మిగిలింది ఎన్ని రోజులు… అభ్యర్థి ఎవరూ..? ఆనవాయితీని పాటిస్తోందా..?

దిశ దశ, కరీంనగర్:

మరో నెల రోజుల్లో లోకసభ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. అందివచ్చిన ఈ సమయంలో అభ్యర్థులు కార్యక్షేత్రంలో ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకునే పనిలో నిమగ్నం కావల్సి ఉంది. అయినా అధికార పార్టీలో మాత్రం అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఇంకా సాగుతూనే ఉంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడమో లేక.. పార్టీ బలంతో గెలుస్తారని భావించి ప్రకటించడమో చేయాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మీనామేషాలు లెక్కిస్తూనే ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ అభ్యర్థి ఎంపిక విషయంలో కొలిక్కి రాకపోవడం విస్మయం కల్గిస్తోంది.

ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు…

శాసనసభ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆఛూతూచి అడుగేసింది. బరిలో ఉన్న అభ్యర్థుల ఆర్థిక పరిస్థులు, గెలుపు అవకాశాలు, క్షేత్ర స్థాయిలో ఉన్న ఇమేజ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ అధిష్టానం సర్వేలపై సర్వేలు చేస్తూ… కాలయాపన చేసింది. దీంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కార్యక్షేత్రంలో దూసుకపోయాయి. పలువురు నాయకులు ఇక్కడి నుండి టికెట్ ఆశించిన క్రమంలో ఎవరి పేరు ప్రకటించాలోనన్న విషయంలో తర్జనభర్జనలు పడి చివరకు అభ్యర్థిని ప్రకటించింది. అయితే అప్పటికే ప్రచారంలో ముందంజలో ప్రత్యర్థిపార్టీల అభ్యర్థులు ఉండడంతో పాటు సొంత ఇంటి వారిని కూడా సముదాయించే అవకాశం లేకుండా పోయింది. అభ్యర్థిని ముందుగానే ప్రకటించి అభ్యర్థి ఇక్కడి నుండి టికెట్ ఆశించిన వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చినట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ సానుకూల పలితాన్ని అందుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. క్యాండెట్ పేరును ఫైనల్ చేయడంలో జరిగిన ఆలస్యం వల్ల రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి విచీనా కరీంనగర్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.

సేమ్ సీన్ రిపిట్…

తాజాగా జరుగుతున్న ఎంపీ ఎన్నికల విషయంలోనూ అసెంబ్లీ ఎన్నికలప్పటి సీన్ రిపిట్ అయినట్టుగానే ఉంది. ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరో ఒకరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మైదానంలో దూకాలన్న సంకేతాలు ఇవ్వడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విఫలం అవుతోంది. ఇక్కడి నుండి టికెట్ ఆశించిన వారిలో మెరిట్స్, డీ మెరిట్స్ అంచనా వేసి వారికి కాంగ్రెస్ పార్టీ బలం, స్థానిక నాయకత్వం అండదండలు ఉంటే ఎలా ఉంటుంది అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని క్యాండెట్ ను ఫైనల్ చేస్తే సరిపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఏ కారణం చేతనో కాని అభ్యర్థిని ప్రకటించే విషయంలో ముందడుగు వేయలేకపోతోంది. టికెట్ ఆశిస్తున్న వారు ఒత్తిళ్లకు గురి చేసినా వారి బలాబలాలను అంచనా వేసి అభ్యర్థిని ఖరారు చేసి టికెట్ ఆశించిన మిగతా నాయకులను ఏకతాటిపైకి తీసుకొస్తే బావుండేదన్న అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతోంది. దీంతో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు గ్రౌండ్ లెవల్లో ఓ రౌండ్ క్యాంపెయిన్ కంప్లీట్ చేసుకున్నారు. మరో సారి వర్గాల వారిగా సమీకరణాలు చేసే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని డిక్లేర్ చేసే విషయంలో మాత్రం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. ఇప్పటికిప్పుడు అభ్యర్థిని ప్రకటించినా అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుందా లేదా అన్న విషయాన్ని కూడా అధిష్టానం విస్మరించడం కూడా విచిత్రం.

You cannot copy content of this page