కాంగ్రెస్ బీసీ సదస్సు తీరు
దిశ దశ, కరీంనగర్:
మెజార్టీ సామాజిక వర్గాలు ఉన్న బీసీలను అక్కున చేర్చుకున్నట్టయితే వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించొచ్చన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న బీసీ నినాదం తొలి ప్రయత్నంలోనే బెడిసి కొడుతున్నట్టుగా ఉంది. శతాబ్దానికి పైగా వయసున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో బీసీ నినాదంతో ముందుకు సాగాలని భావిస్తున్నా ఆ సామాజిక వర్గ నేతలను మాత్రం సంతృప్తి పర్చలేకపోతోందని స్పష్టం అవుతోంది. బీసీలను మచ్చిక చేసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశాల్లోనే బీసీ నేతలు తమ అక్కసు వెల్లగక్కుతుండటంతో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడి దిద్దుబాటు చర్యలపై దృష్టి పెడుతుందా అన్నదే మిస్టరీగా మారింది.
కరీంనగర్ వేదికగా…
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం బీసీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సమావేశంలోనే విహెచ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పుదు. తాను హనుమంతరావు అయ్యానని వెనక ఐదు అక్షరాలు ఉన్నట్టయితే 1990లోనే సీఎం అయ్యేవాడినని విహెచ్ వ్యాఖ్యానించారు. అంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి ఆధిపత్యం ఎక్కువగా ఉందని చెప్పకనే చెప్పారు విహెచ్. ఇందిరాగాంధీ హయాం నుండి కాంగ్రెస్ పార్టీతో అనుభందం పెనవేసుకున్న వీహెచ్ గాంధీ కుటుంబంతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు బీసీ నేతలకు కాంగ్రెస్ లో సరైన గుర్తింపు దశాబ్దాలుగా ఇవ్వడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టయింది.
అలక వీడని పొన్నం..?
ఇకపోతే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ యూఐ నుండి కొనసాగుతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా నాయకత్వం తీరుపై కినుక వహించారు. ఈ నేఫథ్యంలో కరీంనగర్ లోకసభ స్థానం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పొన్నం ప్రభాకర్ కు ప్రాధాన్యత కల్పించకపోవడం సరికాదంటూ గాంధీ భవన్ కు వెల్లి మరీ వినతులు చేశారు. అయితే త్వరలోనే పొన్నం ప్రభాకర్ కు అవకాశం ఉంటుందని రాష్ట్ర ఇంఛార్జి ఠాకూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడడ్డిలు ప్రకటించారు. అయినప్పటికీ మంగళవారం నాటి బీసీ సదస్సుకు మాత్రం ఆయన దూరంగానే ఉండడం గమనార్హం. జిల్లా కాంగ్రెస్ లో సీనియర్ నేత అందునా బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం హాజరు కాకపోవడంతో ఆయన ఇంకా అలక వీడలేదని స్పష్టం అవుతోంది.
పెద్దపల్లి నాయుకుడి ఆవేదన ఇది…
ముకుందరెడ్డి ఉన్నంత సేపు ఆయన ఇప్పుడు వెలమ దొరలు వచ్చారు… అసలు మేం పార్టీలో ఉన్న వాళ్లతో కొట్టాడడానికే సరిపోతుంది… కర్ణాటక పాలసీని తెలంగాణాలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి… పార్లమెంటు స్థానాలు రెండెందుకు మూడు బీసీలకు కెటాయించాలి అంటూ పెద్దపల్లి డీసీసీ మాజీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య అన్నారు. బ్రిటీష్ వాళ్లతో పోరాటం చేస్తే వీళ్ల దగ్గర న్యాయం ఉందని స్వతంత్ర్యం ఇచ్చారు కానీ మీరు మమ్మల్ని చంపుతున్నారు ఇక్కడకు వచ్చి… మేమేం పాపం చేశామంటూ ప్రశ్నించారు. తెలంగాణాలో కాంగ్రెస్ రాకపోవడానికి కారణం వీళ్లు చేస్తున్నటువంటి అన్యాయమే… 40 ఏళ్ల చరిత్రలో పెద్దపల్లిలో ఒక్కసారైనా బీసీకి అవకాశం ఇచ్చారా..? టీడీపీ నుండి బిరుదు రాజమల్లకు అవకాశం ఇస్తే ఆరోజుల్లో ఆయన 42 వేల మెజార్టీతో గెలిచారు, నేను మున్నురు కాపు వాన్ని బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఇదే సామాజిక వర్గానికి చెందిన గంగుల కమలాకర్, బండి సంజయ్, పుట్ట మధు, సోమారపు సత్యానారాయణ, కోరుకంటి చందర్, కౌశిక్ హరిలకు గుర్తింపు ఉందని కాంగ్రెస్ లో మాత్రం సిన్సియర్ గా పనిచేస్తున్న తనకు గుర్తింపు ఇవ్వలేదని ఎందుకీ అన్యాయం.. తమకు టికెట్ ఇవ్వాల్సిందేనని రాబోయే తరాలకు అయినా అవకాశం ఉండాలని, బీసీలకు ఎన్ని రోజులు చంపుతారు ఇలా అంటూ ఈర్ల కొమురయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. బీసీలను అణగదొక్కితే మా సత్తా ఏంటో చూపిస్తాం మాకేం తక్కువగా ఉంది..? మాకూ పోరాడే దమ్మున్నదని స్పష్టం చేశారు. చల్లకొచ్చి ముంత దాసే రకాన్ని కాను… పెద్దోళ్లు ఉన్నారని భయపడిపోయే రకాన్ని కాను అంటూ ఆయన ఉంటే ఉన్నది పోతే పోయిందంటూ చేసిన కామెంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. టికెట్ కోసమే పోరాడుతాం మేం ఓట్లేస్తే మీరు గెలుస్తున్నారంటూ ఈర్ల కొమురయ్య కాంగ్రెస్ పార్టీ బీసీ సదస్సులో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలను విస్మరిస్తే పతనం తప్పదు… కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలంటే అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని ఈర్ల కొమురయ్య వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో నిర్వహించిన కాంగ్రెస్ బీసీ సదస్సు వేదికపై బీసీ సామాజికవర్గ నేతలే అసహనాన్ని లేవనెత్తడం సంచలనంగా మారింది. బీసీ నినాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ సమాజాంలోని ఆ సామాజిక వర్గాలను మచ్చిక చేసుకునే ముందు సొంత పార్టీ నేతలకు సరైన గుర్తింపు ఇవ్వాల్సిన ఆవశ్యకతను కరీంనగర్ కాంగ్రెస్ బీసీ సదస్సు తేల్చిచెప్పినట్టయింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడుని కాంగ్రెస్ అధిష్టానం అమలు చేస్తుందా లేక ఇలాగే ముందుకు సాగుతుందా అన్నది ముందు ముందు తేలనుంది.