దిశ దశ, కరీంగనర్:
మూడు దశాబ్దాల క్రితం గొల్ల మల్లమ్మ కోడలా… గొల్ల మల్లమ్మ కోడలా అంటూ గానం చేసిన కళామతల్లి ముద్దుబిడ్డ గుండె ఆగిపోయింది. కరీంనగర్ జిల్లా సాంస్కృతిక, కళారంగంలో కలికితురాయిగా ఎదిగిన ఆయన మృత్యువు ఒడిలో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. కరీంనగర్ భాగ్యనగర్ కు చెందిన శివ కుమార్ 1990వ దశాబ్దంలో తన గాత్రంతో కళాభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కళాభారతి వేదికగా జానపద గీతాలను తనదైన బాణిలో ఆలపించిన శివ కుమార్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. వెండితెరపై కనిపించిన శివకుమార్ తన తరువాతి తరానికి ‘మార్గదర్శి’ గా నిలిచారు. ముదిరాజ్ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్తర్వించిన శివకుమార్ ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు. పల్లె జనానికే పరిమితమైన జానపద పాటలను వేదికల ద్వారా ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రయత్నించిన కరీంనగర్ జిల్లాకు చెందిన కళాకారుల్లో శివ కుమార్ ఒకరు. జిల్లా సాంస్కృతిక కళా రంగంపై చెరగని ముద్ర వేసిన శివ కుమార్ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, సీనియర్ కళాకారులు డిండిగాల రవిందర్, కుమార్ మహర్షి, కాసు మహేందర్ రాజు, సంఘం రాధాకృష్ణ, చిట్టి తిరుపతి, ఉపేందర్ ప్రసాద్, వైఎస్ శర్మ, వై అనిల్ కుమార్ గౌడ్, కాసు మధు, ఎస్పీ రాధాకృష్ణ, తబలా శంకర్, రఘువీర్ సింగ్ లు సంతాపాన్ని ప్రకటించారు.