బాటిల్ మైన్…

సరిహద్దు అడవుల్లో గుర్తింపు

మావోయిస్టులు కొత్తగా బాటిల్ మైన్ దాడి చేసే ఎత్తుగడలకు శ్రీకారం చుట్టారా..? ల్యాండ్ మైన్, క్లైమెర్ మైన్ తరహాలో కొత్తగా బాటిల్ మైన్ విధానంతో పోలీసులపై దాడులకు వ్యూహం రచించినట్టుగా స్పష్టం అవుతోంది. తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరి వేత కోసం తరుచూ కూంబింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టే పోలీసు బలగాలే లక్ష్యంగా కొత్తగా బాటిల్ మైన్ తో మందుగుండు పేల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీసులు సరిహద్దు అడవుల్లో కూంబింగ్ చేస్తుండగా బీరు బాటిల్ లో మందుగుండు ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ వైర్ తో అనుసంధానం చేసిన విషయాన్ని ములుగు జిల్లా పోలీసులు గుర్తించారు. వెంకటాపూర్ సరిహధ్దుల్లోని పామ్నూరు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఈ బీర్ బాటిల్ మైన్ ట్రేస్ అయింది. దండకారణ్య అటవీ ప్రాంతం నుండి మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తెలంగాణాలోకి ఎంటర్ అయ్యారన్న సమాచారం మేరకు తాము కూంబింగ్ నిర్వహిస్తుండగా బాటిల్ ను గుర్తించామని ఏటూరునాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. సకాలంలో మందుపాతరును గుర్తించి మందుగుండు బాటిల్ ను డిఫ్యూజ్ చేశామన్నారు. కొత్త తరహాలో బలగాలపై దాడులకు పూనుకునేందుకు వ్యూహం రచించినట్టుగా కేసు నమోదు చేశామని మావోయిస్టు పార్టీ అగ్రనేతలు పుల్లూరి ప్రసాదరావు, అలియాస్ చంద్రన్న, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కొయ్యాడ సాంబయ్య, కంకణాల రాజిరెడ్డి, కుర్సం మంగు అలియాస్ భద్రు, ముచాకి ఉంగల్ అలియాస్ రఘు, అలియాస్ సుదాకర్, కర్రం భుద్రి అలియాస్ రీటా, శ్యామల ధూలే అలియాస్ శ్యామల, కుంజం ఇడ్మా అలియాస్ మహేందర్ లతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశామని ఏఎస్పీ వివరించారు.

పామ్నూరు అటవీ ప్రాంతంలో గుర్తించిన బాటిల్ మైన్

కొత్త తరహా దాడులు…

మావోయిస్టులు బీర్ బాటిల్స్ ద్వారా దాడులకు పూనుకోవాలన్న స్కెచ్ వేయడం వెనక కారణాలు ఏంటోనన్న చర్చ సాగుతోంది. సాధారణంగా ఖాలీ స్థలాల్లో బీరు బాటిల్స్ పడేసి ఉంటాయని వాటితో దాడులకు పూనుకున్నట్టయితే పోలీసులకు అనుమానం రాకుండా ఉంటుందని దీనివల్ల తమ లక్ష్యాన్ని ఛేదించగలుగాతమని మావోయిస్టులు అంచనా వేసి ఉంటారని భావిస్తున్నారు. అలాగే పేల్చివేత తరువాత బీరు బాటిల్ ముక్కలు కూడా కూంబింగ్ బలగాలకు గుచ్చుకుని గాయాల పాలవుతారని అంచనా వేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇనుప పైపులు వంటివి అయితే ఎక్కువ మొతాదులో మందుగుండు సమకూర్చుకోవల్సి ఉంటుందని బీరు బాటిల్స్ తక్కువ మోతాదు సరిపోతుందని అంచనా వేసి ఉంటారని తెలుస్తోంది.

జాయింట్ ఆపరేషన్లకు చెకా..?

సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు ఏరివేత కోసం నిరంతరం సాగుతున్న గాలింపు చర్యలను కట్టడి చేసేందుకు కొత్త ఎతుగడకు మావోయిస్టులు పూనుకుని ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సింగిల్ యాక్షన్ టీమ్స్ అడవుల్లో తిరిగి లక్ష్యాన్ని ఛేదించే అవకాశం కూడా ఉంటుందని మావోయిస్టు పార్టీ అంచనా వేసి ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా మావోయిస్టులు కొత్త తరహా దాడులకు పూనుకోవడంపై పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారు.

You cannot copy content of this page