దిశ దశ, కరీంనగర్:
ఈ సారి జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి వరకూ పోరాటం చేసిన 2.6 లక్షల ఓట్లు షేర్ చేసుకున్న ముగ్గురు అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీతో అనుభందం పెనవేసుకున్న వారే. చిన్నమైల్ అంజిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడి పూర్వాశ్రమమైన బీజేపీ వైపు అడుగులు వేసి మండలికి ఎన్నికయ్యారు. అయితే టికెట్ రేసులో చివరి క్షణం వరకూ ప్రయత్నించిన ప్రసన్న హరికృష్ణ అధిష్టానం తన పట్ల సానుకూలంగా లేదని గుర్తించి స్వతంత్రుడిగా పోటీ చేసేందుకు సమాయత్తం అయి చివరి నిమిషంలో బీఎస్పీ నుండి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికలకు ముందు నుండి కూడా కాంగ్రెస్ పార్టీతో అనుభందం పెట్టుకున్న అల్ఫోర్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి తనదైన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటికీ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది. వీరు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అయినప్పటికీ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం వేర్వేరు పార్టీల నుండి పోటీ చేసి ప్రత్యర్థులయ్యారు.
విద్యావేత్తలే…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యా సంస్థల నిర్వాహాకులు, విద్యావేత్తలు వెనకబడిపోయారు. పారిశ్రామికవేత్తతో పాటు వ్యాపారి కూడా అయిన చిన్నమైల్ అంజిరెడ్డిని అధిగమించలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి అల్ఫోర్స్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సింగిల్ గా ఆపరేట్ చేస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాలలో కూడా విద్యా సంస్థలను విస్తరించారు. తనవద్ద చదువుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మద్దతు ఇచ్చినా విజయ తీరాలకు చేరడం పక్కా అనుకున్నప్పటికీ ఫలితాలు మాత్రం ఆయనను నిరాశ పర్చాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరి కృష్ణ కూడా నిరుద్యోగుల్లో, ఉద్యోగుల్లో పట్టు బిగించిన వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ గానే కాకుండా నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం వారికి అవసరమైన స్టడీ మెటిరియల్ అందించడంలో సక్సెస్ బాటలో నడిచారు. ఆయన ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమై ఎలిమినేషన్ రౌండ్ లో పోటీలోనే లేకుండా పోయారు. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల సంఘం ట్రస్మా నిర్మాణంలో కీలక భూమిక పోషించిన యాదగిరి శేఖర్ రావు కూడా దశాబ్దాలుగా విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఆయనకు కూడా బోటాబోటీ తొలి ప్రాధాన్యత ఓట్లే వచ్చాయి. న్యాయవాద వృత్తితో పాటు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన సర్దార్ రవిందర్ సింగ్ పోటీ ఇవ్వలేకపోయారు. పట్టభద్రుడైన చిన్నమైల్ అంజిరెడ్డి వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా స్థిరపడిపోయి రాజకీయాల్లో సుస్థిర స్థానం కోసం పోటీపడి ఈ సారి సఫలం అయ్యారు.
వైఫల్యాల నుండి…
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైలు అంజిరెడ్డి ప్రస్థానం వైవిద్యంగానే సాగింది. పటాన్ చెరూ ప్రాంతంలో భూస్వామిగా పారిశ్రామికవేత్తగా పేరొందిన ఆయన రాజకీయాల్లో ఇంతవరకూ సక్సెస్ కాలేకపోయారు. పలు పార్టీల్లో తిరిగి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి విఫలం అయిన ఆయన ఓ సారి ఎమ్మెల్యేగా స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన సతీమణి గోదావరి కూడా రెండు సార్లు కార్పోరేటర్ ఎన్నికల్లో నిలిచి ఓడిపోయారు. అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన అంజిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసమేనా అన్న ఆందోళన బీజేపీ వర్గాల్లో వ్యక్తం అయింది. అయితే మోడి మానియా, రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై వచ్చిన వ్యతిరేకతతో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు.