అది 1999-2000 సంవత్సరం… పొడవాటి ముక్కు ఉన్న ఓ బక్కపల్చని వ్యక్తి ఉన్నట్టుండి తెరమరుగైపోయారు. ఇంతకీ ఆయన ఏమయ్యాడు… ఏం చేస్తున్నాడు అని అప్పటి ప్రభుత్వం ఆరా తీస్తున్నది. కానీ మొదట్లో ఆ వ్యక్తి లోతుపాతులు అంచనా వేయడంలో విఫలం అయింది ప్రభుత్వం. అనాటి పరిస్థితులపై సమీకరణాలు నెరుపుతూ ఊరు వాడ కలియ తిరుగుతు సన్నిహితులతో పిచ్చాపాటి ముచ్చట్లు పెడుతూ ముందుకు సాగారు. కాలక్షేపం కోసం ఆయన తిరుగుతున్నారని భావించినప్పటికీ అప్పటి సమైక్య పాలకుల అంచనాలు తలకిందులు చేస్తూ 2001లో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు ఆ బక్కపల్చని వ్యక్తి తెలంగాణా కోసం సమీకరణాలు జరుపుతున్నారని, ఫాంహౌజ్ లలో రహస్య సమావేశాలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతున్నా ఆయనలోని మర్మం మాత్రం బయటకు పొక్కనీయలేదు. ఎవరిని కలుస్తున్నారో..? ఎందుకు సమావేశం అవుతున్నారో కూడా అంతుచిక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి 2001 ఏప్రిలో 27న తెలంగాణ ఉద్యమం కోసం కదనరంగంలోకి దిగుతున్నానని ప్రకటించే వరకు అర్థం కాలేదు నాటి పాలకులకు. మర్మం తెలియకుండా వ్యూహాత్మక ఎత్తుగడలు వేయడంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించే తత్వం ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వేసిన తొలి అడుగు నేడు జాతీయ పార్టీ ఆవిర్భావం వరకు సాగుతుందని ఎవరూ ఊహించి ఉండరేమో… కరీంనగర్ ఎస్సారార్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన సింహ గర్జన సభలో తన విధానం… నినాదం ప్రకటించిన కేసీఆర్ టీడీపీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తున్నానని, తెలంగాణ కోసం టీఆరెఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు.
ఎదురు దాడులే ఎక్కువ…
ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత క్లిష్టమైన సమయంలో స్వరాష్ట్ర కల సాకారం కోసం కదనరంగంలోకి దూకుతున్నానని కేసీఆర్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయనపై ముప్పేట దాడి జరిగింది. ఏప్రిల్ 28న కరీంనగర్ లోని డాక్టర్ భాగ్యారెడ్డి ఇంట్లో కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి హైదరబాద్ కు పయనమయ్యారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కేసీఆర్ లక్ష్యంగా చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. కేసీఆర్ మానసిక స్థైర్యం దెబ్బతినే విధంగా మాటల తూటాలు పేలుస్తూ గతంలో జరిగిన ఉద్యమాలే అంతరించి పోయాయి… కేసీఆర్ చేపడతున్న పోరు నీటి బుడగలాంటిదన్న రీతిలో విమర్శనాస్త్రాలు చేశారు. చివరకు టీఆర్ఎస్ కాస్తా వీఆర్ఎస్ గా మారిపోతుందని కేసీఆర్ తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తారంటూ దుమ్మెత్తిపోశారు. సింహ గర్జన సభ సక్సెస్ అయిన తరువాత కేసీఆర్ ను ఎన్నో రకాలుగా వెంటాడి వేటాడినంత పనిచేశారు ఆనాటి సమైక్య నాయకత్వం నీడలో ఎదిగిన తెలంగాణ నాయకులు. స్వరాష్ట్ర కల సాకరం కావాలన్న ఆకాంక్షతో అప్పటికే అండర్ గ్రౌండ్ లో చేసిన గ్రౌండ్ వర్క్ కారణంగా కేసీఆర్ వెనక్కి చూడకుండా ముందుకు సాగేందుకే నిర్ణయించుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరే వారిపై నిఘా వేసి వారిని కట్టడి చేస్తూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి రాష్ట్ర నాయకులు చేసిన కుట్రలు కుతంత్రాలు చాతాడంత అవుతాయి. ఈ రోజు కేసీఆర్ వెంట నడుస్తూ జై తెలంగాణ అని నినదిస్తున్న నాయకుల్లో కొందరు కేసీఆర్ ఎత్తులను చిత్తు చేసేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.
