దండకారణ్యంలో కొత్త ఆపరేషన్ టీమ్స్
శిక్షణ పూర్తి చేసుకున్న 2100 మంది
దిశ దశ, దండకారణ్యం
దండకారణ్య అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న పూర్వ బస్తర్ జిల్లాలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొత్త బలగాలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇంతకాలం పారామిలటరీ, కోబ్రా బలగాలతో మాత్రమే కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించిన పోలీసు అధికారులు సరికొత్త బలగాలను సిద్దం చేసి ప్రత్యక్ష్య పోరుకు రంగంలోకి దింపబోతున్నారు. ‘బస్తర్ ఫైటర్స్’ పేరిట కొత్తగా ఏర్పాటు చేసిన ఈ బలగాల్లో అంతా కూడా ఉమ్మడి బస్తర్ లోని ఏడు జిల్లాలకు చెందిన యువతనే రిక్రూట్ చేసుకున్నారు.
పంజాబ్ కమెండోల మాదిరిగా…
పంజాబ్ లో టెర్రరిస్టులను ఏరివేసేందుకు అప్పటి డీజీపీ కేపీఎస్ గిల్ వ్యూహాత్మకంగా వ్యవహరించి కమెండో రిక్రూట్ మెంట్ కు శ్రీకారం చుట్టారు. అయితే ఇందులో టెర్రరిస్టుల చేతుల్లో చనిపోయిన వారి వారసులకు మాత్రమే అవకాశం ఇచ్చి వారి ఏరివేత కోసం పాశుపతాస్త్రాన్ని సంధించారు. పంజాబ్ కమెండోల కౌంటర్ యాక్షన్ స్టార్ట్ అయిన తరువాతే అక్కడ టెర్రరిస్టుల కార్యకలాపాలకు బ్రేకు పడింది. ఇదే స్పూర్తితో ఉమ్మడి ఆంధ్రప్రదేష్ రాష్ట్రంలో గ్రేహౌండ్స్ బలగాలను క్రియేట్ చేశారు ఐపీఎస్ ఆఫీసర్ వ్యాస్. వీరంతా నక్సల్స్ ఏరివేతలో క్రియాశీలకంగా పనిచేసే విధంగా కార్యచరణ రూపొందించారు. ఇదే పద్దతిన ఇప్పటికే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో సి 60 బెటాలియన్స్, చత్తీస్ గడ్ లో కోబ్రా బలగాలు నక్సల్స్ ఏరివేతలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. అయితే కొత్తగా ‘బస్తర్ ఫైటర్స్ పేరిట మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ప్రత్యేకంగా రిక్రూట్ చేసిన చత్తీస్ గడ్ అధికారులు వారికి అన్ని విధాలుగా సుశిక్షతమైన శిక్షణ ఇచ్చారు. వీరిని నేడో రేపో కదనరంగంలోకి దింపేందుకు కార్యాచరణ కూడా రూపొందించారు.
2,800 పోస్టులు…
బస్తర్ ఏరియాలోని బీజాపూర్, దంతెవాడ, కంకేర్, బస్తర్, నారాయణపూర్, సుక్మా, కొండగావ్ జిల్లాలకు చెందిన నిరుద్యోగులకు మాత్రమే ఇందులో అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గెజిటెడ్, నాన్ గెజిటెడ్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ స్థాయిల్లో ఉద్యోగులను నియమించుకునేందుకు 2,800 పోస్టులను రిక్రూట్ చేసేందుకు ఆమోదించింది చత్తీస్ గడ్ ప్రభుత్వం. ఒక్కో జిల్లాకు 300 మంది చొప్పున 2100 మంది కానిస్టేబుళ్లను నియమించిన అదికారులు వారికి శారీరక, సాయుధ, చట్టాలకు సంబంధించిన అన్ని విభాగాలపై శిక్షణ ఇచ్చారు. ప్రత్యేకంగా యుద్ద నైపుణ్యం, ఫీల్డ్ క్రాఫ్ట్, ఆపరేషన్లలో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. 2022 ఆగస్టు 15న బస్తర్ ఫైటర్స్ కానిస్టేబుళ్లకు సంబందించిన తుది జాబితా సిద్దం చేసిన పోలీసు అధికారులు రాష్ట్రంలోని వివిధ ట్రైనింగ్ సెంటర్లలో వీరికి శిక్షణ ఇప్పించారు. ట్రైనింగ్ పూర్తయిన వీరందరికి శనివారం బీజాపూర్ లో పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బస్తర్ ఐజీ సుందర్ రాజ్ మాట్లాడుతూ… బస్తర్ ఏరియాలో శాంతి స్థాపన నెలకొల్పే బాధ్యత బస్తర్ ఫైటర్స్ దేనని పిలుపునిచ్చారు. కొత్తగా రిక్రూట్ అయిన ఫైటర్స్ టీం కానిస్టేబుళ్లు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ అంకిత భావంతో పనిచేయాలన్నారు. వీరంతా కూడా ఆయా జిల్లాల వారిగా విధుల్లో చేరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు బస్తర్ అధికారులు.
