ఓవర్ లోడ్ రవాణా ఆగిపోయిందా… ఆరోపణలకు బ్రేకులెందుకు పడ్డాయ్..?

ఎన్టీపీసీ బూడిద రవాణాపై సరికొత్త చర్చ

దిశ దశ, పెద్దపల్లి:

నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధించిన యాష్ ప్లాంట్ నుండి బూడిద రవాణా విషయంలో ఆరోపణలు వినిపించడం లేదెందుకు..? బీజీపీ, బీఆర్ఎస్ నాయకులు గతంలో ఓవర్ లోడ్ సమస్యపై గళమెత్తి మిన్నకుండిపోయారెందుకు..? లారీల్లో సామర్థ్యానికి మించి లోడింగ్ జరగడం లేదా..? రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగానే లారీలు  నడుస్తున్నాయా..?

రామగుండం నుండి…

పెద్దపల్లి జిల్లా రామగుండం సమీపంలో ఎన్టీపీసీకి చెందిన యాష్ ప్లాంట్ ఉంది. విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే బొగ్గు నుండి వచ్చే బూడిదను గత కొన్ని సంవత్సరాలుగా ఓ ప్లాంటులో స్టోర్ చేసి పెడుతోంది ఎన్టీపీసీ యాజమాన్యం. అయితే ఈ యాష్ ను రోడ్ల నిర్మాణానికి ఉపయోగించడం సముచితమని భావించిన కేంద్ర ప్రభుత్వం విజయవాడ వరకు నిర్మాణం అవుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తరలించాలని నిర్ణయించింది. ఈ యాష్ రవాణా చేసేందుకు కొన్ని ట్రాన్స్ పోర్టు ఏజెన్సీలకు ఎన్టీపీసీ అనుమతులు ఇచ్చింది. బూడిద తరలిస్తున్న లారీల్లో ఓవర్ లోడ్ వెల్తోందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఓవర్ లోడ్ విషయంపై ఘాటైన విమర్శలు చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా బూడిద లారీలను ఎక్కడికక్కడ ఆపి ఓవర్ లోడ్ ఉందని చూపించేందుకు వే బ్రిడ్జిల్లో కాంటా వేయించారు. ఓవర్ లోడ్ ను ఎలా అనుమతిస్తారని, ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయని కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. అంతకు ముందు వరంగల్ సమీపంలోని వర్దన్నపేట వాసులు యాష్ తరలిస్తున్న లారీలను అడ్డుకుని ఆందోళన కూడా చేశారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఈ ఆరోపణలు, విమర్శలకు బ్రేకు పడింది. కారణం ఏంటో కానీ ఇప్పుడు కూడా ఓవర్ లోడ్ తో లారీలు తరలివెల్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారన్న ఆరోపణలు వస్తున్నాయి.

వందల సంఖ్యలో…

ఖమ్మం జిల్లా మీదుగా సాగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం ఇప్పటికీ రామగుండం యాష్ ప్లాంటు నుండి బూడిద రవాణా చేస్తూనే ఉన్నాయి ఏజెన్సీలు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, వైరా, సత్తుపల్లితో పాటు మరోచోట జరుగుతున్న నిర్మాణాల కోసం యాష్ తరలి వెలుతున్నది. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల కోసం తరలిపోతున్న బూడిదను లారీలో ఓవర్ లోడ్ తో తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాహాటంగా ప్రధాన రహాదారుల మీదుగానే సాగుతున్న ఓవర్ లోడ్ రవాణా విషయంలో ఇప్పుడు ఆయా రాజకీయ పార్టీల నాయకుల ఆరోపణలకు బ్రేకులు పడడం విచిత్రంగా మారింది. టార్పాలెన్స్ ఏర్పాటు చేసుకుని బూడిద రవాణా చేస్తున్నప్పటికీ రహదారులపై బూడిద పడిపోతోంది. దీంతో వాహనాదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. రోజుకు 200 నుండి 300 వరకు లారీల్లో బూడిద ఓవర్ లోడ్ చేసుకుని దర్జాగా రవాణా అవుతున్నా పట్టించుకునే వారు మాత్రం లేకుండా పోయారని చర్చ జరుగుతోంది. యాష్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన ఓ కౌంటర్ ద్వారా ఒక్కో లారీ రూ. 500 ల చొప్పున వసూలు చేసే విధానం కూడా అమలు చేస్తున్నారు. 

You cannot copy content of this page