ఆకాశ రామన్న ఉత్తరాలు… అయోమయానికి గురి చేసే చర్యలు…

బంటి రాధ @ నీల్సో విచారణ నివేదిక విడుదల చేసిన మావోయిస్టులు

20 రోజుల పాటు పూర్తి వివరాలు సేకరించమంటున్న నక్సల్స్…

దిశ దశ, దండకారణ్యం:

దండకారణ్య అటవీ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీని కోవర్టులు వెంటాడుతున్నారు. పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న వారే నిఘా వర్గాలతో సంబంధాలు పెట్టుకుని లీకులు ఇస్తున్నారు. అంతర్గత రహస్యలు పోలీసులకు చేరవేసేందుకు పని చేస్తున్న తీరు తీరని నష్టాన్ని కల్గిస్తోంది. బంటి రాధా అలియాస్ నీల్సో కోవర్టుగా మారిందన్న విషయాన్ని దృవీకరించుకునేందుకు పార్టీ పలు అంశాల్లో ఆరా తీసింది. చివరకు 20 రోజుల పాటు నీల్సోను పార్టీ నాయకత్వం వివిధ కోణాల్లో ప్రశ్నించింది. తాను పార్టీకి ద్రోహం చేశానని నాయకత్వం ముందు ఒప్పుకుందని తేలింది. మావోయిస్టు పార్టీ నాయకత్వం బంటి రాధ విప్లవ ద్రోహానికి సంబంధించిన అంశాలను క్రోడీకరిస్తూ 13 పేజీల లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో పలు అంశాలను పార్టీ ప్రస్తావిస్తూ ఆమెను చంపిన తీరుపై జరుగుతున్న చర్చపై ఓ రిపోర్టు అందిస్తున్నామని ఆ లేఖలో వివరించింది మావోయిస్టు పార్టీ. అయితే ఈ లేఖను కేంద్ర కమిటీ విడుదల చేసిందా లేక… ఇతర కమిటీలు విడుద ల చేశాయా అన్న వివరాలు మాత్రం లేవు. కేవలం నీల్సో కోవర్టుకు సంబంధించిన అంశాలపై వివరణాత్మక ప్రకటన అయితే విడుదల చేసింది. ఆ లేఖలో పేర్కొన్న అంశాలను బట్టి…

20 రోజుల విచారణ…

కొంతకాలంగా బంటి రాధ అలియాస్ నీల్సో కదలికలపై అనుమానాలు రావడంతో పార్టీ నాయకత్వం అమె నడవడికపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చివరకు ఆమె కోవర్టుగా మారినట్టుగా గుర్తించడంతో జులై 29 నుండి ఆగస్టు 9 వరకు 20 రోజుల పాటు విచారణ జరిపాం. ఇందులో బంటి రాధ మొదట కొన్ని విషయాలు దాచి పెట్టే ప్రయత్నం చేసినా నాయకత్వం పదే పదే ప్రశ్నించడంతో పూర్తి వివరాలను వెల్లడించింది. రాధ అలియాస్ నీల్సో కుటుంబ సభ్యులను నిఘా వర్గాలు ట్రాప్ చేసి ఆమె తమ్ముడి ద్వారా పార్టీకి నష్టం కల్గించే విధంగా ప్రయత్నాలు చేశాయి. మొదట కుటుంబ సభ్యుల పాత్రకు సంబంధించిన అంశాలను వెల్లడించని నీల్సో చివరకు తమ్ముడి ప్రమేయాన్ని వివరించినట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. కొన్ని నెలల క్రితం పత్రికా ప్రకటనల కోసం నాయకత్వం ఫోన్ ఇచ్చి పంపినప్పుడు మొదట నా పాత మిత్రురాలు మమత ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటూ… ఉద్యమం నుండి బయటకు రావాలని సూచించినట్టుగా బంటి రాధ పార్టీకి వివరించింది. ఆమె ఫోన్లో మాట్లాడుతుండగానే మరో వ్యక్తి కాంటాక్టులోకి వచ్చి తన పేరును వాసుగా పరిచయం చేసుకొని తను డిపార్టమెంట్ లో పని చేస్తున్నట్లుగా చెప్పాడని వివరించింది. దీంతో మమత కూడా పోలీసులతో టచ్ ల ఉన్నట్టుగా అర్థమైందని పేర్కొన్న రాధ వాసు తనకు సహకరించాలని కోరుతూ రాజకీయంగా బలహీనపరిచే పద్ధతిలో మాట్లాడుతూ… సమయం తీసుకొని ఆలోచించమని కూడా చెప్పాడంది. పార్టీకి సంబంధించిన కొన్ని అంశాల గురించి కూడా వాసు అనే వ్యక్తి అడిగిన వివరాలేంటంటే..? మీ బాధ్యుడు ఏ ప్రాంతంలో ఉంటున్నాడు? నిర్దిష్ట లొకేషన్ ను పంపించాల, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని ఏఏ మందులు వాడుతున్నారు, ఇందు కోసం ఎవరిపై ఆధారపడుతున్నారు అన్న వివరాలను చెప్పాలన్నాడని, ప్రజా సంఘాలతో సమన్వయం ఎలా జరుగుతోంది, అందుకు ఏర్పచుకున్న రహస్య మెకానిజం ఏమిటో తెలియజేయాలని, నాయకత్వం 
కలిసే ప్రదేశాలు, సమావేశ నిర్వహణ స్థలాలు తదితర సమాచారాన్ని వెంటనే అందజేయాలని, పార్టీ నాయకత్వం దగ్గర ఉండే కీలకమైన  సమాచారాన్ని సేకరించి పంపించాలని కోరినట్టుగా రాధ విచారణలో వెల్లడించింది. ఒక వేళ ప్రమాదం ముంచెత్తే అవకాశం ఉంటే వాటిని తీసుకుని పారిపోయి తాము ఏర్పాటు చేసిన ఛానల్ లో వచ్చి కలవాలి’ అని చెప్పాడని నీల్సో వివరించింది. 

