కళాకారుడు ఓరుగంటి శేఖర్ పై కేసు

దిశ దశ, మానకొండూరు:

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆడిపాడిన గొంతుక, రాష్ట్ర సాంస్కృతిక సారథిలో కూడా కొంతకాలం పని చేసిన సీనియర్ కళాకారుడు ఓరుగంటి శేఖర్ పై మానకొండూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాలకు చెందిన ఓరుగంటి శేఖర్ పై 137/ 2023 క్రైం నెంబర్ లో 506 ఐపీసీ, సెక్షన్ 3 (2) (va), ఎస్సీ, ఎస్టీ పీఓఏ అమాండ్ మెంట్ యాక్టు 2015, సెక్షన్ 67 ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు 2000లో కేసు నమోదు అయింది. ఈ మేరకు ఓరుగంటి శేఖర్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టుకు తరలించారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, తిమ్మాపూర్ మండలం రేణిగుంటకు చెందిన ఎలుక అంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎమ్మెల్యేపై పోస్టులు…

మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఫేస్ బుక్ లో కామెంట్లు చేశాడని ఎలుక ఆంజనేయులు మానకొండూరు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 21న తాను మానకొండూరు పల్లె బస్ స్టేషన్ లో ఫేస్ బుక్ ఓపెన్ చేయగా ఓరుగంటి శేఖర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తూ కామెంట్లు చేశారని ఆ ఫిర్యదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే రసమయికి వ్యతిరేకంగా రాసిన ఓ పాటలో కూడా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని ఆంజనేయులు వివరించారు.

ఉదయం మిస్సింగ్…

కరీంనగర్ సమీపంలోని రేకుర్తి శివార్లలోని ఆయన అన్న ఇంట్లో బుధవారం రాత్రి ఉన్న ఓరుగంటి శేఖర్ గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో బయటకు వెల్లారు. స్టూడియో పనిపై వెల్తున్నాని చెప్పిన శేఖర్ మద్యాహ్నం వరకూ ఎవరికీ కాంటాక్ట్ కాకపోవడంతో అటు ఆయన కుటుంబ సభ్యుల్లో, ఇటు కళాకారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఓరుగంటి శేఖర్ కోసం వారంతా ఆరా తీస్తున్న క్రమంలో మానకొండూరు పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం తెలియడంతో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే శేఖర్ పై నమోదు చేసిన కేసు మేరకు అతన్ని పోలీసులు కోర్టులో హాజరు పర్చారు.

You cannot copy content of this page