కరీంనగర్ ఎంపీగా సం‘‘జయం’’ … రికార్డు అందుకున్న నేత…

దిశ దశ, కరీంనగర్:

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రెండో సారి కూడా కరీంనగర్ ఎంపీగా గెలిచారు. తాజాగా జరిగిన లోకసభ ఎన్నికల్లో ఆయన అనూహ్య మెజార్టీ సాధించారు. 2.25 లక్షల మెజార్టీతో కరీంనగర్ రికార్డును తిరగరాశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బండి సంజయ్ తనదైన ముద్ర వేసుకుని కరీంనగర్ లో పట్టు నిలుపుకోవడం గమనార్హం.

ఎవరూ లేకున్నా…

బండి సంజయ్ కరీంనగర్ లోకసభ నుండి పోటీ చేసి ఒంటరి పోరాటం చేశారనే చెప్పాలి. ఏడు సెగ్మెంట్లలో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు గెలవకున్నా ఆయన మాత్రం రెండో సారి లోకసభకు అడుగుపెట్టారు. 2019లో జరిగిన ఎన్నికలప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురైనప్పటికీ సంజయ్ 89 వేల పై చిలుకు మెజార్టీతో గెలుపును అందుకున్నారు. కేవలం హిందుత్వ నినాదంతోనే తొలిసారి కరీంనగర్ నుండి ప్రాతినిథ్యం వహించిన సంజయ్ రెండో సారి కూడా కూడా పార్టీ ఎమ్మెల్యేలు లేకున్నా రికార్డు స్థాయిలో మెజార్టీ అందుకున్నారు. ఏడు సెగ్మెంట్లలో మూడు సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తుండగా నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ బండి సంజయ్ 2.25 లక్షల మెజార్టీతో గెలవడం గమనార్హం. కరీంనగర్ నుండి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన సిహెచ్ విద్యాసాగర్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. కానీ సంజయ్ మాత్రం కార్పోరేటర్ గా వ్యవహరిస్తూ లోకసభకు ఎన్నికయ్యారు.

సాగర్ జీ…

కరీంనగర్ నుండి బీజేపీ ఎంపీలుగా వరసగా రెండు సార్లు గెలిచిన చరిత్ర ఆ పార్టీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావుకు ఉంది. అయితే ఆయన మొదటి సారి 90 వేల మెజార్టీతో గెలిస్తే రెండో సారి 19 వేల మెజార్టీతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. కరీంనగర్ ఎంపీగా గెలిచిన తరువాతే సాగర్ జీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించగా, బండి సంజయ్ కూడా స్టేట్ చీఫ్ గా వ్యవహరించారు. విద్యాసాగర్ రావు గోదావరి జలాల వినియోగం కోసం పాదయాత్ర చేస్తే… బండి సంజయ్ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. సొంత నియోజకవర్గంలో కూడా పాదయాత్ర చేసి ఏడు సెగ్మెంట్లలోనూ పాదయాత్ర చేసిన రికార్డును సొంతం చేసుకున్నారు బండి సంజయ్. అయితే సాగర్ జీని కరీంనగర్ ప్రజలు రెండో సారి అక్కున చేర్చుకునేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. ఈ కారణంగానే ఆయన మొదటి సారి 90 వేల మెజార్టీతో గెలిస్తే… రెండో సారి 19 వేల ఆధిక్యత సాధించారు. కానీ సంజయ్ ఇందుకు భిన్నంగా 2019 ఎన్నికల్లో 89 వేల మెజార్టీ సాధించగా, తాజా ఎన్నికల్లో 2.25 లక్షల మెజార్టీ అందుకోవడం విశేషం.

ఆ రికార్డు కూడా… 

మరో వైపున కరీంనగర్ నుండి ఉద్యమ నేతగా బరిలో నిలిచిన కేసీఆర్ అందుకున్న మెజార్టీని, 2014లో గెలిచిన బోయినపల్లి వినోద్ కుమార్ మెజార్టీని కూడా బండి సంజయ్ అధిగమించడం మరో విశేషం. 

You cannot copy content of this page