తమ్ముని ఎంట్రీ…

అయితే వాసు అడిగిన వివరాలు అందించే విషయంలో తాను సాహసించాలా లేదా అన్న తర్జనభర్జనకు గురవుతున్న క్రమంలో తన తమ్ముడు సూర్యం కూడా టచ్ లోకి వచ్చాడని నీల్సో వివరించింది. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, అమ్మ అనారోగ్యం, నాన్న కుటుంబ బాధ్యతల్ని పట్టించుకోకపోవడం, తాను నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటూ వచ్చానని, ఆ సమయంలో ఇంటలిజెన్సి అధికారులు స్వయంగా ఇంటికి వచ్చి మొదట రాధ ఉద్యమంలోకి ఎలా వెళ్ళింది? ఆమెను పార్టీకి పరిచయం చేసింది ఎవరు? అని అడిగి తెలుసుకున్నారని చెప్పాడంది.
తమకు సహకరిస్తే ఉద్యోగం అవకాశం కల్పిస్తామని, కుటుంబ ఆర్థిక సమస్యల్ని తీరుస్తామని చెప్పడంతో ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ అధికారులతో సంబంధాలు పెట్టుకున్నానని తన తమ్ముడు చెప్పినట్టుగా రాధ వివరించింది. జీపీఎస్ ట్రాకర్స్ తయారు చేయించే 
పనిలో శిక్షణ ఇచ్చిన అధికారులు డబ్బులు కూడా ఇచ్చి, ఇంటలీజెన్స్ వింగ్ లో ఏజెంటుగా పని చేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పడంతో అందుకు అంగీకరించానని తెలిపాడని చెప్పింది. మొదట్లో తాను ఒక్కడినే పని చేశానని, మరో నలుగురు ప్రీతి, సురేష్, రాజు, సురేష్ లను అప్పగించి ఆ టీంకు తనను ఇంఛార్జిగా పెట్టారని చెప్పినట్టుగా తెలిపింది. ప్రజా సంఘాలపై నిఘా పెట్టి వారి కదలికలను, కార్యకలాపాలను, వారితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న విషయాలను ఎప్పటికప్పుడు ఆఫీసర్లకు చేరవేయాల్సి ఉంటుందని సూర్యం చెప్పినట్టుగా నీల్సో పార్టీకి తెలిపింది. ఇలాంటి మరిన్ని టీమ్స్ ను తయారు చేసి ఒకరి విషయాలు మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని తెలిపాడంది. ఓ సందర్భంలో తాను పార్టీకి పెద్ద నష్టాన్నే చేకూర్చానని, అందేకు తనకు రూ. లక్ష ఇవ్వడంతో మోటర్ బైక్ కొన్నానని చెప్పాడని, అయితే తన వల్ల పార్టీకి జరిగిన నష్ట గురించి వివరించనని బయటకు పొక్కితే పార్టీ చంపే ప్రమాదం ఉంటుందని కూడా వివరించాడంది. అయితే తాను  కల్పించుకున ఈ విషయాలు ఫోన్ లో మాట్లాడుతున్నావు. కదా ఇంటలిజెన్స్ వర్గాలు ట్రాప్ చేసే ప్రమాదం ఉండదా? అని అడిగానని, అలాంటి సమస్య రాకుండానే కొత్త టెక్నాలజీని ఉపయోగించి మాట్లాడుతున్నానని సూర్యం చెప్పాడంది. తాను బ్రతకడానికి ఈ పనిని వదులుకోలేననీ, ఎట్టి పరిస్థితులలో నీ సంబంధాలు కానీ, నా పని గురించి గాని పార్టీకి తెలిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించడాని కూడా పేర్కొంది. ఇలా రెగ్యూలర్ గా తన తమ్ముడితో ఫోన్లో మాట్లాడుకున్నామని కూడా వివరించిన రాధ పనిఘా వర్గాలకు పార్టీ గురించి కొన్ని విషయాలు అప్పటికే తెలిసింనదున వాటికి మరిన్ని విషయాలను జోడించి చెప్పానని రాధ వివరించింది. అయితే తాను చెప్పిన విషయాలు వెంటనే పార్టీకి వెంటనే నష్టం చేకూర్చవని భావించానని తెలిపింది. పార్టీ బాధ్యుడు ఉండే ప్రాంతం, అనారోగ్య రిపోర్టు, వాడుతున్న మందులు, అందుకు ఆధారపడుతున్న వ్యక్తుల వివరాలు చెప్పానట్టుగా రాధ వివరించడంతో పాటు ఏఓబీలోని నాయకత్వ కదలికలు, ప్రస్తుత కార్యక్రమాల గురించి కూడా చెప్పినట్టుగా నాయకత్వం ముందు ఒప్పుకుంది. పార్టీ నాయకులను కలిసే వ్యక్తులు, మరికొన్ని వివరాలతో పాటు పార్టీ లీడర్ల మధ్య జరిగే కో ఆర్డినేషన్ మెకానిజం గురించి కూడా చెప్పినట్టుగా ఒప్పుకుంది.

