పులి అనగానే భయపడడం కామన్… చలి అనగానే గజగజ వణికిపోవడమూ వెరీ కామన్… కానీ ఆ రెండూ ఒకేసారి అటాక్ చేస్తే ఎలా ఉంటుంది..? వాటి గురించి విన్న వెంటనే వెన్నులో ఎలాంటి వణుకు పుడుతుందో ఓ సారి ఊహించుకోండి… ఇప్పుడదే పరిస్థితి ఆ జిల్లా వాసులను వెంటాడుతోంది. ఓ వైపున సరిహద్దు అడవుల్లో పులి సంచారం అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే.. ఇప్పుడు చలి కూడా వారితో దోబూచులాడుకోవడం ఆరంభించింది. దీంతో ఆ అడవుల ఖిల్లా ఒక్కసారిగా భయం గుప్పిట చేరిపోయింది.
పులితో ఇలా…
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో గత 20 రోజులుగా పులి భయం వెంటాడుతోంది. వాంకిడీ సమీపంలోని అడవుల్లో ఓ వ్యక్తిని చంపడంతో వెలుగులోకి వచ్చిన పులి అడుగుల జాడ ఇప్పుడు కాగజ్ నగర్ వరకూ పాకింది. దీంతో అటవీ గ్రామాల జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తుండగా, అటవీ అధికారలు శార్దూలం జాడ కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రజలు పులి భయంతో జీవనం సాగిస్తుంటే పులి అడుగు జాడలు తప్ప దాని ఆచూకికోసం ఆరా తీస్తూనే ఉన్నారు. ప్రధానంగా పులి వల్ల ప్రాణ నష్టం వాటిల్లకూడదన్న కారణంతో అటవీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాసులును టైగర్ భయాందోళనకు గురి చేస్తున్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
చలితో ఇలా…
ఇకపోతే చలితో కూడా ఆసిఫాబాద్ జిల్లా వాసులు వణుకుతున్నారు. అసలే శీతాకాలం కావడానికి తోడు అరణ్యాలు, గుట్టలు, నదులు నడుమ ఉన్న ఈ జిల్లా వాసులను అత్యల్ప ఉష్టోగ్రతలు వెంటాడుతున్నాయి. గణనీయంగా తగ్గిపోయిన ఉష్టోగ్రతల కారణంగా జిల్లా ప్రజలు చలి బారినుండి తప్పించుకోవడం ఎలా అన్న ఆలోచనలో పడిపోయారు. ఈ జిల్లాలో 7 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రతలు నమోదు అయ్యాయంటే ఈ జిల్లాలో చలి ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్ జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం.
పులి…చలి…
జిల్లా పొలిమేరల్లో ఉన్న గ్రామాల్లోనే సంచరిస్తున్న పులి బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ తెల్లారి లేచిన తర్వాత హమ్మయ్య ఈ రోజు సేఫ్ అనుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇక్కడి ప్రజలు. ఏ రోజు ఏ గ్రామంలో పులి ఆనవాళ్లు వెలుగులోకి వస్తాయోనన్న ఆందోళనతో కాలం వెల్లదీస్తున్న స్థానికులు అది కీరాణ్యంలోకి ఎప్పుడు వెల్తుందా అని ఎదురు చూస్తున్నారు. పులి భయం వీడకముందే ఇక్కడి ప్రజలను మరో భయం వెంటాడడం మొదలు పెట్టింది. చలి కూడా తీవ్రంగా పెరిగిపోవడంతో ఇక్కడి ప్రజలు గజగజమంటున్నారు. అటు పులి ఇటు చలి రెండూ కూడా ఒకే జిల్లాను వెంటాడుతుండడంతో అక్కడి ప్రజలు భయం గుప్పిట చేరిపోయిన పరిస్థితి నెలకొంది.