దిశ దశ, కరీంనగర్ం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదం తెరపైకి లేస్తోంది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ గళాన్ని వినిపిస్తుండడం గమనార్హం. మండలి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ అభ్యర్థులకే అవకాశం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్వి కేసిపెద్ది శ్రీధర్ రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలంతా కూడా బీసీ అభ్యర్థికే అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. బీసీ అభ్యర్థుల గెలుపునకు కరీంనగర్ గ్రాడ్యూయేట్స్ నియోజకవర్గంలో బీసీ చైతన్యం కోసం సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ కు చట్టబద్దత లేదని హైకోర్టు తీర్పునకు అనుగుణంగా డెడికేట్ కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని శ్రీధర్ రాజు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ తంగళ్లపల్లి రాజ్ కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్, జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణిత్, పంజాల శివాజీ గౌడ్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.