MAOIST: లొంగుబాట్లు… అరెస్టులు…

దిశ దశ, దండకారణ్యం:

దండకారణ్య మావోయిస్టు పార్టీకి చెందిన సీనియర్లు అరెస్టు, లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగిన సీనియర్ నాయకులు పార్టీకి దూరమవుతున్న తీరు సంచలనంగా మారింది. 1980వ దశాబ్దంలో విప్లవ పంథాలో కొనసాగుతున్న నాయకులు ఉనికి బయటకు వస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. శత్రు దుర్భేద్యంగా భావించిన అభూజ్ మఢ్ అటవీ ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో క్రియాశీలకంగా పనిచేసిన సీనియర్ నేతలు ఎదో కారణంచే పార్టీకి దూరమవుతున్నారు.

బల్మూరి దంపతులు…

నాలుగు దశాబ్దాల పాటు విప్లవ పంథాలో కొనసాగుతున్న బల్మూరి నారాయణ రావు అలియాస్ అలియాస్ ప్రభాకర్(57) చత్తీస్ గడ్ లోని కంకేర్ జిల్లాలో అరెస్ట్ అయ్యారు. గత సంవత్సరం డిసెంబర్ 23న ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. లాజిస్టిక్స్ సప్లై చేయడంతో పాటు మొబైల్ పొలిటికల్ స్కూల్ (MOP0S) నిర్వహణ బాద్యలు కూడా పర్యవేక్షిస్తున్న నారాయణ రావు 1984లో విప్లవ పోరాటం వైపు వెల్లారు. మూడు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న నారయణ రావు అరెస్ట్ సంచలనంగా మారింది. తాజాగా ఆదివారం కంకేర్ జిల్లాలోనే శ్యామ్ నాథ్ ఊసెండికి చెందిన డెన్ లో షెల్టర్ తీసుకుంటున్న డీవీసీ, రావుఘాట్ ఏరియా కమిటీ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాల్తీ అలియాస్ రాజే అలియాస్ నిర్మల కాంగే (48)ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బల్మూరి నారాయణ రావు, ఆయన సహచరి అయిన నిర్మల ఇద్దరిని కూడా కంకేర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.

లొంగుబాటలో…

జనవరి 1న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, DKSZC ఇంఛార్జీ మలోజ్జుల వేణుగోపాల్ అలియాస్ భూపతి సహచరి తారక్క ఉరఫ్ విమల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముందు లొంగిపోయారు. 1983లో పార్టీలో చేరిన తారక్క మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన తొలితరం విప్లవ నాయకురాలు. ఆమె లొంగిపోవడం కూడా సంచలనం కాగా, ఈ నెల 11న సౌత్ బస్తర్ లో జిల్లా కమిటీ కార్యదర్శి హోదాలో పని చేస్తూ, క్రాంతికారి జనతన్ సర్కార్ లో వ్యవసాయ విభాగం ఇంఛార్జీగా వ్యవహరించిన మచ్చ సోమన్న అలియాస్ సమ్మయ్య జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే ముందు లొంగిపోయారు. 1990వ దశాబ్దంలో విప్లవ పోరాటం వైపు ఆకర్షితుడైన సోమన్న జనజీవనంలో కలిసేందుకు ముందుకు రావడం గమనార్హం. గత సవంబర్ నెలలో DKSZC మెంబర్ గా పనిచేస్తున్న కోడి మంజుల అలియాస్ నిర్మల వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముందు లొంగిపోయారు. వీరితో పాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా మావోయిస్టు పార్టీ క్యాడర్ లొంగిపోయింది.

You cannot copy content of this page