దిశ దశ, కాళేశ్వరం:
అక్కడున్న చట్టం వీరికి వరమైపోయింది… ఇక్కడి వారు విక్రయించేందుకు సిద్దం కావడం వారికి ఆదాయన్నిచ్చే వనరుగా మారిపోయింది. అంతే సరిహద్దులే ఆలంబనగా చేసుకుని తెలుగు రాష్ట్రాల నుండి లారీల కొద్ది రేషన్ బియ్యం తరలిపోవడం నిత్యకృత్యంగా మారిపోయిందక్కడ. సర్కారు ఇస్తున్న సబ్సీడీ బియ్యం సరిహద్దులు దాటడం సర్వసాధారణంగా సాగుతున్న తంతులా జరుగుతోంది. అయినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. కనీసం సొంత విభాగానికి చెందిన నిఘా వర్గాలూ పట్టించుకోలేదు. ఉన్నట్టుండి సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేయడం కలకలంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో శుక్రవారం భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు సివిల్ సప్లై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. 2 లారీలు, 2 బొలేరో ట్రాలి వాహనాల్లో తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ప్రత్యేకంగా కాళేశ్వరం వచ్చిన విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఈ దాడులు జరపడం గమనార్హం. నాలుగు వాహనాల నుండి సుమారు 700 క్వింటాళ్ల బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
అదే వారికి వరం…
ఏక్ రూప్ యా వాలా అన్న బిరుదే అందుకున్న ఓ బడా వ్యాపారి ఈ దందాతకు తెరలేపినట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఆయన నేతృత్వంలోనే నిత్యం టన్నులు కొద్ది రేషన్ బియ్యం సరిహద్దులు దాటుతున్నట్టుగా తెలుస్తోంది. కొన్నేండ్లుగా సాగుతున్న ఈ దందాకు వెన్నుదన్నుగా నిలుస్తున్న సదరు వ్యాపారి చేసే మంత్రాంగం అంతా ఇంతా కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలో బియ్యంపై నియంత్రణ లేకపోవడాన్ని అనుకూలంగా మల్చుకున్న వ్యాపారులు చిటికెలో సరిహధ్దులు దాటించే పనిలో పడ్డారు. ప్రతి నెల మొదటి 15 రోజుల పాటు రేషన్ బియ్యం తరలించే వాహనాలతోనే సరిహద్దు రహదారులు కిక్కిరిసిపోతున్నాయంటే తెలంగాణ సబ్సీడీ బియ్యం ఏ స్థాయిలో తరలి వెల్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
చెన్నూరులో…
ఇటీవల చెన్నూరు మీదుగా కూడా రేషన్ బియ్యం పెద్ద ఎత్తున తరలిపోతుంటాయి. అయితే అక్కడ సాగుతున్న ఈ దందాను కట్టడి చేసే విషయంలో పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఇటీవల రేషన్ బియ్యం వ్యవహారంలో జరిగిన రచ్చతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఆరోపణల పర్వం కూడా సాగింది. రేషన్ బియ్యం తరలించే వారిలో ఓ ముఖ్యమైన వ్యక్తి ఆ ప్రాంత ముఖ్య నేతను కలవడంతో ఈ విమర్శలు మరింత తీవ్రం అయ్యాయి.
ఇఫ్పుడే ఎందుకో..?
అయితే రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిపోతున్న విషయం గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో ఓపెన్ సీక్రెట్ అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల నుండి టన్నుల కొద్ది బియ్యం సరిహధ్దుల దాటుతుండడం కామన్ గా మారిపోయింది. ఈ విషయంపై గతంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు కూడా ఉండేవి కావని స్థానికంగా చర్చ జరుగుతుంటుంది. అయితే తాజాగా సివిల్ సప్లై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు చేసి నాలుగు వాహనాలను సీజ్ చేయడమే సంచలనంగా మారింది.