దండకారణ్యంలో సీఆర్పీఎఫ్ జవాన్ల చొరవ
రెండు దశాబ్దాలకు తెరుచుకున్న రామాలయం
దిశ దశ, దండకారణ్యం:
శ్రీరామ నవమికి తొమ్మిది రోజుల ముందు ఆ కీకారణ్యంలో సీఆర్పీఎఫ్ జవాన్లు గుడి గంటలు మోగించారు. నక్సల్స్ ఏరివేత కోసం ఆపరేషన్లు నిర్వహించే బలగాలు గిరిజనుల ఆరాధ్య దైవాన్ని కొలిచే విధంగా చొరవ చూపారు. మావోయిస్టు పార్టీ సమాంతర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రాంతీకారీ జనతన్ సర్కార్ ఏరియాలో రెండు దశాబ్దాల క్రితం మూసి వేసిన రామాలయన్ని మళ్లీ ప్రారంభించారు. ఈ నెల 17న శ్రీరామ నవమి పర్వదినం జరగనుండగా దండకారణ్యంలో ఆయన ఆలయం తిరిగి తెరుచుకోవడం గమనార్హం.
రెండు దశాబ్దాల క్రితం…
2003లో పీపుల్స్ వార్ నక్సల్స్ పూర్వ బస్తర్ జిల్లా అటవీ ప్రాంతంలోని రామాలాయన్ని మూసి వేయించారు తాజాగా ఈ ఆలయానికి సమీపంలో ఉన్న లఖ్ పాల్ బేస్ క్యాంపునకు చెందిన 74వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ జవాన్లు ఆలయంలో నిత్య పూజలు చేయడానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుత సుక్మా జిల్లా కెర్లపెండ గ్రామంలోని ఈ రామాలయాన్ని మూయించడంతో అక్కడ నిత్య పూజలు నిలిచిపోయాయి. స్థానికంగా ఉన్న కొందరు ఆలయం ముందు ఓ దీపం వెలిగించడంతోనే ఇంతకాలం సరిపెట్టారు. సోమవారం సీఆర్పీఎఫ్ జవాన్లు ఈ గుడిని తిరిగి ప్రారంభించడంతో అక్కడి గిరిజనులు ఇకనుండి పూజలు చేయనున్నారు. గత సంవత్సరం మార్చి 11న లఖ్ పాల్ లో ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న క్రమంలో స్థానికులు ఈ రామాలయాన్ని తిరిగి ప్రారంభించేందుకు చొరవ చూపాలని కోరడంతో ఆలయ ప్రాంగణమంతా శుభ్రం చేసి… ఆలయం లోపల ఉన్న సీతారామ లక్ష్మణ విగ్రహాలకు పూజలు చేశారు.
అన్నల నేతల ఖిల్లా…
రామాలయం ఉన్న కెర్లపెండ గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడమే కాకుండా మావోయిస్టులకు అత్యంత పట్టున్న ప్రాంతం కూడా కావడం గమనార్హం. 2010 మైన్ ప్రూఫ్ వాహనంలో వెల్తున్న మావోయిస్టులను మందుపాతరలతో పేల్చి, అంబూష్ లో ఉన్న నక్సల్స్ 76 మంది జవాన్లను మట్టుబెట్టిన తాడిమెట్లకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. మరో వైపున 2021లో మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ చీఫ్ గా ఉన్న హిడ్మా నేతృత్వంలో 22 మంది జవాన్లను బలితీసుకున్న టేకులగూడెం కూడా ఈ ఆలయానికి సమీపంలోనే ఉంది. కనీసం రహదారి సౌకర్యం కూడా లేని ఈ ప్రాంతంలో గత సంవత్సరం బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా లఖ్ పాల్ లో ఏర్పాటు చేసిన బేస్ క్యాంపు సీఆర్పీఎఫ్ జవాన్లు ఈ ఆలయాన్ని రీ ఓపెన్ చేయడం విశేషం. గిరిజనులకు చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో రామాలయాన్ని తిరిగి తెరిపించాలన్న అభ్యర్థన రావడంతోనే ఈ చొరవ తీసుకున్నామని బేస్ క్యాంప్ సీఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు. రానున్న శ్రీరామ నవమి రోజున ఈ ఆలయం వద్ద ప్రత్యేకంగా జాతర నిర్వహించాలని కూడా స్థానిక గిరిజనులు ప్లాన్ చేస్తున్నారు.
