆ భాగ్యం కల్పిస్తూ… జిల్లాల్లో పనిచేస్తున్న వారిని విస్మరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది.