నగరంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం…

దిశ దశ, కరీంనగర్:

నాడు నగరం నడిబొడ్డును హల్ చల్ చేసిన ఎలుగు బంట్లు నేడు శివారు ప్రాంత వాసులను కలవరపెడుతున్నాయి. అర్థారాత్రి ఉన్నట్టుండి ఎలుగుంబంటి రోడ్డుపై ప్రత్యక్ష్యం కావడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఎవరిపై దాడి చేస్తుందోనన్న భయంతో శ్రీపురం, రజ్వీ చమన్ వాసులు తెల్లవారు జాము వరకూ నిద్ర లేకుండా గడిపారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో స్థానిక యువత కర్రలు పట్టుకుని గస్తీ చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. చివరకు ఆ ప్రాంతం నుండి ఎలుగుబంటి వెల్లిపోవడతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే శుభం గార్డెన్ ఏరియాలో కూడా ఎలుగు బంటి కనిపించిందని స్థానికులు చెప్తున్నారు. ఎలుగుబంటి ఆనవాళ్లు సీసీ కెమెరాలో రికార్డు కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


నాడు నడి బొడ్డున…

పదిహేనేళ్ల క్రితం కరీంనగర్ నడ బొడ్డుకు చేరుకున్న ఎలుగుబంట్లు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. తెల్ల వారే సరికి పోలీసు హెడ్ క్వార్టర్స్ సమీపంలోన ప్రత్యక్ష్యమైన వీటిని పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. అటు పోలీసులు ఇటు అటవీ శాఖ యంత్రాంగం దానిని అదుపులోకి తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఫారెస్ట్ కాంప్లెక్స్ లోకి చొరబడి కూడా హంగామా సృష్టించింది. నగరంలోకి ఎలుగుబంటి వచ్చిందన్న సమాచారం తెలిసిన జనం కూడా వేలాది మంది పోలీసు హెడ్ క్వార్టర్స్ ఫారెస్ట్ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. గంటల కొద్ది ఆపరేషన్ నిర్వహించినా లాభం లేకపోగా స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి ఎలుగుబంటిని అదుపులోకి తీసుకుని ఇక్కడి నుండి తరలించారు. ఆ తరువాత పదేళ్ల క్రితం కూడా కరీంనగర్ టవర్ రోడ్ పోస్టాఫీస్ సమీపంలోకి మరోసారి ఎలుగు బంటి చేరుకుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆ రహదారిని మూసి వేసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి దానిని వలపన్ని పట్టుకుని తరలించారు. తాజాగా మరోసారి కరీంనగర్ శ్రీపురం కాలని, శుభం గార్డెన్ ఏరియాలో సంచరించడం గమనార్హం.


శాతవాహనలో కామన్

శాతవాహన యూనివర్శిటీలో ఎలుగుబంట్ల ఉనికి సర్వ సాధారణంగా మారిపోయింది. ఈ యూనివర్శిటీలో రెండు తరుచూ ఎలుగుబంట్లు సంచరిస్తుండడంతో స్టూడెంట్స్ కలవరపడిపోతున్నారు. వన్య ప్రాణుల ఉనికి విద్యార్థులు బస చేసే హస్టల్ పరిసరల ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఒక్కోసారి విద్యార్థులు ఇంటి బాట పట్టిన సందర్భాలూ లేకపోలేదు.

You cannot copy content of this page