మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చినా వారిపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. ప్రతీరోజు ఏదో చోట కామాంధుల ఆకృత్యాలకు బలవుతూనే ఉన్నారు. వీరికి మద్యం, గంజాయి తోడైతే వారు మనుషులన్న విషయాన్ని మరిచి మహిళల పట్ల క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటన తాజాగా అమరావతిలో చోటు చేసుకుంది. సీఎం నివాసానికి కూత వేటు దూరంలో దారుణం చోటు చేసుకుంది. కంటి చూపు లేని 17 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపాడు.
వివరాల్లోకి వెళ్తే.. కంటి చూపులేని ఎస్తేరు రాణి ఇంట్లోనే ఉంటుండగా తల్లి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న రాజు యువతిపై కన్నేశాడు. అప్పుడప్పుడూ యువతి ఇంటికి వచ్చి మాట్లాడుతుండడంతో స్థానికులు ఎవరూ పట్టించుకోలేదు. అయితే యువతి ఇంట్లో ఒంటరిగా ఉండటం.. పైగా అంధురాలు కావడంతో రాణి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రాజు వేధింపులు క్రమంగా పెరగడంతో ఈ విషయాన్ని యువతి తన అమ్మకి, పెద్దమ్మకు తెలిపింది.
దీంతో రాజును యువతి తల్లి నిలదీయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాణిపై రాజు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న రాజు అక్కడే ఉన్న గొడ్డలితో రాణిని తలపై పలుసార్లు కత్తితో నరికాడు. దీంతో యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే రాణి ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన వెంటనే రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అక్కడ దొరికిన మారణాయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తన కూతురుని చంపిన రాజును కఠినంగా శిక్షించాలని రాణి తల్లి వేడుకుంటోంది. కొంతమంది పోలీసులతో ఉన్న స్నేహాం వల్లే రాజు ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నాడని స్థానికులు ఆరోపించారు. గతంలో ఓ హెడ్ కానిస్టేబుల్‌పై రాజు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే వారి ఇంటి సమీపంలో ఓ వివాహితపైనా గొడ్డలితో దాడి చేశాడని చెబుతున్నారు. హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసినప్పుడే రాజుపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటున్నారు.