ఎస్ఐబీ తీరుపై పోలీసు వర్గాల్లో చర్చ
దిశ దశ, హైదరాబాద్:
నాలుగో సింహం మాట అటుంచితే… ముందున్న మూడు సింహాలను కూడా మాయా ప్రపంచంలోకి దించారా..? అత్యంత కీలకమైన పోలీసు విభాగంలో పనిచేస్తున్నామన్న విషయాన్ని కూడా విస్మరించారా..? చాచి కొట్టాల్సిన స్థితిలో ఉన్న వారే సాగిలపడేలా దిగ జార్చారా..? తెలంగాణ పోలీసు విభాగంపై పడ్డ ఈ మచ్చ తల దించుకునేలా చేసిందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశంలోనే ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. అంతటి ప్రతిష్టను పెంచుకున్న పోలీసు విభాగంలోని కొంతమంది అధికారుల అత్యుత్సాహం అబాసుపాలయ్యేలా చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకిలా..?
పోలీసు విభాగంలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు తమ ప్రాపకం తగ్గుతుందని అంచనా వేశారో లేక అధికారం ముందు తలొగ్గాలని నిర్ణయించుకున్నారో తెలియదు కానీ బయటకు వస్తున్న ఒక్కో విషయం మాత్రం పోలీసు వ్యవస్థకు మాయని మచ్చను తెచ్చిపెడుతోంది. ఎస్ఐబీ ఎస్ఓటీ వింగ్ లో పనిచేస్తున్న డీఎస్పీ ప్రణిత్ రావు వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత పోలీసు అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ వ్యవహారంలో డీఎస్పీ ప్రణిత్ రావు మొబైల్ ఛాటింగ్ వ్యవహారాలను పరిశీలిస్తే ఆయన సింగిల్ గా మాత్రం ఈ తతంగాన్ని నడిపించలేదని స్పష్టం అవుతోంది. నిఘా విభాగానికి అనుభందంగా ఉన్న ఎస్ఐబీలో పనిచేస్తున్న ప్రణిత్ రావు తనపై కూడా బాసుల అబ్జర్వేషన్ ఉంటుందని గమనించే అవకాశం లేకపోలేదు. తనపై అధికారుల దృష్టి పడితే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందన్న విషయం తెలిసినప్పటికీ ప్రణిత్ రావు సొంతగా ఈ సాహసం చేసి ఉంటాడని పోలీసు అధికారులు భావించడం లేదు. ఇదంతా కూడా పోలీసు విభాగంలోని ఉన్నతాధికారులు కొంతమంది నడిపించారని భావిస్తున్నారు. అయితే కిందిస్థాయి సిబ్బందిని గాడిలో పెట్టాల్సిన బాసులే తప్పుడు మార్గంలో పయనించే విధంగా ప్రొత్సహించడమే ఇంతదూరం తెచ్చి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకుల విషయంలో ఉన్నతాధకారులే జాగ్రత్తగా ఉంటుంటారు. కానీ గత అక్టోబర్ నెలలో మాత్రం ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని వాచ్ చేసినట్టుగా వెలుగులోకి వచ్చిన వాట్సప్ ఛాటింగ్స్ తేల్చి చెప్తున్నారు. అయితే రాష్ట్రంలోనే ముఖ్య నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని వాచ్ చేసేందుకు డీఎస్పీ ప్రణిత్ రావు అంతగా ఇంట్రస్ట్ చూపే అవకాశం ఉండదన్న వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బడా వ్యాపారులను కూడా ట్రాక్ చేయాలన్న యోచన కూడా ఆయనకు రాదని అంటున్నారు కొందరు. ప్రణిత్ రావుకు టెక్నాలజీపై ఉన్న పట్టును అడ్వంటైజ్ గా తీసుకుని ఉంటారన్న అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులతో పాటు అధికారంలో ఉన్న వారిలో కీలకమైన వ్యక్తులు ఒకరిద్దరు ఈ వ్యవహారానికి తెరలేపి తమ పబ్బం గడుపుకుని ఉంటారని తేటతెల్లం అవుతోంది. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వం శాశ్వతం కాదన్న విషయాన్ని విస్మరించిన అధికారులు భ్రమల్లోకి చేరుకుని ఈ వ్యవహారాన్ని నడిపించి ఉంటారని… వెనకా ముందు ఆలోచించకపోవడమే ఇంత దూరం తెచ్చిపెట్టి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.