బ్యాక్ టు పెవిలియన్…

కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల వాసులను గడగడలాడించిన పులి తన ఇలాఖాలోకి వెల్లిపోయింది. సరిహద్దు అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా తిరిగిన పులి తిరిగి మహారాష్ట్ర అటవీ ప్రాంతాలకు వెల్లిపోయిందని గుర్తించారు అధికారులు. గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో సంచరించిన పులి ఆ ప్రాంత వాసులతో పాటు అటవీ అధికారుల కంటిమీద కునుకు లేకుండా చేసింది. అయితే మంగళవారం జిల్లాలోని బెజ్జూరు మండలం నాగేపల్లి సమీపంలోని ప్రాణహిత నదిమీదుగా మహారాష్ట్రలోని అహేరీ అటవీ ప్రాంతంలోకి వెల్లి పోయిందని ప్రకటించారు. ఈ మేరకు ప్రాణహిత నదిలో పులి అడుగు జాడలను గుర్తించిన అటవీ అధికారులు మహారాష్ట్ర అటవీ ప్రాంతానికి వెల్లిపోయిందని నిర్దారించారు. ఈ మేరకు నదీ పరివాహ ప్రాంతంలో ప్లగ్ మార్క్స్ ను కూడా సేకరించిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ టీమ్స్ మహారాష్ట్రలోని అహేరీ ఏరియా జంగ్లాత్ ఆపీసర్లకు సమాచారం ఇచ్చారు.

ప్రాణహిత నదిలో ప్లగ్ మార్క్స్ సేకరిస్తున్న అధికారులు

ప్రశాంతంగా పల్లెలు…

కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడీ మండలం ఖానాపూర్ నుండి కాగజ్ నగర్ ఏరియా కౌటాల వరకూ పులి ఉనికి వెలుగులోకి రావడంతో జిల్లా వాసులు భయం భయంతో కాలం వెల్లదీశారు. పులి ఒకటి అహేరీ అటవీ ప్రాంతానికి వెల్లిందని అధికారులు గుర్తించడంతో సరిహాద్దు ప్రాంతాల వాసులు భీతి నుండి బయటకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అటవీ ప్రాంతానికి తిరిగి వెల్లిపోయిందన్న సంతోషం అటవీ గ్రామాల ప్రజల్లో వ్యక్తం అవుతోంది. పులి ఆనవాల్ల కోసం కూడా అటవీ అధికారులు చెట్టూ పుట్టా అన్న తేడా లేకుండా అడవులన్ని గాలించారు. వారం పది రోజులుగా వేటాడే పులి కోసం వేటాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎప్పుడు ఎక్కడి నుండి సమాచారం వస్తుందోనని ఎదురు చూస్తూ అడవుల్లో గాలింపు చేపట్టాల్సి వచ్చింది. పులి ఉనికి బయటపడిందంటే చాలు అక్కడికి వెల్లడం ప్లగ్ మార్క్స్ తీసుకోవడం అక్కడి ప్రజలను అప్రమత్తం చేయడం వంటి పనులతోనే అటవీ అధికారులు గడపాల్సి వచ్చింది. ఉన్నతాధికారి నుండి క్షేత్ర స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ కూడా తమ మకాంను అడవులకే మార్చి పులి జాడ కోసం ఆరా తీశారు.

పత్తి ఏరివేతపై…

వాంకిడీ మండలం ఖానాపూర్ సమీపంలో సీడాం భీంపై బెబ్బులి పంజా విసిరి ప్రాణాలు తీసింది. ఆ తరువాత పలు గ్రామాల్లోని పశువులపై తన ప్రతాపం చూపడంతో సరిహద్దు అటవీ గ్రామాల ప్రజల భయంతో వణికిపోయారు. అడువులను అనుకుని ఉన్న గ్రామాల ప్రజలు ఇండ్ల నుండి ఆరు బయటకు రావడానికి కూడా వెనుకంజ వేశారు. మనషితో పాటు పశువులను కూడా వేటాడడంతో పులి ఎప్పుడు వెనక్కి వెల్లిపోతోందా అని ఇక్కడి ప్రజలు ఎదురు చూశారు. దీంతో వ్యవసాయ పనులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రైతులు, రైతులు కూలీలు తీవ్రంగా నష్ఠపోయారు. ప్రధానంగా చేతికొచ్చిన పత్తిని ఏరేందుకు అటవీ గ్రామాల్లోని కూలీలు పంటచేల వైపు వెల్లేందుకు జంకుతున్నారు. ఎటువైపు నుండి పులి తమవైపు నుండి దాడి చేస్తుందోనన్న భయంతో ఇంతకాలం పత్తి సేకరించేందుకు ఎవరూ వెల్లలేదు.

You cannot copy content of this page