శతాబ్దాల చరిత్ర..?
దట్టమైన అటవీ ప్రాంతంలోని కెర్లపెండలో వెలిసిన ఈ రామాలయం కట్టడాలను గమనిస్తే రెండు శతాబ్దాల క్రితమే నిర్మించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రామాయణ కాలంలో దండకారణ్య అటవీ ప్రాంతంగా పిలిచిన ఈ ప్రాంతంలో శ్రీరాముడు అరణ్య వాసంలో భాగంగా ఈ ప్రాంతంలో కూడా సంచరించి ఉంటాడని తెలుస్తోంది. ఛోటా నాగపూర్ దక్కన్ పీఠభూములుగా పిలవబడుతున్న ఈ అటవీ ప్రాంతాన్ని రామాయణ కాలంలో దండకారణ్యంగా పిలిచేవారని చరిత్ర చెబుతోంది. అరణ్య వాసంలో భాగంగా రాముడు ఈ ప్రాంతంలో నడియాడినందునే ఆయనను కొలిచే సంస్కృతి ఆరంభం అయింది. గోదావరి, ఇంద్రావతి నదులతో పాటు కొండలు, గుట్టలు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో రామున్ని కొలుస్తున్న గిరిజనులు రెండు శతాబ్దాల క్రితమే ఓ గుడిని కట్టుకుని పూజలు నిర్వహించి ఉంటారని అంచానా వేస్తున్నారు. అయితే 1970వ దశాబ్దంలో మాత్రం బీహారీ మహారాజ్ ఈ ఆలయాన్ని స్థాపించినట్టుగా కూడా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. సుక్మా జిల్లా కేంద్రానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెర్లపెండ గ్రామానికి అప్పట్లో సుదూర ప్రాంతాల నుండి నిర్మాణ సామాగ్రిని తరలించారని చెప్తున్నారు. సామాగ్రిని అంతా కూడా గిరిజనులు తలపై పెట్టుకుని కెర్లపెండకు తీసుకొచ్చిన తరువాత గుడిని కట్టి అందులో విగ్రహాలను ప్రతిష్టించారని కూడా చెప్తున్నారు. అయితే బీహారీ మహారాజ్ ఈ ఆలయాన్ని నిర్మించకముందు ఈ ప్రాంతంలో శ్రీరాముని ఉనికి వెలుగులోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. అంతకు ముందు ఇక్కడకు అయోధ్య నుండి కూడా ప్రత్యేకంగా సాధు సంతులు, మునులు ఈ ఆలయం వద్దకు వచ్చేవారని, శ్రీరామనవమితో పాటు ఇతర ఆదివాసీ పర్వదినాలను పురస్కరించుకుని ఈ ఆలయం వద్ద ప్రత్యేకంగా జాతర నిర్వహించే వారని తెలుస్తోంది. ఈ ఉత్సవాలకు బస్తర్ పరిసర ప్రాంతాల నుండి కూడా కెర్లపెండ గుడికి చేరుకునే వారని కూడా స్థానికులు చెప్తున్నారు.
ఇదో స్పెషాలిటీ…
అయితే ఇక్కడ రామాలయాన్ని బీహారీ మహారాజ్ నిర్మించిన తరువాత మరో ప్రత్యేకత కూడా ఇక్కడి గిరిజనులు అందిపుచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. అడవులతో మమేకమై మాంసాహారం, నాటు సారా వంటివి సేవించే ఆనవాయితీ ఉన్న ఇక్కడి అడవి బిడ్డలు మాత్రం శ్రీ రాముని ఆలయాన్ని నిర్మించిన తరువాత మాంసం, మత్తు జోలికి వెళ్లడం మానకున్నారని స్థానికులు చెప్తున్నారు. తమ పూర్వీకులు రాముని గుడి కట్టిన తర్వాత వాటిని దూరం చేసుకుని నిత్యం శ్రీరామ నామ జపం చేస్తూ కాలం వెల్లబుచ్చేవారని వివరిస్తున్నారు. అయితే రెండు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ నక్సల్స్ శ్రీరాముని గుడిని మూయించడంతో వైవిద్యమైన జీవన విధానం మొదలైందని తెలుస్తోంది. తాజాగా సీఆర్పీఎఫ్ జవాన్లు ఈ గుడిని తిరిగి తెరుచుకోవడంతో గత వైభవాన్ని సంతరించుకునే విధంగా వేడుకలు నిర్వహించే అవకాశం ఉంది.