కరీంనగర్ వైరల్ అవుతున్న ఆడియోలు… బీఆర్ ఎస్ పార్టీకి ఓట్లేసినా లాభం లేదంటూ వ్యాఖ్యలు

దిశ దశ, కరీంనగర్:

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోయిందని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత తమను సంప్రదించిన వారు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదంటూ మైనార్టీ నాయకులు మాట్లాడిన ఆడియోలు వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ను గెలిపించుకున్నప్పటికీ లాభం లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరం ఒక చోట కలిసి మాట్లాడుకోవల్సిన అవసరం ఉందంటూ ఓ మైనార్టీ నాయకుడు మాట్లాడిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్స్ విని ఎన్నికల్లో అసలేం జరిగింది అన్న చర్చ జరుగుతోంది. కరీంనగర్ లోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో తిరుగుతున్న ఈ ఆడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రెండో విడుతకు నో రెస్పాన్స్…?

కరీంనగర్ శాసనసభకు బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్ తరుపున పనిచేసినప్పటికీ డబ్బులు ఇంకా రాలేదని ఆ ఆడియోలో పేర్కొన్నారు. మిగతా డబ్బు కోసం ఫోన్ చేస్తే మైనార్టీ నాయకుడైన ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకుడు, అతని బంధువు కనీసం లిఫ్ట్ కూడా చేయడం లేదంటూ ఆడియోలో మాట్లాడిన వ్యక్తి అనడం గమనార్హం. సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న ఈ ఆడియోలో డబ్బులు రావల్సిన వారంతా ఒక చోట కలిసి మిగతా నగదు వసూలు కోసం ఏం చేయాలో అన్న విషయంపై చర్చిద్దామంటూ ఆ ఆడియోలో కోరారు. కొంతమంది లక్షల్లో సంపాదించుకున్నారని, ఓట్లు వేయించేందుకు తీవ్రంగా కష్టపడ్డ తమకు మాత్రం తీరని అన్యాయమే జరిగిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా తమను పట్టించుకున్న వారే లేకుండా పోయారని, తాము ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదంటూ ఆ నాయకుడు వివరించారు. తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఇవ్వారో అన్న విషయంపై క్లారిటీ ఇస్తే బావుంటుంది కానీ అనవసరంగా తమను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తమ ఇళ్లకు వచ్చి వేడుకున్నా తాము వినకుండా బీఆర్ఎస్ పార్టీకి చేశామని అయినా తమకు అన్యాయం చేశారంటూ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం.

గంగులకు మరో తలనొప్పి…

కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేశానని, నియోజకవర్గం కోసం రూ. 3 వేల కోట్ల నిధులు మంజూరు చేయించడంలో సఫలం అయ్యానని మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల సమయంలో ప్రకటించారు. అయితే తీరా పోలింగ్ సమీపించిన తరువాత సునాయసం కావల్సిన గంగుల కమలాకర్ గెలుపు అషామాషీగా అందుకోలేకపోయారు. అటు అభివృద్ది ఇటు తన వ్యక్తిగత సంబంధాలు, సామాజిక వర్గ సమీకరణాలు అన్నింటిని గమనించినట్టయితే ఆయన ప్రత్యర్థులు కనుచూపు మేరలో కూడా కనిపించకూడదు. కానీ మైనార్టీ ఓటు బ్యాంకు శాసించే పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన గెలుపును అందుకోవడానికి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. చివరకు 3 వేల పై చిలుకు బోటాబోటి ఓట్లతో బయటపడినప్పటికీ గంగుల కమలాకర్ కు వచ్చిన ఈ మెజార్టీ అందరినీ ఆశ్యర్యపర్చింది. 50 వేల పై చిలుకు మెజార్టీ వస్తుందని అంచనా వేసినప్పటికీ ఆయనకు వచ్చిన ఈ స్వల్ప మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పనితీరుకు అద్దం పట్టినట్టయింది. అయితే తాజాగా మైనార్టీ నాయకులు మాట్లాడిన ఈ ఆడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినట్టుగా స్పష్టం అయినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా మైనార్టీ నాయకులు మాత్రం ఓటర్లను ఆకట్టుకునేందుకు తాము ఇబ్బందులు పడుతున్నామన్న ఆవేదన మాత్రం అందరి దృష్టిని ఆకర్శిస్తోంది.

మైానార్టీ నాయకుల ఆవేదన ఏంటో ఈ లింక్ పై క్లిక్ చేసి మీరూ వినండి 

You cannot copy content of this page