బండి ‘బలగం’ ఏమైంది..? ఎదిగిన కొద్ది ఒదగ లేదా..?

దిశ దశ, కరీంనగర్:

దేశం కోసం… ధర్మం కోసం… హిందుత్వమే నా నినాదం అంటూ వినిపించిన ఆ గొంతుకను వేలాది మంది యువత అనుకరించింది. దశాబ్దానికి పైగా ఆ నోట వచ్చే మాటల విని పులకరించిపోయింది. ఆయన మాటల తన్మయత్వంలో తేలియాడుతూ అన్న గెలుపే మా శ్వాస అన్నట్టుగా వ్యవహరించింది. ఆయన నిలబడిన ప్రతి ఎన్నికలోనూ ఇంటికి దూరంగా ప్రచారానికి దగ్గరగా అన్నట్టుగా వ్యవహరించింది. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఆ నేతకు దన్నుగా నిలవాలని పరుగు పరుగున వెళ్లి బాసటగా నిలిచింది. ఆర్థిక వనరులు లేవు కానీ ఆయనకు అధికారం కట్టబెట్టాలన్న లక్ష్యమే ఆ యువత ముందు ఉండేది. ఇప్పుడు మాత్రం అప్పటి వాతావారణానికి పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వేలాది మంది…

అటు పార్టీలో ఇటు ప్రజా క్షేత్రంలో బండి సంజయ్ ని అణిచివేయాలన్న లక్ష్యంతో పావులు కదిపారు ఆయన ప్రత్యర్థులు. అయినా హిందుత్వ నినాదాన్ని మాత్రం వీడకుండా సంజయ్ దూకుడుగానే వ్యవహరించారు. కాషాయం జెండా నీడలోనే ముందుకు సాగుతూ లోకసభ ఎన్నికల్లో విజయం సాధించి ఆయన శత్రువులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అంచుల వరకు చేరుకున్న బండి సంజయ్ కి వెన్నుదన్నుగా నిలిచింది మాత్రం హితులు, సన్నిహితులు, యువత మాత్రమే. మహిళా మణులు అండర్ గ్రౌండ్ వర్క్ చేయగా యువత బహిరంగంగా తిరుగుతూ సంజయ్ గెలుపు కోసం నిద్రహారాలు మానకున్న సందర్బాలు ఎన్నెన్నో. ఒకరు కాదు ఇద్దరు కాదు వేలాది మంది యువత బండి సంజయ్ కి రక్షణ కవచంగా ఉంటూ ఆయన్ను విజయ తీరాలకు చేర్చాలన్న సంకల్ప బలంతో ముందుకు సాగింది.

నాడు కిటకిట…

ఎన్నికల వాతావరణం వచ్చిందంటే చాలు బండి సంజయ్ నివాసం ఉండే వీధి అంతా యువతరంతో కిక్కిరిసిపోయేది. తల్లిదండ్రుల మాటలను కూడా కాదని బండి సంజయ్ కోసం ఆహర్నిశలు పనిచేస్తామని దీక్ష బూనిన యూత్ అంతా ఆయన ఇంటి వద్దే పడిగాపులు పడింది. రాత్రనక పకగలనక బండి సంజయ్ గెలుపు కోసం పనిచేసిన వారంతా అంతా కూడా నేడు దూరం అయ్యారు. ఎంపీగా గెలిచి, రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత క్యాడర్ కు దూరం అయి లీడర్ గా మాత్రమే మిగిలిపోయాడన్న వేదన ఆయన అడుగు జాడల్లో నడిచిన వారిలో వ్యక్తమవుతోంది. తల్లిదండ్రులు, భార్యా పిల్లలను పట్టించుకోకుండా శ్రమించిన యువతను విస్మరించిన తీరుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

షాడో… ఎఫెక్ట్…

సాధారణ వ్యక్తిగా ఉన్న కాలంలో బాసటగా నిలిచి భరోసా ఇచ్చిన వారిని ఎదుగుతున్న కొద్ది దూరం చేసుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టాడన్న అపవాదును బండి సంజయ్ మూటగట్టుకున్నారు. అన్న నువ్వే మా సర్వస్యం అంటూ అండదడలు అందించిన వారందరిని తెరమరుగు చేసిన తీరు అందరినీ ఆశ్యర్చపరుస్తోంది. ఒకప్పుడు తనను మోసం చేశారంటూ బాహాటంగా విమర్శలు చేసిన వారినే అక్కున చేర్చుకుని ఆయన ఎదగాలని ఆకాంక్షించిన వారిని విస్మరించాడన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారు ఎందరో. ‘మహశక్తి’ అమ్మవార్ల కన్న ఎక్కువగా శక్తి ఉందని నమ్మే కొంతమంది ‘షాడో’లు బండి సంజయ్ ని తప్పుదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయనను నీరో చక్రవర్తిలా మార్చేశారని కూడా అంటున్న వారూ లేకపోలేదు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో సంజయ్ విజయమే పరమావధిగా పనిచేయాల్సిన యువత మాత్రం కానరాకపోవడం ఆయన అభిమానులను కలిచివేస్తోంది. ఆయనను అసెంబ్లీకి పంపించాలన్న లక్ష్యంతో మనస్పూర్తిగా పనిచేసే క్యాడర్ లేకుండా పోవడంపై తర్జనభర్జనలు కూడా కొనసాగుతున్నాయి.

You cannot copy content of this page