ట్రాన్స్ జెండర్లకూ…
బస్తర్ ఫైటర్స్ లో 9 మంది ట్రాన్స్ జెండర్లకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు పోలీసు అధికారులు. తొలిసారి ఏర్పాటు చేసిన బస్తర్ ఫైటర్స్ వీరు కూడా సేవలందించబోతున్నారు. మావోయిస్టు ఏరివేతే లక్ష్యంగా పనిచేయనున్న బస్తర్ ఫైటర్స్ బలగాల్లో ట్రాన్స్ జెండర్ల నియామకం ప్రత్యేకత సంతరించుకుంది.
కీకారణ్యాలపై మరింత పట్టు…
విశాలమైన కొండలు, గుట్టలు, ఆకాశాన్ని తాకేంత ఎత్తున ఉన్న వనాల మధ్య అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు అక్కడి ఆదివాసీలు. తరతరాలుగా అదే ప్రాంత అడవులతోనే మమేకమైన వీరు కేవలం పోలింగ్ సమయంలో మాత్రమే సర్కారు ప్రతినిధులను చూస్తుండేవారు. పోలింగ్ సమయంలో సాయుధ పోలీసు బలగాలు వచ్చి దండకారణ్య అటవీ ప్రాంతంలోని ఆది వాసులచే ఓట్లు వేయించుకుని వెల్లిపోయారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ తంతుతో వారి మనసుల్లో సాయుధమున్న వాడే సర్కార్ అన్న బీజం పడింది. దీంతో అప్పటి నుండి సాయుధులై వచ్చిన వారే తమను పరిపాలించే పాలకులన్న భావన బలంగా నాటుకపోయింది. బస్తర్ అటవీ ప్రాంత ఆదివాసీలతో సాన్నిహిత్యం పెంచుకున్న పీపుల్స్ వార్ 1990వ దశాబ్దం నుండి క్రమ క్రమంగా అక్కడ పట్టు బిగించింది. ఆదివాసీలకు ఆధునిక వ్యవసాయం, విద్య, వైద్యం వంటివి అందించడంలో సక్సెస్ అయిన తరువాత వారు సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహించడం ఆరంభించారు. 1910లో జరిగిన భూంకాల్ పోరాటం స్పూర్తితో అడవి బిడ్డలను చైతన్య వంతులను చేసి ‘క్రాంతీకారీ జనతన్ సర్కార్’ ఏర్పాటు చేశారు. అప్పటి నుండి బస్తర్ అడవుల్లో నక్సల్స్ కు, బలగాలకు మధ్య ప్రచ్ఛన్న యుద్దమే సాగుతోంది. నక్సల్స్ అణిచివేత కోసం చత్తీస్ గడ్ కాంగ్రెస్ పార్టీ నేత మహేంద్ర కర్మ ప్రత్యేకంగా సల్వాజూడుం ఏర్పాటు చేసి నక్సల్స్ చే యుద్దం కొనసాగించారు. అయితే కోర్టులు సల్వా జూడుంను ప్రభుత్వం పెంచి ప్రోత్సహిస్తోందన్న కారణంతో తప్పు పట్టింది. ఆ తరువాత సల్వా జూడుం ఉనికి గణనీయంగా తగ్గిపోవడంతో అక్కడ మావోయిస్టులకు, బలగాలకు మధ్య డైరక్ట్ వార్ నడుస్తోంది. అయితే అడవుల్లో ఉన్న నక్సల్సే తమ పాలకులని భావిస్తున్న అక్కడి ఆదివాసులు, మావోయిస్టుల ఏరివేత కోసం అక్కడి అడవుల్లోకి వెల్తున్న బలగాలను శతృ సైన్యంగా చూస్తూ దాడులకు పూనుకుంటున్నాయి. సాంప్రాదాయ ఆయుధాలైన విల్లులు, బరిశెలను వినియోగిస్తూ బలగాలను మట్టుబెట్టడంలో ఆదివాసీలు వెనకడుగు వేయడం లేదు. అంతేకాకుండా కీకారణ్య అటవీ ప్రాంతంపై అణువనువునా పట్టున్న ఆదివాసీలు నక్సల్స్ ఏరివేత కోసం వెల్తున్న బలగాలపై పై చేయి సాధిస్తున్నారు. దీంతో అటవీ ప్రాంతంలోని ఆదివాసీలను అక్కున చేర్చుకునేందుకు పోలీసులు ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఎక్కడా కూడా సఫలం కాలేక పోతున్నారు. తాజాగా బస్తర్ ఫైటర్స్ లో అక్కడి వారినే రిక్రూట్ చేసుకుని వారిపై పోరు చేసేందుకు సమాయత్తం చేశారు. ఈ వ్యూహంతో అటవీ ప్రాంతంలో బలగాలకు తిరుగులేని పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.