ఫుడ్ సేఫ్టీ అక్కడేనా..? ఇతర చోట్ల అవసరం లేదా..?

దిశ దశ, కరీంనగర్:

ఫుడ్ సేఫ్టీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులు కొన్ని వ్యాపారాలపైనే దృష్టి పెడుతున్నారు. ఆహారాన్ని అందిస్తున్న మిగతా వాటిపై కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్ రంగంలోకి దిగి సోదాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. హోటళ్లు, స్వీట్ హౌజులతో పాటు ఫుడ్ అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రతి చోట కూడా తరుచూ దాడులు చేయాలని, లేనట్టయితే కలుషిత ఆహారాన్ని అందించే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అవి సరే…

ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ విభాగం అదికారులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో స్పెషల్ టాస్క్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా హోటల్స్ పై మాత్రమే ప్రధాన దృష్టి సారిస్తున్నారు. అయితే ప్రైవేటు హాస్టళ్లు కూడా Food Safety and Standards Authority of India (FSSAI) లైసెన్స్ తీసుకోవాల్సిందేనని రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ ఓ రివ్యూ మీటింగ్ లో స్పష్టం చేశారు. ఈ లైసెన్స్ లేని హాస్టళ్లపై నిఘా వేయాలని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు హాస్టళ్లు ఈ లైసెన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ చాలా హాస్టళ్ల నిర్వాహకులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలు ప్రైవేటు హాస్టళ్లు, మేనేజ్ మెంట్స్ నిర్వహించే రెసిడెన్సియల్ హాస్టళ్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇవి అన్ని కూడా FSSAI లైసెన్స్ తీసుకోవల్సిన అవసరం ఉంది. విద్యా సంస్థల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులను రెసిడెన్షియల్ కాలేజీల్లో చేర్పించుకుని రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా నిబంధనలు పాటించడం లేదన్న వాదనలు ఉన్నాయి. హాస్టళ్లలో వసతుల మాట అటుంచి కనీసం విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో అయినా కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కమిషన్ ఛైర్మన్…

ఇటీవల హైదరాబాద్ లోని కార్పోరేట్ కాలేజీ హాస్టళ్లలో జరుగుతున్న తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేపట్టి కాలేజీ యాజమాన్యాల తీరుపై మండిపడ్డారు. ఆయా కాలేజీల నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రైవేటు విద్యా సంస్థలు నిర్వహిస్తున్న హాస్టళ్లపై కూడా ఓ కన్నెయాల్సిన అవసరం ఉంది. హోటల్స్ లో అయితే ఆహారం కలుషితంగా ఉందనిపిస్తే వినియోగదారులు మరో చోటకు వెల్లే అవకాశం ఉంటుంది… కానీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో మాత్రం స్టూడెంట్ తమ చదువు ముగిసే వరకూ అదే హాస్టళ్లో ఉండాల్సిందే తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి. బాల్య దశ నుండి యవ్వనానికి చేరే వరకూ కూడా స్టూడెంట్స్ ఆయా విద్యా సంస్థలు ఏర్పాటు చేసే హాస్టళ్లలోనే జీవనం సాగించాల్సి వస్తోంది. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా తమ పిల్లలను కూడా తీర్చిదిద్దాలన్న ఆశయంతో రెసిడెన్షియల్ విద్య అందించేందుకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో విద్యా సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా రెసిడెన్షియల్ హాస్టళ్లను ఏర్పాటు చేశాయి. అయితే ఆయా విద్యా సంస్థలు నిర్వహిస్తున్న హాస్టళ్లలో ఆహారం ఎలా ఉంటుంది..? అక్కడ వినియోగిస్తున్న వంట సరుకులు ఎలా ఉన్నాయి..? కిచెన్ పరిశుభ్రంగా ఉందా..? వంటకు ఉపయోగిస్తున్న నీరు పరిశుభ్రమైందేనా..? విద్యార్థులు తాగేందుకు ఏర్పాటు చేస్తున్న నీరు ఎలా ఉంది, ఒక వేళ నిర్వాహాకులు వాటర్ ప్యూరిఫై ప్లాంట నుండి నీటిని తెప్పించినా, విద్యా సంస్థ ఆవరణలో ప్లాంట్ ఏర్పాటు చేసిన అవి నిబంధనల మేరకు ఏర్పాటు చేశారా లేదా అన్న విషయాలపై కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ISI లేని ప్లాంట్లను నిర్వహించ కూడదన్న నిబంధనలు కూడా ఉండడంతో పాటు నీటిని శుద్ది చేస్తున్నప్పుడు వినియోగిస్తున్న పదార్థాల మోతాదు తదితర అంశాల గురించి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు సంబంధిత శాఖల సమన్వయంతో తనిఖీలు చేపట్టవలసిన అవసరం ఉంది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఫుడ్ సేఫ్టీ అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

నామ మాత్రంగా…

అయితే ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖచ్చితంగా FSSAI లైసెన్స్ తీసుకోవాలన్న నిబంధన అమలు చేస్తున్న నేపథ్యంలో కొన్ని విద్యా సంస్థలు నామ మాత్రంగా హాస్టళ్ల కోసం ఏర్పాటు చేసిన మెస్ ల కోసం అనుమతులు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఒకే విద్యా సంస్థ పలు బ్రాంచులను ఏర్పాటు చేసి హాస్టళ్లను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒకే చోట వంటలు ఏర్పాటు చేసి ఆయా హాస్టళ్లకు తరలించే విధానానికి శ్రీకారం చుట్టారు. రెసిడెన్షియల్ విద్యార్థులను చేర్చుకునేప్పుడు ఫీజు విషయంలో సమానత్వం పాటిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు మెస్ ల ఏర్పాటు విషయంలో మాత్రం తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడో భోజనాలు తయారు చేసి హాస్టళ్లకు  తరలించడం వల్ల ఆహార పదార్థాలు చల్లబడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాటిని వాహనాల్లో తరలిస్తున్న క్రమంలో ఏ మాత్రం ఆ జాగ్రత్తగా వ్యవహరించినా వాటిపై ధుమ్ము, ధూళితో పాటు క్రిమికీటకాలు కూడా పడే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురి అయ్యే పరిస్థితులు కూడా లేకపోలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు విద్యా సంస్థలు నిర్వహిస్తున్న హాస్టళ్ల నిర్వహణ విషయంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

You cannot copy content of this page