అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఝలక్…
ఫోన్ కూడా లిఫ్ట్ చేయని సెకండ్ క్యాడర్…
దిశ దశ, హైదరాబాద్:
ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది అభ్యర్థుల్లో ఉత్కంఠతకు లోనవుతున్నారు ఎమ్మెల్యే అభ్యర్థులు. ఓ వైపున ఓటర్లకు తమకు అనుకూలంగా మల్చుకునే పనిలో నిమగ్నం అయిన వారు మరో వైపున జంప్ జిలానీలతో తలలు పట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు తమ వెన్నంటి ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ ఫిరాయిస్తున్న తీరుతో మింగలేక కక్కలేక అన్నట్టుగా తయారవుతోంది కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్ధుల పరిస్థితి. ఇదే క్రమంలో వారిని బుజ్జగించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న అభ్యర్థులు తమ దారికి తెచ్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారట. అత్యంత సన్నిహితుల ద్వారా రాయబారాలు నెరిపినా ఫలితం లేక పోవడంతో వారిని తమ వైపు తిప్పుకోవడం ఎలా అని మధనపడిపోతున్నారట కొంతమంది అభ్యర్థులు. ఎన్నికలు లేనట్టయితే నయానో భయానో పెట్టి ఇతర పార్టీల వైపు ప్రయాణిస్తున్న నాయకులను బ్యాక్ టు పెవిలియన్ అని పిలుచుకునే వారు. స్థానిక సంస్థలో లేక లోకసభ ఎలక్షన్లు అయినా బావుండేది కానీ తాము పోటీ చేస్తున్న ఎన్నికలు కావడంతో ఫిరాయింపుదారులను రప్పించుకోవడం ఎలా అన్న ఆలోచనలతో తలమునకలైపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మారిన ద్వితీయ శ్రేణి నాయకులు పూర్వాశ్రమంలోకి వచ్చేందుకు వచ్చేందుకు ఎలాంటి ఒత్తిళ్లు చేసినా ఊహూ అంటున్న వారే ఎక్కువైపోయారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు కొంతమంది ఇటీవలే వేరే పార్టీలోకి జంప్ చేసేశారు. ఈ క్రమంలో వారిని సొంతగూటికి రావాలని ఎన్నిరకాలుగా అభ్యర్థించినా వారు మాత్రం నో అని మధ్యవర్తులతో కుండ బద్దలు కొట్టేస్తున్నారట. ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా ఫలితం కానరావడం లేదని గమనించిన సిట్టింగ్ ఎమ్మెల్యేనే నేరుగా ఎంట్రీ ఇచ్చేశారట. ఆయనే నేరుగా ఫోన్లు చేసినా కూడా పార్టీ మారిన ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్న ప్రచారం ఊపందుకుంది. ఈ విషయం గురించి ఆ నియోజకవర్గం అంతటా ఇదే అంశం గురించి చర్చ జరుగుతున్నదంటే ఆ ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలు విఫలం ఎలా అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు సదరు నాయకుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని ముఖ్య నేతకు అప్పటి చేదు అనుభవం తాలుకూ ప్రతీకారం తీర్చుకున్నట్టయిందని కొందరు అంటుంటే, తమదాక వస్తే కానీ అసలు విషయం బోధపడదని మరికొందరు కామెంట్ చేస్తున్నారట. ఏది ఏమైనా నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే దీనావస్థ గురించి ఆయన అనుచరులు చెప్పుకుంటూ అయ్యో పాపం అన్న సానుభూతి వ్యక్తం చేస్తున్నారట.