హద్దులు కూడా చెరిపేస్తున్నారా..? అధికారుల దాడులతో కొత్త కోణం

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ గ్రానైట్ క్వారీలలో నిభందనలకు విరుద్దంగా వ్యవహారాలు సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే గ్రానైట్ క్వారీల వైపు ఇప్పటి వరకు కన్నెత్తి చూసిన దాఖాలాలు నామమాత్రమే. తాజాగా మైనింగ్ అధికారులు ఆకస్మిక తనిఖీల్లో అక్రమాల తంతు వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రానైట్ క్వారీలపై దాడులు చేసినప్పుడు లీజు హోల్డర్స్ నిభందనలను తుంగలో తొక్కిన తీరును గుర్తించారు. అధికారులు.

హద్దులు మీరి…

కరీంనగర్ మైనింగ్ అసిస్టెంట్ డైరక్టర్ కార్యాలయంల పరిధిలో చేపట్టిన దారుల్లో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడుల్లో నాలుగు క్వారీల లీజుదారులు హద్దులు దాటి మరి గ్రానైట్ సేకరిస్తున్నారని వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా గ్రానైట్ లీజ్ హోల్డర్స్ కు మైనింగ్ అధికారులు క్వారీని అప్పగించేప్పుడు గొలుసులు వేసి హద్దులను నిర్ణయించి మార్కింగ్ చేస్తారు. అయితే ఈ మార్కింగ్ వేసిన ప్రాంతాన్ని కూడా దాటిపోయి గ్రానైట్ కోసం తవ్వకాలు చేపట్టారంటే అదికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లీజుకు తీసుకున్న క్వారీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, బ్లాకులకు వే బిల్లులు ఇచ్చేప్పుడు క్షేత్ర స్థాయి పరిశీనలు చేయడం వంటి చర్యలు చేపట్టినట్టయితే లీజు దారులను ఎప్పటికప్పుడు కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇంతకాలం క్వారీల్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకపోవడంతో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందేన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు క్వారీలు లీజ్ హోల్డర్స్ హద్దులను అతిక్రమించినట్టుగా గుర్తించిన మైనింగ్ అధికారులు ఆయా ఏజెన్సీలపై జరిమానా విధించారు. రూ. 6 కోట్ల 11 లక్షల 84 వేల 400 రూపాయల జరిమానా విధించామని ఏడి రామాచారి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే గ్రానైట్ బ్లాకులను రవాణా చేసే వాహనాలను తనిఖీ చేసిన అధికారులు ఆరు కేసులు నమోదు చేశారు. ఆయా కేసుల్లో రూ. 5 లక్షల 12 వేల 128 రూపాయల జరిమానా విధించినట్టుగా వివరించారు. మొత్తం రూ. 6 కోట్ల 16 లక్షల 96 వేల 528 రూపాయల జరిమానా విధించినట్టు వివరించారు.

ఒక్కసారి పరిశీలిస్తేనే…

కరీంనగర్ సమీపంలో ఉన్న గ్రానైట్ రీచులపై ఒక్కసారి ఆకస్మిక దాడులు నిర్వహిస్తేనే రూ. 6.16 కోట్ల జరిమానా విధించారంటే తరుచూ ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వ ఆదాయం పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. వే బిల్లులు లేకుండా గ్రానైట్ బ్లాకులు తరలిపోవడం వంటి వ్యవహరాలపై కఠినంగా వ్యవహరించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మైనింగ్ నిభందనలను పాటిస్తున్నారా లేదా అన్న విషయంపై స్పెషల్ డ్రైవ్ చేసినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఈ దాడులే రుజువు చేస్తున్నాయి. అయితే మైనింగ్ ఉన్నతాధికారులు స్పెషల్ టీమ్స్ తో దాడులు చేసినట్టయితే బావుంటుదని అంటున్న వారూ లేకపోలేదు.

You cannot copy content of this page