మరింత మంది కోవర్టులు…

అయితే బంటి రాధ అలియాస్ నీల్సో ఇచ్చిన సమాచారాన్ని బట్టి మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో మరింత మంది కోవర్టులు కూడా ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. రాధ ద్వారా పోలీసు అధికారులు క్రాస్ చెక్ చేసుకున్న క్రమంలో ఆమె కంటే ముందే పోలీసు అధికారులకు చేరతున్నట్టుగా స్పష్టం అయింది. జూన్ చివర్లో ముఖ్య నాయకత్వం సమావేశం కోసం ఓ చోట కలిసిన విషయం ముందే నిఘా వర్గాలకు తెలిసిందని, చత్తీస్ ఘడ్ ఇంటలిజెన్సీ అధికారి కాంటాక్టులోకి వచ్చి కొన్ని ప్రశ్నలు వేసి తాను ఇచ్చిన సమాచారం సరైందా? కాదా అని క్రాస్ చేసుకున్నారని బంటి రాధా వివరించింది. ముఖ్య నాయకత్వం కలిసిన క్యాంపులో ఉన్నవారి పేర్లు, బలగాల సంఖ్య, సెంట్రీ పోస్టులు, ఆ క్యాంపు చుట్టు ఏర్పరుకున్న రక్షణ వలయం తీరు, డేరా ఉన్న స్థలం తదితర విషయాలు అడిగిన పోలీసు అధికారి నిజమా? కాదా? అని క్లారిఫై చేసుకున్నారని, వాళ్ళడిగిన వాటన్నింటికి సమాధానం చెప్పినట్టుగా వివరించింది. ఏపీ, తెలంగాణ పోలీసుల్లా చిన్న చిన్న విషయాలు అడగమని, ఒకే ఒక్క పనిని పూర్తి చేయాల్సి ఉంటుందని చత్తీస్ గడ్ పోలీసు అధికారి తనతో చెప్పారని altitude app తెలుసా అని అడిగిన సదరు అధికారి ఒక వేళ తెలియనట్టయితే google లోకి వెళ్ళి సెర్చ్ చేసి దాని ఆధారంగా నాయకత్వం ఉండే ఒక్కొక్క డేరాను లొకేట్ చేస్తూ జీపీఎస్ ద్వారా పాయింట్ సేవ్ చేసి పంపించామన్నాడని పేర్కొంది. ఇందుకోసం క్యాంపులోనే ఉన్న మరొక వ్యక్తి కలిసి సహాకారం అందిస్తాడని, ఆయనకు చాలా అవగాహన ఉందని, సీక్రసి మెయింటెన్ చేస్తాడని సదరు అధికారి చెప్పినట్టుగా రాద వివరించింది. తెలంగాణలో పని చేస్తున్న రాజ్ కుమార్ అనే సభ్యుడు కూడా తమతో టచ్ లో ఉన్నాడని, ఆయన మద్దతును కూడా తీసుకోమని సూచించినట్టు చెప్పాడంది. అలాగే దక్షిణ్ బస్తర్ డివిజన్ కంప్యూటర్ ఆపరేటర్, ప్రెస్ ఇంచార్జ్ గా ఉన్న మనీష్ అనే ఏరియా కమిటీ సభ్యుడు ఒకరోజు ఒంటరిగా ఉన్న సమయంలో తనను కలిసి ‘సార్ కలిసాడా? సార్ అప్పగించిన పని చేసావా?’ అని అడిగగా… నీవే చేయవచ్చు కదా అని అన్నానని, ఆ పని తనకు అర్థం కావడం లేదు కనుకే సార్ నీకు ఈ బాధ్యతను అప్పగించాడన్నాడని తెలిపింది. ఈ పనిలోకి దిగిన తర్వాత భయపడకుండా ప్రాణం పోయినా చివరి వరకు పని చేయాలని మోటివేట్ చేస్తూ ఒక ఉత్తరాన్ని టైప్ చేసి పెన్ డ్రైవ్ లో పెట్టి రహస్యంగా అందించినప్పుడు క్యాంపులో తమలాంటి ఏజెంట్లు ఇంకెవరెవరూ ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ విషమాలు మాట్లాడుకోవద్దు అని వారించాడని వివరించింది. తెలంగాణ దళాల వద్దకు వెళ్లినప్పుడు అర్జున్ అనే పర్సన్ ఉంటాడని ఆయనను కలువమని సలహా ఇచ్చాడని, చెప్పాడంది. నాయకత్వ సమావేశం కోసం ఏర్పాట్లు జరుగుతున్న విషయం నాకు ముందే అర్థమైందనీ, ఆ విషయం ఆఫీసర్లకు చెప్పానని, సమావేశానికి వస్తున్న ఒక నాయకత్వ టీంపై దాడి చేయాలని పోలీసులు చేసిన ప్లానును నేనే ఆపుకోమని చెప్పి, సమావేశ మకాంపై దాడి చేయడం ద్వారా ఎక్కువ నష్టం కలుగజేయవచ్చని ఆఫీసర్ కు చెప్పడంతో ఆ దాడి ప్లాన్ ను పోలీసులు విరమించుకున్నారని కూడా చెప్పాడని చెప్పింది. నీల్సో చెప్పిన విషయాలను నిర్ధారించుకోవడంతో పాటు ఏజెంట్లుగా పని చేస్తున్న వారిని గుర్తించి ఆ నెట్ వర్క్ ను ధ్వంసం చేయాలనే నిర్ణయం తీసుకొని మొదట మనీష్, అర్జున్, రాజ్ కుమార్ లను కంట్రోల్ లోకి తీసుకున్నామని, మనీష్ పాత్రను నిర్దారించుకోవడానికి నీల్సోతో ఇంటలీజెన్స్ అధికారికి ఫోన్ చేయించామని, వారి మధ్య జరిగిన సంభాషణ ద్వారా ఆమె చెప్పిన విషయాలన్ని వాస్తవాలేనని నిర్దారించుకున్నామని మావోయిస్టు పార్టీ పేర్కొంది. అయితే మీరు గురించి పార్టీకి తెలిసిందని నీవు తెలంగాణలో ఉన్న అర్జున్ కు వెళ్ళి కలిస్తే నీకు అవసరమైన ఏర్పాట్లు చూస్తాడని మనీష్ ఎట్టి పరిస్థితులలో ఏ ఒక్క రహస్యాన్ని కూడా ప్రాణం పోయినా పార్టీకి చెప్పడని సదరు అధికారి చెప్పినట్టుగా వివరించింది. నీల్సో చెప్పిన విషయాలను మనీష్ ముందు పెట్టగా వాటిని అంగీకరించాడని, పెద్ద పెద్ద చెట్ల మధ్య డెన్ ను ఏర్పాటు చేసుకున్నప్పుడు బాంబింగ్ కు అనుకూలంగా లేదని గమనించి మకాంను అక్కడి నుండి ఖాళీ చేయించాలనే ప్లాన్ లో భాగంగానే టెంట్ పై రాళ్ళు వేయించినట్టుగా మనిష్ చెప్పాడని పేర్కొన్నాడని తెలిపింది. నాయకత్వం షెల్టర్ తీసుకున్న ప్రాంతాలను జీపీఎస్ ద్వారా సేవ్ చేసి పంపిస్తే అక్యూరెసీగా బాంబింగ్ చేయాలనీ, ఏకకాలంలో కింది నుండి బలగాలతో చుట్టుముట్టి నాయకత్వంతోపాటు పెద్ద సంఖ్యలో పీఎల్జీఏ బలగాలను నిర్మూలించాలన్న ప్లాన్ కూడా జరిగినట్టుగా పార్టీ తమ విచారణలో తేల్చింది. 

