కరీంనగర్ టికెట్ నాకే ఇవ్వండి

బీజేపీ నాయకత్వానికి దరఖాస్తు

ఆటోవాల శ్రీనివాస్ అభ్యర్థన

దిశ దశ, కరీంనగర్:

సామాన్యుడు చట్ట సభల్లోకి అడుగు పెట్టి సంచలనం సృష్టించాలన్నదే అతని తపన. సాదా సీదా కుటుంబానికి చెందిన తనకు టికెట్ ఇచ్చినట్టయితే ఆ క్రెడిట్ పార్టీకి దక్కుతుందని అంటున్నారాయన. తనను గెలిపిస్తే కరీంనగర్ ప్రజలు సామాన్యుడిని అందలం ఎక్కించినట్టవుతుందని చెప్తున్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ వ్యక్తి కరీంనగర్ ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వాలని బీజేపీ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు.

కరీంనగర్ విద్యానగర్ కు చెందిన అప్పాల శ్రీనివాస్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. 2014 నుండి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయన 43వ డివిజన్ కార్పోరేటర్ గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోటీ చేసి ఓడి పోయారు. ఆ తరువాత బీజేపీలో ఓబీసీ మోర్చా నాయకుడిగా పనిచేస్తున్న అప్పాల శ్రీనివాస్ కరీంనగర్ నుండి బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. అయితే శ్రీనివాస్ అత్యంత బలమైన అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ పై పోటీ చేసేందుకు సాహసించడం మరో ట్విస్ట్ అని చెప్పక తప్పదు.

వారే స్పూర్తి….

సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్న శ్రీనివాస్ ఒక వేళ పార్టీ టికెట్ ఇచ్చినట్టయితే ఎన్నికల్లో ఖర్చు చేయడం ఎలా అని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఉపాధి హామీ కూలీగా జీవనం సాగిస్తున్న చందన సలోత్రా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారని, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కూడా ఒకప్పుడు ఆటో నడుపుకుంటూ ఉపాధి పొందరాన్నారు. అంతేకాకుండా కరీంనగర్ ఎంపీగా గెలిచిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా సాధారణ కుటుంబం నుండి వచ్చిన వారేనని. ఆర్థికంగా అంతగా లేని బండి సంజయ్ కి కూడా కరీంనగర్ ప్రజలు అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటున్నారు. ప్రజల అండదండలు, ఆశీస్సులు ఉన్నట్టయితే డబ్బు అవసరమే ఉండదని చట్టసభకు ఎన్నికయ్యేందుకు మంచి పేరు, ప్రజల కోసం కష్టపడతామన్న నమ్మకం ముఖ్యమని అంటున్నారు అప్పాల శ్రీనివాస్. సామాన్య కుటుంబం నుండి చట్ట సభకు ఎన్నికయినట్టయితే దేశం అంతా కూడా కరీంనగర్ వైపు చూస్తుందని వ్యాఖ్యానించారు.

టికెట్ వస్తే…?

తనకు టికెట్ వస్తే మాత్రం ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తానని చెప్తున్నారు. అంతేకాకుండా ఒకే వ్యక్తిని తరుచూ గెలిపిస్తూ వస్తున్నారని ఈ సారి తనకు అవకాశం కల్పించి మార్పు తీసుకరావాలన్న నినాదం ఇస్తానన్నారు. సామాన్యుడిని గెలిపించి అసెంబ్లీకి పంపించినట్టయితే అన్ని వర్గాల ప్రజల కష్టలు, నష్టాలను పరిష్కరించే దిశగా ముందుకు సాగే అవకాశం ఉంటుందని కూడా ప్రజలకు వివరిస్తానని చెప్తున్నారు అప్పాల శ్రీనివాస్. ఓ వైపున బీజేపీ అధిష్టానం సిట్టింగ్ ఎంపీలను శాసనసభకు పోటీ చేయించాలన్న యోచనలో ఉండగా, తాజాగా కరీంనగర్ ఎంపీ సంజయ్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నానని ప్రకటించారు. మరో వైపున కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి గంగుల కమలాకర్ అత్యంత బలమైన వ్యక్తిగా ముద్రపడిపోయారు. సొంత పార్టీకి చెందిన బండి సంజయ్ ని కాదని బీజీపీ అధిష్టానం అప్పాల శ్రీనివాస్ కు టికెట్ ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇద్దరు ఉద్దండులతో ఆయన పోటీ పడేందందుకు సాహసించడమే చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page