కరీంనగర్ కమిషనరేట్ లో అలుముకున్న విషాదం…
దిశ దశ, కరీంనగర్:
పోలీస్ కిషనన్న హఠాన్మరణం చెందారు. నాలుగు దశాబ్దాలుగా పోలీసు విభాగంలో సేవలందిస్తున్న ఆయన్ను గుండెపోటు రూపంలో మృత్యువు కళించింది. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న మార్కొండ కిషన్ (59) జ్యోతినగర్ నివాసం ఉంటున్నారు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఉన్న సమయంలో అస్వస్థకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. 1984లో పోలీసు విభాగంలో చేరిన కిషన్ అందరితో చనువుగా ఉండేవారు. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన కిషన్ హఠాన్మరణంతో కరీంనగర్ పోలీసు విభాగంలో విషాదం అలుముకుంది. తమతో పాటు కలివిడిగా తిరిగిన కిషన్ విగతజీవిగా మారిపోయి ఉండడాన్ని చూసిన పలువురు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవలె ఆయన అతి ఉత్రిష్ట సేవా పథకానికి ఎంపిక కాగా కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి అందించారు. ఆయనకు ఓ భార్య ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు, కూతురు విదేశాల్లో ఉండగా మరో కూతురు ఇక్కడే ఉంటున్నారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామంలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.