మా భూమేనని మావోయిస్టు పార్టీ ప్రకటన…
దిశ దశ, కరీంనగర్:
భూమి కోసం… భుక్తి కోసం… దున్నే వాడిదే భూమి అని నినదించిన గొంతుకలు అవి. సైద్దాంతికత కోసం సాయుధ పోరుబాట పట్టిన అన్నలు రెండున్నర దశాబ్దాల క్రితం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భూ స్వాములు గుండెల్లో నిద్రపోయారు. పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నక్సల్స్ భూ స్వాముల భూముల్లో ఎర్ర జెండాలు పాతి నిరుపేదలకు పంచారు. 2000వ దశాబ్దం వరకు ఉత్తర తెలంగాణాలో విప్లవోద్యమాలతో ప్రజా చైతన్యం కోసం కృషి చేస్తూనే మరో వైపున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 30 నుండి 35 వేల ఎకరాల భూమిని భూ స్వాముల నుండి లాక్కుని నిరుపేదలకు పంచారు. అప్పటి పీపుల్స్ వార్ హెచ్చరికలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గ్రామాలను విడిచి భూస్వాములు వెల్లిపోగా, ఆ భూముల్లో సేద్యం చేసుకుంటూ స్థానిక నిరుపేదలు జీవనం సాగిస్తున్నారు. అయితే 2005 తరువాత వచ్చిన పెను మార్పుల ప్రభావం విప్లవోద్యమాలపై తీవ్రంగా పడింది. పీపుల్స్ వార్ కంచుకోటగా పేరుగాంచిన ప్రాంతాల్లోకి బలగాలు చొచ్చుకపోయి నక్సల్స్ ఏరివేత లక్ష్యంగా ముందుకు సాగారు. ఈ క్రమంలో పోలీసుల పైచేయిగా నిలవడంతో ఉత్తర తెలంగాణాలో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. సాయుధ విప్లకారుల ఉనికి లేకుండా పోవడంతో ఒకప్పుడు అట్టుడికిపోయిన తెలంగాణ పల్లెలు నేడు సాధారణ జీవనంలోకి వచ్చాయి. మావోయిస్టు పార్టీ నకల్స్ కూడా పొరుగునే ఉన్న దండకారణ్య అటవీ ప్రాంతంలో క్రాంతీకారీ జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారు. ఈ క్రమంలో 1970వ దశాబ్దం నుండి 2000 వరకు విప్లవపోరాటాలు చేసిన అన్నలు ఎర్రజెండాలు పాతిన భూములపై దళారులు, భూస్వాముల కన్ను పడింది. అంతే ఇదే అదునగా భావించిన ఆ భూముల వారసులు, దళారులు వాటిని వేరే వారికి అమ్ముకునేందుకు రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని గుర్తించిన మావోయిస్టు పార్టీ గత పదేళ్లుగా భూస్వాములకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు, ప్రకటనలు విడుదల చేస్తూనే ఉంది. దళారులను టార్గెట్ గా పేర్కొంటూ హెచ్చరికలు జారీ చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా మావోయిస్టు పార్టీ ప్రకటనతో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
ఆసియలోనే అతిపెద్ద స్థూపం…
1989 వరకు అణివేతకు గురైన పీపుల్స్ వార్ పార్టీకి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామని అప్పటి కాంగ్రెస్ పార్టీ నేత మర్రి చెన్నారెడ్డి ప్రకటించారు. ఆనాడు ఎన్నికల సమయంలో చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్ పార్టీకి సానుకూలతను తెచ్చిపెట్టడమే కాకుండా ఆ పార్టీ అధికారంలోకి కూడా వచ్చింది. అయితే ఎన్నికల తరువాత చెన్నారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో పీపుల్స్ వార్ పార్టీకి స్వేచ్ఛ కల్పించారు. ఆ సమయంలో పీపుల్స్ వార్ తో పాటు అనుభంద సంఘాలు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ప్రజల్లోకి నేరుగా వెల్లే ప్రయత్నం చేశాయి. విప్లవోద్యమంలో మరణించిన వారిని స్మరించుకుంటూ స్థూపాలు ఏర్పాటు చేయడంపై అప్పటి నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే 1990లో హుస్నాబాద్ లో కూడా భారీ స్థూపాన్ని ఆవిష్కరించింది అప్పటి పీపుల్స్ వార్ నాయకత్వం. ఆ తరువాత జరిగిన పరిణామాలతో పీపుల్స్ వార్ పై మళ్లీ నిషేధం విధించడంతో జనారణ్యం నుండి అరణ్యంలోకి పీపుల్స్ వార్ క్యాడర్ వెల్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో హుస్నాబాద్ స్థూపాన్ని గ్రీన్ టైగర్స్, క్రాంతి సేనల పేరిట పేల్చివేశారు. డైనమేట్లతో ఈ స్థూపాన్ని పేల్చివేసిన ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే విప్లవోద్యమాల ఉనికి లేకుండా పోవడంతో తెరమరుగైన ఇలాంటి స్థూపాల గురించి నేటి తరానికి తెలియకుండా పోయింది. అనూహ్యంగా హుస్నాబాద్ స్థూపం నిర్మించిన స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 2022లో వారసత్వంగా ఈ భూమి తనకు చెందినదే అని రాజేశ్వర్ రెడ్డి రికార్డుల్లో తనపేరిట మార్చుకుని విక్రయించడం, ఆ స్థలాన్ని ప్లాట్లుగా చేసి అమ్ముకోవడంతో మావోయిస్టు పార్టీ ఎంట్రీ ఇచ్చింది.
అక్కున చేర్చుకోని ఆ నినాదం
ఒకప్పుడు విప్లవ పంథాలో గెరిల్లా యుద్దంతంత్ర వైపు సాగిన ఉత్తర తెలంగాణ పీపుల్స్ వార్ ప్రస్థానం మరో అడుగు ముందుకు వేస్తే సమాంతర ప్రభుత్వం దిశగా ముందుకు సాగేది. కానీ అనూహ్య పరిణామాలు, పోలీసు బలగాల ఎత్తులతో పార్టీ గణనీయమైన నష్టాన్ని చవి చూసింది. దీంతో అప్పటి భూ స్వామ్య నినాదాన్ని నేడు అమలు చేసే పరిస్థితులు లేకుండా పోయాయి. పార్టీ నిరుపేదలకు ఇచ్చిన భూములన్ని కూడా మళ్లీ భూస్వాముల వారసుల వశం అయిపోయాయి. చివరకు పార్టీ నిర్మించుకున్న స్మారక స్థూపం స్థలం కూడా రియల్ ఎస్టేట్ జరిగిపోయింది. దున్నే వాడిదే భూమి అని నినదించి నిరుపేదలకు భూమిని పంచిన విప్లవ కారులు నేడు తమ స్థూపం నిర్మించుకున్న స్థలం మాదేనంటూ ప్రకటలు ఇవ్వాల్సిన పరిస్థితికి చేరింది. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి (జెఎండబ్లూపి) జోనల్ కమిటీ కార్యదర్శి వెంటకేష్ ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ స్థూపం నిర్మించుకున్న ఈ భూమికి డబ్బులు చెల్లించిన వారు తిరిగి తీసుకోవాలని కోరారు. ఒకప్పుడు నిరుపేదలకు భూములు పంచిన విప్లవ పార్టీ నేడు అమరవీరుల స్థూపం నిర్మించుకున్న 4 ఎకరాల స్థలం తమదేనని చెప్పుకోవల్సి పరిస్థితులు తయారయ్యాయి.