దిశ దశ, కరీంనగర్:
నేరం ఓ చోట చేశాం… వేరే ప్రాంతంలో దర్జాగా తిరుగుతాం అనుకునే నేరస్తులు తప్పులో కాలేసినట్టే. నేరాలకు పాల్పడే వారి డాటా అంతా పోలీసు విభాగం రికార్డులో ఉంటుంది. ఆ డాటా సహకారంతో పోలీసులు నిందితులను దేశంలో ఎక్కడైనా పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేరస్తులు చట్టానికి చిక్కక తప్పదు. తాజాగా పోలీసులు వేలి ముద్రలను సేకరించడం మొదలు పెట్టారు. రద్దీ ప్రాంతాల్లో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చే పోలీసులు అనుమానితుల వేలి ముద్రలు సేకరిస్తారు. నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తుల వేలి ముద్రలు టాలీ అయితే అతని నేర చరిత్ర అంతా కూడా పోలీసు అధికారులు చేతుల్లో ఉన్న ట్యాబ్ లలో ప్రత్యక్ష్యం అవుతుంది. దీంతో నేరస్తులను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. దొంగతనం కానీ ఇతరత్రా నేరాలకు పాల్పడే వారి వేలి ముద్రలు పోలీసు విభాగం వద్ద అప్ లోడ్ ఉండడంతో నేర మయ ప్రపంచంతో అనుభందం పెనవేసుకున్న వారిని వెంటనే పట్టుకునే అవకాశం ఉంటుంది. సాంకేతికతను అందిపుచ్చుకున్న పోలీసు అధికారులు రద్దీ ప్రాంతాల్లో ర్యాపిడ్ గా వేలి ముద్రలు సేకరిస్తుంటారు. తాజాగా బుధవారం కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ కోటేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు అనుమానితుల వేలిముద్రలను సేకరించారు. ఇతర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన వారు కానీ, పిక్ పాకెటర్స్ కానీ కరీంనగర్ కు వచ్చినట్టయితే వారి వేలి ముద్రల ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తారు. గతంలో నేరాలకు పాల్పడిన చోట కేసుల వివరాలు కూడా సేకరించి అక్కడి కోర్టులకు హాజరవుతున్నారా లేదా అన్న విషయాలను కూడా తెలుసుకుంటారు పోలీసులు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో నేరాలకు పాల్పడిన నిందితులు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారోనన్న విషయంపై కూడా దృష్టి సారించే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో నేరాలను ముందుగానే కట్టడి చేసేందుకు దోహదడుతుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.