బీజేపీలో చేరనున్న ఆరెపల్లి మోహన్
రేపే ముహుర్తం ఖరారు
దిశ దశ, కరీంనగర్:
సీనియర్ నాయకుడు, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. గురువారం ఆయన కాషాయ కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆరెపత్తి మోహన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ గా, మానకొండూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత గులాభి కండువా కప్పుకున్న ఆయనకు పార్టీలో ఆశించినంత ప్రాధాన్యత దక్కలేదు. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు కూడా కట్టబెట్టేందుకు అధినేత కేసీఆర్ చొరవ చూపలేదు. అయినప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగిన ఆరెపల్లి మోహన్ ఈ సారి తనకే టికెట్ ఇస్తారని ఆశించారు. రసమయి బాలకిషన్ ను పక్కనపెట్టి టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరగడంతో ఈ ఎన్నికల్లో తానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినని భావించారు. కానీ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో సిట్టింగులందరిని యధావిధిగా అభ్యర్థులుగా ప్రకటించడంతో ఆరెపల్లి మోహన్ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని భావించిన ఆయన తన సన్నిహితులతో మంతనాలు కూడా జరిపారు. కానీ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు ఎంటర్ అయి ఆరెపల్లిని సముదాయించి ఆయన పార్టీ వీడడం లేదని ప్రకటన ఇచ్చారు. రెండు మూడు రోజుల్లోనే అనూహ్యంగా ఆరెపల్లి మోహన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలన సృష్టించారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగినప్పటికీ ఆ పార్టీలో నెలకొన్న పరిణామాలు ఆరెపల్లికి ఆశనిపాతంగా మారినట్టుగా తెలుస్తోంది. దీంతో మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదని తేటతెల్లం కాగా బీజేపీలో చేరికకు కూడా ఆటంకాలు ఏర్పడ్డాయన్న వాదనలు వినిపించాయి. బుధవారం కరీంనగర్ లో పర్యటిస్తున్న సిట్టింగ్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ని కలిసిన ఆరెపల్లి మోహన్ కాషాయం కండువా కప్పుకునేందుకు ముహుర్తం ఫిక్సయింది. గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆరెపల్లి మోహన్ తో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో చేరనున్నారు.