ఎల్లమ్మ గుడిలో ఏకకాలంలో అభ్యర్థులు

నామినేషన్ పత్రాలకు పూజలు

హుస్నాబాద్ లో అరుదైన ఘటన

దిశ దశ, హుస్నాబాద్:

ఎన్నికల ముఖచిత్రంలో చిత్ర విచిత్రాల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరు ప్రత్యర్థులు ఒకే సారి రేణుక ఎల్లమ్మ గుడిలో నామినేషన్ పత్రాలకు పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.

ఏం జరిగిందంటే…?

హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీష్ బాబు `తన నామినేషన్ పత్రాలను తీసుకుని స్థానిక రేణుక ఎల్లమ్మ గుడిలో పూజలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కూడా తన నామినేషన్ పత్రాలకు రేణుక ఎల్లమ్మ ఆలయంలోనే పూజలు చేసేందుకు చేరుకున్నారు. పూజల అనంతరం సతీష్ బాబు, పొన్నం ప్రభాకర్ లు కరచాలనం చేసుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు అభ్యర్థులు ఒకే గుడిలో పూజలు చేయడం ఒక ఎత్తైతే నవ్వుకుంటూ కలుసుకున్న తీరు ఆదర్శంగా నిలిచింది.

తల్లి దయ ఎవరిపైనో…?

ప్రత్యర్థులు ఇద్దరు కూడా ఎల్లమ్మ ఆలయంలోనే తమ నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించిన విషయం చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లు పూజలు చేసేందుకు అక్కడికే చేరుకోవడంతో తారసపడ్డారు. అయితే ఇద్దరు ఒకే అమ్మవారిని నమ్ముకుని పూజలు చేసిన విషయం తెలుసుకున్న స్థానికులు ఎల్లమ్మ తల్లి దయ ఎవరిపై ఉంటుందోనన్న అంశంపై మాట్లాడుకుంటున్నారు. విజయం వరించే ఆశీస్సులు సతీష్ బాబుకు ఇస్తుందా లేక పొన్నం ప్రభాకర్ కు ఇస్తుందా అన్న విషయంపై డిస్కషన్ చేస్తున్నరు. అయితే గెలిచిన వారికి రేణుక ఎల్లమ్మ దయ ఉన్నట్టని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ పత్రాల పూజలు ఒకే ఆలయంలో ఒకేసారి జరిపించడం మాత్రం సరికొత్త చర్చకు దారి తీసినట్టయింది.

You cannot copy content of this page