ఆ పిలుపుతో…
ఓ వైపున తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని విస్తృతం చేస్తూనే మరో వైపున సమీకరణాలపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు కేసీఆర్. బంజారాహిల్స్ లో జరిగిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తూ అవసరమైతే సోనియా గాంధీపై రాళ్లతో దాడి చేద్దాం అంటూ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీశాయి. మొట్టమొదటి సారి అగ్రెసివ్ గా కేసీఆర్ చేసిన ప్రసంగంపై ఎన్నో విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా జాతీయ పార్టీల కుట్రలను, సమైక్య పార్టీల ఎత్తుగడలను ఏకీ పారేశారు. ఎన్నికలు జరిగినప్పుడల్లా టీఆర్ఎస్ ను అక్కున చేర్చుకునేందుకు తెలంగాణ ప్రజలు ముందుకు రావడం లేదని, ఇక్కడి ప్రజలు సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారంటూ గులాభి నేతను డిఫెన్స్ లో పడే విధంగా ప్రకటనలు చేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేరంటూ వ్యాఖ్యానించడం, పలితాల తరువాత టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలైన విషయాలను ఎత్తి చూపుతు ఎద్దేవ చేయడం ఆరంభించారు. చివరకు 2004 ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ నాయకత్వం అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది. దీంతో అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించి సమైక్య రాష్ట్ర ఆకాంక్షను వెలిబుచ్చుతున్న వారిని నిలదీయాలన్న ప్రయత్నాలకు గండిపెట్టినా తన పంథాలో మాత్రం వెనక్కి తగ్గలేదు. 2009 ఎన్నికల్లో మహా కూటమితో జట్టు కట్టి స్వరాష్ట్ర నినాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. దక్షిణ తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర వాదన లేదంటూ చేసిన విమర్శలను తిప్పికొట్టాలన్న సంకల్పంతో మహబూబ్ నగర్ నుండి కూడా కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి ఇక్కడి ప్రజల మనోగతం ఏంటో ప్రాక్టికల్ గా చూపించాలని భావించి సక్సెస్ అయ్యారు. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించే విధంగా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసేందుకు కేసీఆర్ బస్సు యాత్ర, సైకిల్ యాత్ర ఇలా ఎన్నో విధాలుగా నిరంతరం ప్రజల నడుమ ఉంటూ తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చారు.
మంత్రి పదవులు ఇచ్చి…
కాంగ్రెస్, టీఆరెఎస్ కలిసి పోటీ చేసిన తరువాత గెలుపొందిన వారిలో కొందరికి మంత్రి పదవులను కట్టబెట్టి ఇక తెలంగాణ పని అయిపోయింది… కేంద్రంలో కేసీఆర్, రాష్ట్రంలో ఆయన అనూయులు క్యాబినెట్ హోదా దక్కించుకున్నారు స్వరాష్ట్ర వాదన కనుమరుగైపోయిందంటూ సరికొత్త ప్రచారానికి తెరలేపారు. ఏ రకంగా కేసీఆర్ ను పతనం చేయాలి, ఆయన నినాదాన్ని అంతం చేయాలి అన్న ఆలోచనల్లో తలమునకలైన సమైక్య పార్టీల నాయకత్వం నిరంతరం ‘హంటింగ్’ చేస్తూనే ఉన్నాయి. ఓ దశలో చెప్పాలంటే కేసీఆర్ వ్యక్తిత్వాన్ని కూడా కించపరుస్తూ, ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వాడంటూ ఇలా ఎన్నో రకాలుగా హింసిస్తూనే ముందుకు సాగారు. అయినా కేసీఆర్ మాత్రం తన లక్ష్యం వైపు పయనిస్తూ, వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెల్లారు. టీఆర్ఎస్ పార్టీ ఆర్థిక వనరులను దెబ్బ కొట్టాలని, రాజకీయంగా తీరని నష్టాన్ని చేకూర్చాలని చేసిన ప్రయత్నాలకు తగ్గట్టుగానే కొన్ని మీడియా సంస్థలు కూడా వంతపాడాయి. అయినా ఆయన మాత్రం మొక్కవోని ధైర్యంతో లక్ష్యం వైపు పయనిస్తూ చివరకు ఆమరణ దీక్షకు పూనుకుని స్వరాష్ట్ర కల సాకారం చేశారు.
