చిట్ ఫండ్ కంపెనీలపై ఛీటింగ్ కేసులే కాదు… ఆ సెక్షన్లు కూడా…

ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ అమలు…

దిశ దశ, కరీంనగర్:

రిజిస్ట్రేషన్ చీటీ సంస్థలను నెలకొల్పడం… ఖాతాదారుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ఆ తరువాత తిప్పుకోవడం పరిపాటిగా మారిపోయింది. పోలీసులను ఆశ్రయిస్తే చీటింగ్ కేసు నమోదు చేసినట్టయితే అలా వెల్లి ఇలా బయటకు వచ్చేస్తామన్న ధీమాతో ఉన్న మోసగాళ్ల ఆటలకు చెక్ పెట్టేశారు కరీంనగర్ పోలీసులు. నామా మాత్రపు సెక్షన్లతో సరిపెడితే సామాన్యులను ఛీట్ చేస్తూనే ఉంటారన్న విషయాన్ని పసిగట్టిన కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి చట్టాలను కులంకశంగా అధ్యయనం చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తున్నారు. దీంతో చిట్ సంస్థలను ఏర్పాటు చేసి చీటింగ్ చేసి దర్జాతనం వెలగబెడతామనుకుంటే ఇక చెల్లదని చేతల్లో చెప్పేశారు. కరీంనగర్ వన్ టౌన్ లో నమోదయిన చిట్ ఫండ్ యాజమాన్యం మోసం చేసిన కేసులో నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. కరీంనగర్ వన్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం… ఖాతాదారులకు చిట్ డబ్బులను సకాలంలో చెల్లించకుండా ఆస్తులను కూడబెట్టుకునేందుకు ఉపయోగించిన అక్షర ఛిట్ ఫండ్ ఛైర్మన్, డైరక్టర్లపై నాన్ బెయిలబుల్ సెక్షన్లలో కేసు నమోదు చేశారు. ఛైర్మన్ పేరాల శ్రీనివాస రావు, డైరక్టర్లు సూరినేని కొండల రావు, ఉప్పల రాజేందర్ లను కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై క్రైం నంబర్ 109/2024లో సెక్షన్ 406, 420 r/w 34 ఇండియన్ పీనల్ కోడ్ తో పాటు 5 ఆఫ్ ది తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 3,4లో కేసు నమోదు చేశారు. కరీంనగర్ సమీపంలోని సీతారాంపూర్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి శ్రీరామ్ వెంకట్ రెడ్డి అక్షర చిట్ సంస్థలో చీటి వేయగా అతనికి రావల్సిన రూ. 7 లక్షలు ఇవ్వకుండా సంస్థ నిర్వాహకులు తప్పించుకుని తిరుగుతున్నారు. బాధితుడు వెంకట్ రెడ్డి చిట్ ఫండ్ బ్రాంచ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పలితం లేకపోవడం కరీంనగర్ సీపీని ఆశ్రయించి తనగోడు వెల్లబోసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసిన వన్ టౌన్ పోలీసులు నిందితులుగా ఛైర్మన్ శ్రీనివాస రావు, ఆయన భార్య పేరాల శ్రీ విద్య, సూరివేని కొండల్ రావు, పుప్పాల రాజేందర్, అలువాల వరప్రసాద్, గోనె రమేష్ లు డైరక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, బోదన్, ఆదిలాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండతో పాటు పలు ప్రాంతాల్లో 54 బ్రాంచీలను ఏర్పాటు చేసింది. అయితే సంస్థ నిర్వహాకులు చిట్ ఖాతాదారులు చెల్లించిన నగదును మల్లించి భూములు కొనుగోలు చేశారు. దీంతో గడువు ముగిసినా కస్టమర్లకు డబ్బు చెల్లించకుండా డిపాజిట్ చేసిన నగదుకు బదులుగా బాండ్లను ఇస్తూ ముప్పు తిప్పలు పెడుతున్నారు. చిట్ ఫండ్ ద్వారా సేకరించిన నగదుకు అక్షర టౌన్ షిప్ ప్రైవేటు లిమిటెడ్, అక్షర్ టౌన్ షిప్ ఇండియాల పేరిట మరో సంస్థలను ఏర్పాటు చేసి ఖాతాదారులను మోసం చేయడం ఆరంభించారు. వారికి ఇచ్చిన బాండ్ల గడువు కూడా ముగిసినప్పటికీ డబ్బులు ఇవ్వకుండా వాటిని రెన్యూవల్ చేస్తున్నారు. కరీంనగర్ టవర్ సర్కిల్, మంకమ్మతోట, కోతి రాంపూర్, రేకుర్తిలలో ఏర్పాటు చేసిన బ్రాంచ్ ఆఫీసుల ద్వారా 800 మంది ఖాతాదారులను చేర్చుకున్నారు. చిట్ సంస్థలో 2 నుండి 50 మందికో గ్రూప్ ఏర్పాటు చేసి ఖాతాదారుల నుండి ప్రతి నెలా డబ్బులు వసూలు చేస్తూ యాక్షన్ కూడా నిర్వహిస్తుంటారు. యాక్షన్ తరువాత డివిడెండ్ ను సమాన భాగాలుగా పంచుతూ వచ్చిన మొత్తంతో సొంత ఆస్తులు కూడబెట్టుకోవడం ఆరంభించారు. చిట్ గడువు, బాండ్ల గడువు ముగిసినా ఖాతా దారులకు డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ చెల్లిస్తామన్న ఆశ చూపిస్తూ అనుమతి లేని బాండ్లను ఇచ్చి మోసం చేశారు. కస్టమర్ల నుండి వసూలు చేసిన డబ్బుతో కరీంనగర్ జిల్లాలోని వెదిర, వెలిచాలలో 50 ఎకరాలు, గాడిపల్లి, నగునూరులలో భూములు కొనుగోలు చేశారు. వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్ సంస్థ బాగోతాలను వెలుగులోకి తీసుకొచ్చిన పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్లలో కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించామని వన్ టౌన్ పోలీసులు తెలిపారు.

You cannot copy content of this page