బీసీ సీఎం అభ్యర్థి బండి సంజయ్…మంద కృష్ణ మాదిగ సంచలన ప్రకటన

దిశ దశ, కరీంనగర్:

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిందని, రాష్ట్ర ముఖ్యమంత్రికి కంటిమీద కునుకు లేకుండా చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సీఎం అభ్యర్థి కానున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ అంశం గురించి ఇటీవల కాలంలో జాతీయ స్థాయి నాయకులతో తరుచూ సమావేశాలు జరిపి ఇందుకు అనుకూలంగా ప్రధాని నరేంద్ర మోడీచే ప్రకటన చేయించుకోవడంలో సఫలం అయిన మంద కృష్ణ మాదిగ బండి సంజయ్ సీఎం అభ్యర్థిని వ్యాఖ్యానించడం సరికొత్త చర్చకు దారి తీసింది. రాష్ట్రంలో అణగారిన మాదిగ జాతి బిడ్డల గురించి బీజేపీ జాతీయ నాయకులను కలిసిన సందర్భంలో బీసీ సీఎం అభ్యర్థి అంశం కూడా ఆయన వద్ద వారు మాట్లాడి ఉంటారని బావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీజేపీ మెయిన్ లీడర్స్ లో  ఒకరైన బండి సంజయ్ గురించి జాతీయ నాయకత్వం మంద కృష్ణ వద్ద సూత్ర ప్రాయంగా చర్చించినందునే ఆయన ఈ ప్రకటన చేసి ఉంటారన్న భావన కరీంనగర్ బీజేపీలో వ్యక్తం అవుతోంది. అంతేకాకుండా బండి సంజయ్ అంటే ప్రధాని నరేంద్ర మోడీ అండదండలు ఉన్నాయని కూడా మంద కృష్ణ మాదిగ ప్రస్తావించడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు సీఎం అభ్యర్థి గురించి ప్రకటించినట్టయితే అంతగా ప్రాధాన్యత ఉండకపోయేది కానీ… మూడు దశాబ్దాలకుపైగా ఏ పార్టీతో సంబంధం లేకుండా తన జాతి అభ్యున్నతి కావాలంటే వర్గీకరణ ఒక్కటే మార్గమని భావించి ఉద్యమం చేసిన చరిత్ర ఆయన సొంతం. ఇదే అంశం గురించి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జాతీయ నాయకులతో పలు మార్లు చర్చలు జరిపి ఎస్సీ వర్గీకరణకు సానుకూల వాతవారణం తీసుకరావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వం రాష్ట్ర రాజకీయ పరిణామాల గురించి ఖచ్చితంగా చర్చించడంతో పాటు రాష్ట్రంలో బీజేపీ బలంగా విస్తరించకపోవడానికి కారణాలు ఏంటీ అన్న వివరాలు మంద కృష్ణను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు బీజేపీకి ఇటీవల కాలంలో పెరిగిన క్రేజీ, బండి సంజయ్ పాదయాత్ర తదితర అంశాల గురించి మంద కృష్ణ వివరించడంతో బీజేపీ జాతీయ నాయకత్వంపై రాష్ట్రంలోని పరిస్థితులపై ఓ సంపూర్ణ అవగాహనకు వచ్చినట్టుగా అంచనా వేస్తున్నారు. దీంతో బీజేపీ పార్టీ పెద్దలు కూడా తెలంగాణాలో పార్టీ వైఫల్యానికి కారణాలపై నిఘా వర్గాలతో పాటు ఏజెన్సీల ద్వారా కూడా సమగ్ర నివేదికలు తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. వీటిన్నింటిని బేరీజు వేసుకున్న తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని విస్తృతం చేసినట్టు అర్థమవుతోంది. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు జాతీయ నాయకత్వం స్పెషల్ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టి ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రాష్ట్రంలో ఒకటి రెండు సభలతోనే సరిపెట్టిన  బీజేపీ జాతీయ నాయకులు ఈ సారి తెలంగాణాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉందన్న నివేదికలు అందిన నియోజకవర్గాలను కూడా బీజేపీ నేతలు చుట్టి వస్తుండడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇదే క్రమంలో బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పెట్టిన జాతీయ నాయకులు క్షేత్ర స్థాయి పర్యటనలతో పార్టీలో దూకుడును మరింత పెంచారు. అయితే బీసీ ముఖ్యమంత్రిని ఎవరిని చేస్తే బావుంటుందన్న ఆలోచన చేసినప్పుడు బండి సంజయ్ పేరును బీజేపీ జాతీయ నాయకులు పరిశీలించినట్టుగా భావిస్తున్నారు. ఈ విషయం గురించి మంద కృష్ణ మాదిగతో కూడా బీజేపీకి చెందిన ముఖ్యనాయకులు చర్చించి ఉంటారని ఈ కారణంగానే ఆయన బండి సంజయ్ సీఎం అభ్యర్థి అని ప్రకటించి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా కరీంనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ పేరు సీఎం పరిశీలనలో ఉందన్న విషయం మంద్ర కృష్ట మాదిగ ప్రకటనతో తేటతెల్లం అయింది. దీంతో కరీంనగర్ బీజేపీ శ్రేణులు మరింత ఉత్సాహంతో సం.య్ గెలుపు కోసం కార్యరంగంలోకి దూకనున్నారని స్పష్టం అవుతోంది.

You cannot copy content of this page