కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల దాడులు…
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులే టార్గెట్ గా విచారణల పర్వం కొనసాగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల ఉల్లంఘనకు సంబందించిన కేసుల దర్యాప్తు చేయడమే పనిగా ముందుకు సాగుతున్నాయి. పోటాపోటిగా సాగుతున్న ఈ విచారణల పర్వంపై సర్వత్రా చర్చ సాగుతోంది. తెలుగు నాట సాగుతున్న ఈ వ్యవహారంతో అసామన్యులు తమపై ఎప్పుడు దాడులు జరుగుతాయోనని మధనపడిపోతున్న పరిస్థితి తయారైంది. దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్న కేసులూ తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వస్తుండడం గమనార్హం.
అటు కేంద్రం…
జాతీయ దర్యాప్తు సంస్థలు తెలంగాణ టార్గెట్ గా చర్యలకు పూనుకుంటున్నాయి. రాష్ట్రంలోని వ్యాపార వర్గాలే లక్ష్యంగా పావులు కదుపుతున్న దర్యాప్తు సంస్థలు తమ దృష్టినంతా కూడా ప్రముఖులపైనే సారించడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపున ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్, మరో వైపున ఐటీ, ఇంకో వైపున జీఎస్టీ తదితర సంస్థలు రంగంలోకి దిగి సోదాలకు పాల్పడుతున్న తీరు సంచలనంగా మారిందనే చెప్పాలి. ఒకప్పుడు జాతీతయ దర్యాప్తు సంస్థల కార్యాలయాలు ఉన్నాయా అంటే ఉన్నాయన్నట్టుగా ఉండేవి. కానీ గత కొన్ని నెలలుగా ఈ కార్యాలయలే కేంద్రంగా దర్యాప్తులు సాగుతుండడం విశేషం. క్యాసినో గేమ్ ద్వారా మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై చీకోటి ప్రవీణ్ ను విచారించడం ఆరంభించిన ఈడీ వరస దాడులకు పూనకుంటూనే ఉంది. ఈ కేసుకు సంబందించిన వ్యవహారంతో సంబంధం ఉన్న వారిని విచారించేందుకు నోటీసులు ఇస్తూ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబందించిన కేసు తెరపైకి రావడం ఇందులో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు పాత్ర కూడా ఉందని ఈడీ తేల్చడంతో అందరి దృష్టి అటువైపు మల్లింది. అయితే అనూహ్యంగా మరోసారి చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో రాష్ట్రంలోని కొంతమంది రాజకీయ ప్రముఖులకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఇకపోతే ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన పలువురు తెలంగాణా వాసులు అరెస్టు కాగా మరికొందరికి నోటీసులు కూడా ఇవ్వడంతో ఈడీ నుండి ఎవరికి పిలుపు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ గ్రానైట్ వ్యాపారులపై దాడులు చేయడం పలువురికి నోటీసులు జారీ చేసి ఈడీ విచారణ చేస్తోంది. అయితే 2013కు సంబంధించిన గ్రానైట్ సీనరేజ్ ఎగవేత విషయంపై దర్యాప్తు చేపట్టి ఈడీ, ఐటీ అధికారులు జాయింట్ రైడ్స్ చేపట్టడం గమనార్హం. ఆ తరువాత పనమా లీక్స్ జాబితాలో పేరున్న చైనా వ్యాపారితో కరీంనగర్ గ్రానైట్ వ్యాపారులు లావాదేవీలు జరపారని మనీ ల్యాండరింగ్ కూడా జరిగిందని ఈడీ మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్లో వెల్లడించింది. దాడులు కేవలం గ్రానైట్ వ్యాపారులే కాకుండా రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు సంబంధించిన శ్వేత ఏజన్సీన్ లావాదేవీల ఆరాలో భాగంగా గంగుల ఇంట్లోనూ సోదాలు నిర్వహించడం గమనార్హం. మరో వైపున ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డికి సంబందించిన వ్యాపార సంస్థలపైనా దాడులు చేశాయి జాతీయ దర్యాప్తు సంస్థలు. అలాగే వజ్ర వ్యాపారులకు సంబందించిన లావాదేవీలపై కూడా నజర్ వేసి కొన్ని వ్యాపార సంస్థల దుకాణాలను సీజ్ చేశాయి. లైగర్ సినిమాపై వచ్చిన ఫిర్యాదు మేరకు సినీ రంగానికి చెందిన పూరి జగన్నాథ్, ఛార్మీలను కూడా ఈడీ విచారించడం గమనార్హం. తాజాగా మంత్రి మల్లారెడ్డి, అతని బంధువులు, సన్నిహితుల ఇండ్లపై ఐటీ దాడులకు పాల్పుడుతుండడం గమనార్హం. సీఎంఆర్ విద్యాసంస్థల్లోని మెడికల్ కాలేజీల్లో సీట్ల కెటాయింపు విషయంలో జరిగిన అవకతవకలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థలు పలువురు ప్రముఖులు సన్నిహితులకు కూడా నోటీసులు జారీ చేయడం, మునుగోడు ఎన్నికల్లో ఓ మంత్రి పీఏ ఇంట్లో సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. హైదరాబాద్ మహానగరంలోని నిజాంపేట మేమర్ నీలగోపాల్ రెడ్డి, కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డిలపై ఐటీ దాడులు చేసింది. ఇంకా ఎంతమందిపై దాడులు జరిగే అవకాశం ఉందో అంతుచిక్కని పరిస్థితే నెలకొందని చెప్పక తప్పుదు.
రాష్ట్రం ఇటు…
ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కూడా డేగ కళ్లతో పర్యవేక్షణ చేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కొరడా ఝులిపించే విధానానికి నడుం బిగించింది. మునుగోడు ఎన్నికల నేపథ్యంలోనే మొయినాబాద్ ఫాం హౌజ్ వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. అధికార టీఆరెఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు చేస్తుండగా స్వామీజీలను పట్టుకున్నారు. స్వామి సింహయాజీ బీజేపీ జాతీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని కూడా గుర్తించడంతో సిట్ ఏర్పాటు చేసింది. మొత్తం 5 రాష్ట్రాలలో సిట్ సోదాలు చేపట్టింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో సంబంధాలు ఉన్నాయని విచారించేందుకు రావాలని బీజేపీ ముఖ్య నేత సంతోష్ జీకి కూడా తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఆయన హాజరు కాకపోవడంతో ఆయనతో మరికొంతమందిక లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో నిందితునిగా ఉన్న నందకుమార్ కు సంబందించిన వ్యాపారాలపై స్టేట్ జీఎస్టీ అధికారులు, అక్రమ నిర్మాణాలు జరిపారంటూ జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణాలు కూల్చివేశారు. దీంతో వీరు దేశంలో ఎక్కడ ఉన్నా పోలీసులు వారిని అరెస్ట్ చేసి తెలంగాణ పోలీసులకు అప్పగించాల్సిన ఆవశ్యకత ఏర్పిడింది. మునుగోడు ఉప ఎన్నికల తరువాత బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రాలో స్టేట్ జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించాయి. ఏపీ సీఐడీ అధికారులు అమరవాతి అసెన్డ్ భూముల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులు ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన దర్యాప్తులు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.