డీఎస్పీ ప్రణిత్ రావు వ్యవహారంలో కొత్త కోణం…

ఆయనకు యాగ్జిలరీ ప్రమోషన్ ఎలా వచ్చింది..?

నక్సల్స్ ఏరివేతలో పాల్గొన్న వారి మాటేమిటీ..?

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ ప్రణిత్ కుమార్ అలియాస్ ప్రణిత్ రావు విషయంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐబీలో ఎస్ఓటీ ఇంచార్జిగా వ్యవహరించిన ఆయన లాగర్ రూమ్ లోని రికార్డులను, హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారని డీజీపీ రవి గుప్త సస్పెండ్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ చాటింగ్ లపైనే ఆయన ఆపరేషన్ కొనసాగించారని భావిస్తున్నారంతా. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన ప్రముఖుల భార్యలకు సంబంధించిన ఛాటింగ్, ట్యాపింగ్ కు పాల్పడ్డారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ అవుతున్నాయి. మరో వైపున డీఎస్పీ ప్రణిత్ రావుకు యాగ్జిలరీ ప్రమోషన్ ఇవ్వడంపై పోలీసు విభాగంలో చర్చ మొదలైంది. ఆయనకు సడెన్ గా యాగ్జిలరీ ప్రమోషన్ రావడానికి కారణాలు ఎంటీ..? ఆయన ఏ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేశారు అన్నదే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఎస్ఐబి అంటే..?

వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (ఎస్ఐబి)ని ఏర్పాటు చేసి నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేసే పనిని అప్పటి పోలీసు అధికారులు అప్పగించారు. నక్సల్స్ ఉనికి దొరకబట్టుకోవడంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ వింగ్ లో పనిచేస్తున్న పోలీసు అధికారులు కూడా గతంలో యాగ్జిలరీ ప్రమోషన్లు పొందారు. గతంలో నక్సల్స్ ఏరివేత కోసం అడవుల్లో తిరుగుతూ ఎన్నో అవస్థలు పడిన పోలీసుల కంటే ఎక్కువగా ఎస్ఐబిలో పనిచేసిన వారు యాగ్జిలరీ ప్రమోషన్లు పొందడంతో క్షేత్ర స్థాయిలో పనిచేసిన పోలీసులకు అన్యాయం జరిగిందన్న వాదనలు ఉన్నాయి. నల్లమల్ల అడవులే అయినా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయినా నక్సల్స్ కార్యకలాపాలు అప్పుడు తీవ్రంగా ఉండేవి. పోలీసులకు, నక్సల్స్ కు మధ్య జరిగిన పోరు ప్రచ్ఛన్న యుద్దాన్నే తలపించింది నాడు. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అంతగా లేని ఆ కాలంలో అప్పటి పోలీసు అధికారులు ఇన్ ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేసుకుని నక్సల్స్ ఏరివేతలో భాగస్వాములు అయ్యారు. ఎప్పుడు ప్రాణాలు పోతాయో కూడా తెలియని పరిస్థితుల్లో కూడా ఆనాటి పోలీసు యంత్రాంగం అత్యంత సాహసంతో అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించింది. అయితే నక్సల్స్ ఏరివేతలో సక్సెస్ అయిన వారికి మాత్రమే యాగ్జిలరీ ప్రమోషన్లు ఇచ్చే ఆనవాయితీ ఇవ్వాలన్న నిభందనలు ఉండడంతో ఆపరేషన్లకు పాల్పడిన వారికి పదోన్నతులు కల్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కానీ ఈ యాగ్జిలరీ ప్రమోషన్లకు సంబంధించిన జాబితాను సంబంధిత జిల్లాల పోలీసు బాసులు ఉన్నతాధికారులకు పంపించినట్టయితే ఇంటలీజెన్స్ వింగ్ తో పాటు ఇతర విభాగాలకు చెందిన వారు జాబితాను ఫైనల్ చేసి డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)కి పంపించిన తరువాత తుది జాబితా విడుదల అయ్యేది. అయితే ఎస్ఐబి రంగ ప్రవేశం చేసిన తరువాత హైదరాబాద్ లో ఉంటూ సాంకేతికతను అందిపుచ్చుకుని నక్సల్స్ ఏరివేతలో పాల్గొన్నారని పదోన్నతులు పొందిన పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి అడవుల్లో తిరుగుతూ నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేయడంలో కీలక భూమిక పోషించిన వారు మాత్రం సైటేషన్ పంపించాలంటూ అధికారుల చుట్టూ తిరిగేందుకు మరో ఆపరేషన్ నిర్వహించాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారన్నది పోలీసు విభాగంలో ఓపెన్ టాక్.

ఆయనకెలా..?

ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో నక్సల్స్ కార్యకలాపాలను నిరోధించడం కోసం నల్లమల, ఉత్తర తెలంగాణ అటవీ ప్రాంతాల్లో వేళ్లూనుకున్న నక్సలిజాన్ని అంతమొందించిన వారికే యాగ్జిలరీ ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉంటుందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. నక్సల్స్ కార్యకలాపాలను నిరోధించడంలో 2002 బ్యాచ్ అధికారుల వరకు క్రియాశీలక భూమిక పోషించగా, 2004 బ్యాచ్ పోలీసు అధికారులు నక్సల్స్ కార్యకలాపాల కట్టడి కోసం కొంతమేర పనిచేశారు. ఆ తరువాత నక్సల్స్ కార్యకలాపాలే పూర్తిగా తుడిచిపెట్టుకపోయిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అప్పటి నుండి చత్తీస్ గడ్, మహారాష్ట్ర కీకారణ్యాలకే నక్సల్స్ కార్యకలాపాలు పరిమితం కావడంతో గోదావరి, ప్రాణహిత నది పరివాహక జిల్లాల పోలీసు యంత్రాంగం మాత్రమే నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోంది. ఇతర ప్రాంతాల్లో మాత్రం సాధారణ పోలిసింగ్ కొనసాగిస్తున్నారన్నది అందరికి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో 2007 బ్యాచ్ కు చెందిన ప్రణిత్ రావు నల్గొండ జిల్లాలో మొదట ఎస్ఐగా పనిచేశారు. ఆ తరువాత సీఐగా పదోన్నతి పొందిన అనతి కాలంలోనే డీఎస్పీగా యాగ్జిలర్ ప్రమోషన్ అందుకున్నారు. ఆయనకు ఈ పదోన్నతి రావడానికి కారణమేంటన్నదే రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగాన్ని తొలుస్తున్న అసలు ప్రశ్న. పదోన్నతి ఇవ్వాలన్న ప్రతిపాదనలు పంపించింది ఎవరు..? ఆయన నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేయడంలో ఎంతమేర పనిచేశారు..? ఆయన చేసిన ఆపరేషన్ లో ఏ స్థాయి క్యాడర్ నక్సల్స్ ను ఏరివేయగలిగారు తదితర అంశాలపై పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కుటుంబాలను కూడా పట్టించుకోకుండా ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ నక్సల్స్ అణిచివేతలో పాల్గొంటే సవాలక్ష నిభందనలు అడ్డుగా వస్తే… ఈయనకు యాగ్జిలరీ ప్రమోషన్ ఎలా వచ్చిందన్నదే పజిల్ గా మారిందని పోలీసు అధికారులే అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు ఈ యాగ్జిలరీ గుట్టును కూడా విప్పాల్సిన అవసరం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇలాంటి చర్యల వల్ల నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ లో పాల్గొన్న వారికి తీరని అన్యాయం జరిగిందన్న ఆవేదన కూడా వ్యక్తం అవుతోంది.

You cannot copy content of this page