ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్. ఇప్పటికే హాట్‌స్టార్‌లో ఐపీఎల్ ప్రసారాలు దూరం కాగా.. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు అందించే హెచ్‌బీఓ కంటెంట్ సైతం దూరం కానుంది. మార్చి 31 నుంచి ఈ ప్రసారాలు నిలిచిపోనున్నట్లు డిస్నీ+హాట్‌స్టార్ ధృవీకరించింది. ఇకపై హాట్‌స్టార్‌లో హెచ్‌బీఓ కంటెంట్ ఉండబోదని తెలిపింది. డిస్నీ+హాట్‌స్టార్‌లో ఇప్పటికే 10 భాషల్లో లక్ష గంటలకు పైగా అందుబాటులో ఉన్న టీవీ షోలు, సినిమాలు, ప్రధాన స్పోర్ట్స్ ఈవెంట్లను చూసి ఆనందించవచ్చని ట్విట్‌లో పేర్కొంది.
డిస్నీ+హాట్‌స్టార్ 2016 నుంచి హెచ్‌బీఓ ఒరిజినల్ షోలను ప్రసారం చేస్తోంది. దీని కోసం హెచ్‌బీఓతో 2015 డిసెంబర్‌లో ఒప్పందం చేసుకుంది. హాట్‌స్టార్ కాస్త 2020లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌గా మారిన తర్వాత కూడా ఈ ఒప్పందం కొనసాగింది. ముఖ్యంగా హెచ్‌బీఓలో ప్రసారం అయ్యే గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు భారత్‌లో చాలా మందే అభిమానులు ఉన్నారు. అమెరికాలో ప్రసారం అయ్యే రోజే హాట్‌స్టార్‌లోనూ అందుబాటులోకి వచ్చేది. వీటితో పాటు హెచ్‌బీఓలో అందుబాటులో ఉండే హాలీవుడ్ సినిమాలు, సిరీస్‌లను వీక్షించేవారు. ఇకపై హాట్‌స్టార్‌లో ఆ కంటెంట్ లభించదు.
ఖర్చులను తగ్గించుకోవాలని డిస్నీ+హాట్‌స్టార్ నిర్ణయించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. మొత్తంగా 5.5 బిలియన్ డాలర్ల మేర ఖర్చులను తగ్గించుకోవాలని డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ నిర్ణయించారు. ఇందులో మూడు బిలియన్ డాలర్ల నాన్ స్పోర్ట్స్ కంటెంట్, 2.5 బిలియన్ డాలర్ల విలువైన ఇతర కంటెంట్‌ను తగ్గించుకోవాలన్నది డిస్నీ భావిస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఇటీవల ఏడువేల మంది ఉద్యోగులను సైతం డిస్నీ తొలగించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ హక్కులను సైతం ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్ వదులుకుంది. హెచ్‌బీఓతో ఒప్పందం వదులుకోవడమూ అందులో భాగమేనని తెలుస్తోంది.