ల్యాండ్ మాఫియాకు బ్యాడ్ న్యూస్
నీ పాపం పండెను నేడు… నీ భరతం పడతా చూడు… అన్న పాటను గుర్తుకు తెచ్చుకోండి ఇక. కరీంనగర్ లో నాలుగో సింహం జూలు విదుల్చుతోంది. సామాన్యునికి నరకం చూపించిన అక్రమార్కులను వెంటాడి వేటాడి కటకటాలకు పంపే పనిలో కమిషనరేట్ పోలీసు రంగంలోకి దిగింది. గుట్టు చప్పుడు కాకుండా సిద్దం చేసిన చిట్టాతో ఒక్కొక్కరిని కటకటాల వెనక్కి పంపే పనిలో పడింది. కొత్త కొత్వాల్ వచ్చిన తర్వాత సమూల మార్పులు ఉంటాయని అందరూ ఊహించినా… గతంలోలానే పరిపాలన సాగుతోందని నిరాశ పడుతున్న వారికి టానిక్ లాంటి విషయం ఇది. దాదాపు దశాబ్దం క్రితం ఉమ్మడి జిల్లాలో అన్నల ఏరివేత కోసం ఆపరేషన్స్ చేపట్టిన ఆ బాస్ ఇప్పుడు కమిషనర్ హోదాలో అక్రమార్కులపై ఉక్కు పాదం మోపే ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారు.
జాబితా సిద్దం…
కరీంనగరాన్ని పట్టి పీడిస్తున్నది భూ మాఫియా… దర్జా తనం ఒలక బోస్తూ సామాన్యులను మోసం చేస్తూ కోట్లకు పడగలెత్తిన క్రిమినల్స్ చర్యలను అడ్డుకునే వారే లేకుండా పోయారింతకాలం. ఇప్పుడు వారి వివరాలను సేకరిస్తున్నారు కరీంనగర్ పోలీసులు. భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు, కబ్జాదారులకు సంబందించిన చిట్టా తయారు చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. కొందరిపై సస్పెక్ట్ షీట్లు, నేరాల తీవ్రతను బట్టి మరి కొందరిపై కేసులు, పిడియాక్టుల అమలు చేయాలన్న యోచనలో కమిషనర్ సుబ్బారాయుడు ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబందించిన ప్రక్రియ అంతా సిద్దం చేసిన కమిషనర్ ‘ఆపరేషన్ ల్యాండ్ మాఫియా’ స్టార్ట్ చేస్తున్నారు.
సివిల్ కేసులంటూ…
సివిల్ కేసులంటూ కోర్టులను ఆశ్రయించాలన్న బూచి చూపుతూ ఇంతకాలం సామాన్యుడిని హింసించిన వారి భాగోతం బట్టబయలు కావాలని సీపీ ఆదేశించారు. నకిలీ డాక్యుమెంట్లూ సృష్టించి క్రయ విక్రయాలు జరిపి అక్రమ దందాలకు పాల్పడిన వారి జాబితాను తయారు చేస్తున్నారు పోలీసులు. ల్యాండ్ సెటిల్ మెంట్లలో కింగులుగా ఎదిగి రింగులు తిప్పుతున్న వారి బండారం సేకరించాలని నిర్ణయించారు. భూ దందాల్లో కేసులు నమోదైనప్పటికీ తిరిగి అదే రకమైన నేరాలకు పాల్పడిన వారు, నేటికీ పాల్పడుతున్న వారితో పాటు పీడీ యాక్టు జాబితాలో ఉన్న వారు, ఏడాది పాటు పీడీ యాక్టు కారణంగా జైలు జీవితం గడిపిన వారి వివరాలను స్టేషన్ల వారీగా తయారు చేయడంలో కమిషనరేట్ పోలీసులు నిమగ్నం అయ్యారు. సామాన్యుడి సొంతింటి కల సాకారం కాకుండా నిర్మాణం చేపట్టగానే గ్యాంగులతో వెల్లి దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారి వివరాలను సైతం వదలొద్దని సీపీ ఆదేశించారు. లీగల్ గా అన్ని ఉన్నా బెదిరిస్తూ అదిరిస్తూ కట్టడాలను కూల్చే వారి డాటా కూడా సేకరిస్తున్నారు. భూ అక్రమణలు, కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై సస్పెక్ట్ షీట్లను తెరిచి వారిపై నిఘా కనులు దృష్టి సారించనున్నాయి. ఆ తరువాత కూడా నేరమయ ప్రపంచంలోనే జీవిస్తే మరింత కఠినంగా వ్యవహరించనున్నారు కరీనంగర్ పోలీసులు.
వాటినీ వదలం…
భూ దందాలకు సంబందించిన ఎలాంటి క్రిమినల్ చర్య అయినా కూడా వదిలేది లేదని, గతంలో స్టేషన్లకు వచ్చిన ఫిర్యాదులు ఒత్తిళ్లతో రాజీ కుదిర్చినట్టయితే వాటి వివరాలు కూడా సేకరించి కఠినంగా వ్యవహరించాలని కూడా సీపీ సుబ్బారాయుడు నిర్ణయించారు. భూ వ్యవహారాలకు సంబందించి గతంలో సద్దుమణిగిపోయినప్పటికీ వాటిని లోతుగా అధ్యయనం చేసి అన్యాయం జరిగిన వారికి బాసటనిచ్చేందుకు నిన్నోదళ బొమ్మాళి అన్నట్టుగా వ్యవహరించనున్నారు. తప్పించుక తిరుగుతున్న క్రిమినల్స్ జాడ తెలుసుకోవడం, వారి చర్యలపై ఆరా తీసే పనిలో పడ్డారు.
ఫిర్యాదుల పరంపర..
కరీంనగర్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సుబ్బరాయుడుకు వరస ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ప్రవాహపు నీటిని మరిపించే విధంగా భూ దందాగాళ్ల కభంద హాస్తాల్లో ఇరుక్కపోయిన బాధితులు కమిషనర్ కార్యాలయం వద్ద క్యూ కడుతున్నారు. నిరంతర ప్రక్రియలా సాగుతున్న ఈ తంతుకు బ్రేకులు వేయాలంటే చట్టాలకు పనిచెప్పాల్సిందేనని భావించారు సీపీ. బాధితుల కన్నీటి బాధల విని వారిని అక్కున చేర్చుకుని బాసటనివ్వాలని కరీంనగర్ పోలీస్ బాస్ నిర్ణయం తీసుకున్నారు.