దిశ దశ, కరీంనగర్:
ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ అనగానే బెంగుళూరు… హైదరాబాద్ అని ఠక్కున గుర్తుకు వస్తాయి. చిన్న చిన్న నగరాల వైపు కన్నెత్తి చూసేందుకు సాహసించే వారే లేకుండా పోయారు. ఐటీ రంగాన్ని ప్రధాన నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరింపజేయాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలోనూ ఉన్నా ఆచరణ సాధ్యామా కాదా అన్న మీమాంసే కొనసాగుతోంది నేటికీ. మెట్రో నగరాలపై మాత్రమే తమ దృష్టిని కేంద్రీకరించిన మల్టినేషనల్ కంపెనీలు ఐటీ రంగ సేవలను వికేంద్రీకరణ చేసేందుకు ముందుకు రావడం లేదు. స్టార్టప్ కంపెనీలు, చిన్న కంపెనీలు, ఎన్ఆర్ఐలు తమ ప్రాంతంపై ఉన్న మమకారంతో జిల్లా కేంద్రాల్లోనూ ఐటీ సంస్థల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఐటీ సంస్థలను ఏర్పాటు చేసే వారిని ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో చొరవ తీసుకుంటున్నారు. అయినప్పటికీ అనుకున్నంత మేర కంపెనీలు మాత్రం ముందుకు రావడం లేదు. కానీ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటయిన ఓ కంపెనీ జిల్లా కేంద్రంలో నిర్విరామంగా సేవలు అందిస్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎక్లాట్ సొల్యూషన్స్ 2011లో కరీంనగర్ లోకి అడుపెట్టి తన సేవలను అందిస్తోంది. అమెరికాలోని వాషింగ్టలన్ డీసీ కేంద్రంగా ఏర్పాటయిన ఈ అంతర్జాతీయ కంపెనీకి చెందిన సేవలు 13 ఏళ్లుగా జిల్లా కేంద్రంలో అందిస్తుండడం విశేషం. మెడికల్ కోడింగ్, హెల్త్ కేర్, ఐటీ రంగాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఎక్లాట్ సొల్యూషన్స్ సాహసంతో తన సంస్థ కార్యకలాపాలను విస్తరింపజేసింది. కరీంనగర్ కు చెందిన డాక్టర్ సుధాకర్ రావు పోల్సాని ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నఈ సంస్థలో వ్యవస్థాపకులు, సీఈఓగా కార్తిక్ పోల్సాని, కో ఫౌండర్, సీఓఓ స్రేహా పోల్సానిలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 400 మంది ఉద్యోగులకు ఉపాధినిస్తున్న ఈ సంస్థలో ఈ ఏడాది చివరి నాటికల్లా ఆ సంఖ్యను వెయ్యిమందికి చేర్చాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నారు. సంస్థలో మహిళలకు కూడా సమ ప్రాధాన్యం కల్పించడంపై కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో 200 మందికి ఉపాధి కల్పిస్తుండం మరో విషేషం. సీఓఓగా వ్యవహరిస్తున్న స్నేహా పోల్సాని మహిళలకు అవకాశాలు అందివాలన్న ధృక్ఫథంతో ఉండడం వల్లే ఈ లక్ష్యం సాధ్యమైంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా సంస్థ సేవలను విస్తరింపజేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న ఎక్లాట్ ఆదర్శప్రాయంగా ముందుకు సాగుతోంది. సంస్థ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్, సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా పురస్కారం అందజేశాయి. ఈ పురస్కారాన్ని తెలంగాణ ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సంస్థకు చెందిన ఇండియా లీడర్స్ శ్రీకాంత్ గుర్రం, మోహిత్ శ్రీవత్సవలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.