రెండు సార్లు…
వరసగా రెండు సార్లు స్వరాష్ట్రంలో గద్దెనెక్కిన కేసీఆర్ ఎక్కువగా రైతు, నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పెట్టుబడులు మాత్రమే పెడుతున్నాం… భవిష్యత్తులో వీటిలో కొన్ని ఆదాయ మార్గాలుగా మారి అక్షయ పాత్రలుగా తయారవుతాయన్న అంచనాలతో పరిపాలన సాగిస్తున్నారు. ఇటీవల కాలం వరకూ జాతీయ పార్టీ పెట్టాలన్న యోచన లేనప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై సమర శంఖం పూరించాలని నిర్ణయించారు. ఇందుకు తగ్గట్టుగానే జాతీయ పార్టీని ప్రకటించి ‘అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్’ అన్న నినాదాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలతో సమన్వయం చేసుకున్న కేసీఆర్ వచ్చే లోక సభ ఎన్నికల నాటికి దేశంలోని అన్ని లోక సభ స్థానాల్లో పోటీ చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ చేసేందుకు ప్రత్యేక టీంను కూడా తయారు చేసిన సీఎం ఉత్తరాది రాష్ట్రాల ప్రజలను బీఆర్ఎస్ కు అనుకూలంగా మల్చుకునేందుకు అవసరమైన వ్యూహాన్ని కూడా రచించబోతున్నారు. జాతీయ వాదం, హిందుత్వ నినాదం అయితే సరిపోదని వనరుల వినియోగం, అన్ని వర్గాల సంక్షేమంతో పాటు ఇతరాత్ర ముఖ్యమైన అంశాలపై కార్యాచరణను తయారు చేసి ఆయా రాష్ట్రాల్లో తన విధానాన్ని వివరించే ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదు. దీంతో దేశ వ్యాప్తంగా పార్టీకి సానుకూల పవనాలు వీచే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
మొగ్గలోనే…
అయితే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన వెంటనే కేంద్రంలో గద్దెనెక్కాలన్న లక్ష్యంతో ముందుకు సాగడం లేదు కేసీఆర్. ఆదిలోనే ఎదురయ్యే ఒడి దొడుకులను అధిగమిస్తూ 29 రాష్ట్రాలలో బలమైన శక్తిగా అవతరించాలంటే కొన్నేళ్లు శ్రమించాల్సిన అవసరం ఉంటుందన్న విషయం కేసీఆర్ కు తెలియంది కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ అనేది కనుచూపు మేరలో కూడా అగుపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ పార్టీకి అంకురార్పణ చేసినట్టయితే సక్సెస్ అవుతామన్న అంచనాలు ఆయనలో లేకపోకలేదు. జాతీయ పార్టీ వైపు కేసీఆర్ అడుగులు పడుతున్నాయనగానే స్థానిక నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఆయన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భవిష్యత్తులో జాతీయ పార్టీ నిర్మాణం పటిష్టం అయిన నాడు విమర్శలు చేసిన వారే బీఆర్ఎస్ పంచన చేరే పరిస్థితులు ఏర్పడ్డా ఆశ్చర్చపోనవసరం లేదేమో.
దక్షిణాది రాష్ట్రాల్లో…
ఉత్తరాది రాష్ట్రాల నాయకత్వం ముందు దక్షిణాది రాష్ట్రాలు లీడర్ షిప్ బలహీనమేనన్న భావన ఆయా రాష్ట్రాల్లోని నాయకులకు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సౌత్ స్టేట్స్ పార్టీలు తమ తమ రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి తప్ప నేషనల్ పార్టీలుగా ఆవిర్భవించే ప్రయత్నాలు మాత్రం చేయలేదు. ఫ్రంట్ ల ఏర్పాటులో కీలక భూమిక పోషించిన చరిత్ర కూడా దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతలకు ఉంది కానీ వారు మాత్రం తమ పార్టీని జాతీయ పార్టీగా అప్ గ్రేడ్ చేయాలన్న ఆలోచనతో ముందుకు సాగలేదు. కేసీఆర్ అనుకున్న లక్ష్యం సక్సెస్ అవుతుందో లేదోనన్న విషయం పక్కన పెడితే ఆయన అడుగులు జాతీయ రాజకీయాల వైపు వెల్తుండడం మాత్రం సౌత్ స్టేట్స్ లో కొత్త ఆలోచనలకు బీజం పడినట్టయిందన్నది వాస్తవం.