దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
కళ్ల ముందు బహుళ అంతస్థుల భవనం కనిపిస్తున్నా మరో భవనాన్ని చూపిస్తు కొంతమంది నాయకులు చేస్తున్న ప్రచారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంటే అభివృద్దికి కేరాఫ్ అన్న పరిస్థితులు మారిపోయాయన్నది వాస్తవం. ఇక్కడి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభివృద్ది పనులను పరుగులు పెట్టిస్తున్నారన్నది నిజం. కానీ కొంతమంది అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం తీరు తప్పుదారి పట్టించే విధంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్ఱభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కాలేజీకి సంబంధించిన నిధులు కూడా మంజూరు కావడం భవన నిర్మాణం కూడా పూర్తి అయింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 9 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తున్నారు. ఇందులో సిరిసిల్ల మెడికల్ కాలేజీ కూడా ఉంది. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ కారణంగానే ఈ మెడికల్ కాలేజీ సాధ్యమైందని బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు ఆయనకు కృతజ్ఞత తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా సభ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘనత గురించి ప్రజలకు వివరించేందుకు స్థానిక నాయకులు చేపట్టిన ప్రచారం తీరు అందరినీ విస్మయ పరుస్తోంది. కలెక్టరేట్ భవనం ఫోటోలు ముద్రించి మెడికల్ కాలేజీ అంటూ వారు ప్రచారం చేస్తున్న తీరు విమర్శల పాలు చేస్తోంది. వాస్తవం తెలియని వారు మెడికల్ కాలేజీ పూర్తి కాకపోవడం వల్ల కలెక్టరేట్ భవనాన్ని చూపించి ప్రచారం చేస్తున్నారేమోనన్న భావనకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. తుది మెరుగులు దిద్దుకుంటున్న మెడికల్ కాలేజీ భవనం ఫోటోలతో ప్రచారం చేస్తు తప్పేముందన్న అబిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు. మంత్రి కేటీఆర్ చేపట్టిన అభివృద్ది పనులు కళ్లముందు కనిపిస్తున్నా వేరే భవనాల ఫోటోలను చూపిస్తూ ప్రచారం చేయడం వెనక కారణమేంటన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా తమ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం తీరుపై సొంత పార్టీ నాయకులు కూడా ఆక్షేపిస్తున్నట్టుగా సమాచారం.