ఆయన్ని మార్చడం వెనక కుట్ర జరిగిందా..? ఫిర్యాదుల పరంపర కొనసాగిందా..?

బండి సంజయ్ కామెంట్స్ పై సర్వత్రా చర్చ

దిశ దశ, హైదరాబాద్:

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష్య స్థానం నుండి తొలగించడం వెనక కుట్ర జరిగిందా..? ఆయన్ని తప్పించేందుకు గిట్టని వారు ఫిర్యాదుల పరంపర కొనసాగించారా..? కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం రోటీన్ గా జరిగింది కాదా అన్నదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో సాగుతున్న చర్చ. తాజాగా సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి.

ఆయన ఏమన్నారంటే..?

శుక్రవారం బీజేపీ స్టేట్ చీఫ్ గా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తాజా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల అధ్యక్షులను తొలగించినట్టుగానే బండి సంజయ్ ని తొలగించామని అధిష్టానం ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చినప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఆయన్ని కావాలనే తప్పించారన్న వాదనలు వినిపించాయి. బీజేపీతో పాటు కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కూడా సంజయ్ ని మార్చడం వెనక కారణాలేంటన్న అనుమానాలు వ్యక్తం చేశాయి. వివిధ వర్గాల్లో కూడా బండిని తొలగించడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో పాటు ఆయనను కావాలనే అధిష్టానం తీసేసిందని, ఇటీవల కాలం వరకు సంజయ్ ని తొలగించే ప్రసక్తే లేదని అధిష్టానం చెప్పి చివరకు ఆయనను మార్చడం వెనక మాత్రం ఏదో జరిగిందన్న అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఏం జరిగింది అన్న క్లారిటీ మాత్రం లేకున్నప్పటికీ శుక్రవారం నాడు జరిగిన కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ వేదిక మీదుగా సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నాపై తప్పుడు ఫిర్యాదులు చేసి తొలగిస్తే తొలగించారు కానీ కిషన్ రెడ్డి గారిపై అలాంటివి చేయవద్దని కోరారు. ఆయన్ని ప్రశాంతంగా పార్టీ బలోపేతం కోసం అవసరమైన చర్యలు తీసుకునే వాతవారణం కల్పించాలని కూడా సంజయ్ కోరారు. అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ వర్గాల్లో నెలకొన్న అనుమనాలకు సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చినట్టయింది. ఆయన్ను రోటీన్ గా బాధ్యతల నుండి తప్పించలేదని, ఆయనపై లేనిపోని ఫిర్యాదులు చేయడంతోనే అధిష్టానం తొలగించిందన్న వాదనలు నిజమేనని స్పష్టం అయిపోయిందని అంటున్నవారూ లేకపోలేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోకి పార్టీని తీసుకెళ్లడంలో కృషి చేసిన సంజయ్ ని తొలగించడాన్ని తాను కూడా జీర్ణించుకోలేకపోతున్నానని, బాత్రూంలోకి వెల్లి ఏడ్చానని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టయితే సంజయ్ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page