ఆ బ్రాండ్లు కొనేప్పుడు జాగ్రత్త…
దిశ దశ, హైదరాబాద్:
కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుగా మారిపోయింది వ్యాపారులు తీరు. మంచి క్వాలిటీ ఆహార పదార్థాల్లో డి గ్రేడ్ క్వాలిటీ ఫుడ్ మెటిరియల్ కలుపుతూ వ్యాపారులు వినియోగదారులను మోసం చేస్తుంటారు. అయితే అక్కడి వ్యాపారి మాత్రం వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాటేదాన్ ఏరియాలో తయారు చేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే ప్రజలను కాటేయడం ఖాయం అంటున్నారు నిపుణులు. సైబరాబాద్ కమిషనరేట్ లోని రాజేంద్ర నగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) టీమ్ ఓ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై దాడి చేసిన తరువాత విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇండస్ట్రీయల్ ఏరియా అయిన కాటేదాన్ లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం యూనిట్ గుట్టును రట్టు చేసింది ఎస్ఓటీ టీమ్. రెండేళ్ల క్రితం ముగిసిన లైసెన్స్ రెన్యూవల్ చేయకుండానే పేస్ట్ తయారు చేయడం ఒక ఎత్తైతే… కెమికల్ మిక్స్ చేసి తయారు చేస్తుండడం మరో ఎత్తు. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలోని శుభన్ కాలనీలో ఎస్ఓటీ టీమ్ 3.5 టన్నుల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను సీజ్ చేశారు. ఇందులో ఒక టన్ను కల్తీ వెల్లుల్లి పేస్ట్, రెండు టన్నులు ప్యాక్ చేసిన పేస్ట్, 500 కిలోల ముడి వెల్లుల్లి మెటిరియల్, 2 గ్రైండింగ్ మిషన్లు, సోడియం బెంజోయెట్, గమ్ ఫౌడర్, పసుపు పొడి, రూ. 2.80 లక్షల విలువైన స్టిక్కరింగ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
కెమికల్ మిక్స్ చేసి…
అయితే ఈ ఇండస్ట్రీలో తక్కువ రకం మెటిరియల్ తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడానికే పరిమితం కాకుండా యజమానులు వినియోగదారుల ఆరోగ్యాలను నాశనానికి కారమైన కెమికల్స్ కలుపుతున్నారని కూడా ఎస్ఓటీ టీమ్ దర్యాప్తులో తేల్చింది. సింథటిక్ ఫుడ్ కలర్, గమ్ ఫౌడర్, సోడియం బెంజోయేట్ (నెప్రోటాక్సిక్), పేస్ట్ మృదువుగా ఉండేందుకు మరో కెమికల్ ఫౌడర్, చెడిపోయిన వెల్లుల్లి తొక్కలను వినియోగిస్తున్నారు. వీరు రోషన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మాస్ డైమండ్, స్వచ్ఛమైన అల్లం పేరిట బ్రాండ్లు క్రియేట్ చేసి మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నట్టు పోలీసుల దాడుల్లో తేలింది. ఈ ఇండస్ట్రీ నిర్వాహకుడు మొహమ్మద్ అహ్మద్ (34)ను కూడా అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ కేసును మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.