పెన్ డ్రైవ్స్ మాయం…

పెన్ డ్రైవ్ లను తానే దొంగిలించానని, అందులోని ముఖ్యమైన సమాచారాన్ని తనతో టచ్ లో ఉన్న అధికారులకు పంపించిన తరువాత అడవిలోనే పాతిపెట్టినట్టుగా నీల్సో చెప్పిందని, ఆ పెన్ డ్రైవ్ లు పాతి పెట్టిన స్థలం నుండి ఆమె ద్వారానే వాటిని వెలికితీసి స్వాధీనం చేసుకున్నామని పార్టీ వివరించింది. అందులో ముఖ్యమైన సమాచారం ఉన్న ఒక పెన్ డ్రైవ్ మాత్రం దొరకలేదని, పార్టీని పక్కదారి పట్టించే ప్రయత్నాలకు కూడా పూనుకుందని ఆరోపించింది. అపోహలు, అనుమానాల్ని రేకెత్తించడానికి ఓ దళ కమాండర్ కిట్ నుండి నోట్ బుక్ తీస్తుండగా ఒక పేపర్ దొరికిందని తెచ్చి ఇచ్చిందని, అందులో మ్యాప్ తోపాటు కొన్ని ఫోన్ నంబర్లు, కోడ్ లో పేర్లు రాసి ఉన్నాయని చూపించి మరింత మంది ఏజెంట్లు ఉన్నారని నమ్మించే ప్రయత్నం చేయడంతో పాటు వారిని శిక్షించే విధంగా వ్యవహరించి శిబిరంలో గందరగోళం సృష్టించిందని మావోయిస్టు పార్టీ పేర్కొంది. తన తమ్ముడి గురించి కూడా నిర్ధారించుకోవడానికి ఆగస్టు 17న ఫోన్ చేయించగా ప్రయాణంలో ఉన్నానని, అరగంట తర్వాత మాట్లాడతానని చెప్పగా… అదే రోజు సాయంత్రం మళ్ళీ ఫోన్ చేయించడానికి తీసుకెళ్ళినప్పుడు తన తమ్ముడి పాత్ర అర్థం కాకుండా చేయడానికి ఫోన్ లోని అన్ని నంబర్లను డిలిట్ చేసిందని పార్టీ పేర్కొంది.

You cannot copy content of this page