దిశ దశ, న్యూ ఢిల్లీ:
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మూడేళ్లకు పైగా పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నం అయిన సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధిష్టానం నియమించింది. అనంతరం సంజయ్ కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడంతో కొద్ది సేపటి క్రితం సంజయ్ న్యూ ఢిల్లీలోని జాతీయ పార్టీ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు.
మోడి రాజ్యమే లక్ష్యం: బండి సంజయ్
తెలంగాణాలో రామ రాజ్యం, మోడి రాజ్యమే లక్ష్యంగా పని చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వెల్లడించారు. న్యూ ఢిల్లీలో నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోడీ మార్గదర్శనంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, తనకు బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డాల నమ్మకానికి అనుగుణంగా ముందుకు సాగుతూ పార్టీ క్యాడర్ లో నూతనోత్తేజం నింపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని బండి సంజయ్ అన్నారు. వారి ఆశయాల మేరకు కాషాయ జెండా రెపరెపలు ఆడే విధంగా ప్రజల్లోకి పార్టీని తీసుకెల్తానని ప్రకటించారు.