నాన్న… అన్న… నేను… మా ఆయన…

దిశ దశ, ఏపీ బ్యూరో:

వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం అత్యంత వైవిద్యంగా కొనసాగుతోందా..? వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పని చేసిన తరువాత వైస్ జగన్ రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషించినప్పటికీ షర్మిత మాత్రం అంటీముట్టనట్టుగానే ఉన్నారు. అప్పటి వరకు తండ్రి చాటు తనయగానే ముందుకు సాగిన షర్మిల రాజకీయ అరంగ్రేట్రం తరువాత ఎన్నెన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి.

వైఎస్ మరణం తరువాత…

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత తెలుగునాట మారిన సమీకరణాల నేపథ్యంలో షర్మిల పొలిటికల్ స్క్రీన్ పై కనిపించారు. జగన్ పై కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుతో తల్లి విజయమ్మతో షర్మిల కూడా నిరసనలు తెలిపారు. జగన్ అరెస్ట్ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టిన షర్మిల అన్న చాటు చెల్లెలుగానే ప్రజల్లోకి వెళ్లారు. రాష్ట్రాల పునర్విభజన తరువాత కూడా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడ కూడా అన్న అడుగు జాడల్లోనే నడిచారు. ఇటీవల కాలంలో వైఎస్ కుటుంబంలో నెలకొన్న పరిణామాల ప్రభావంతో షర్మిల వైఎస్సార్టీపీని ఏర్పాటు చేశారు. తెలంగాన రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనుకున్న షర్మిల వైఎస్ అభిమానులను సమీకరించి పార్టీ నిర్మాణం కోసం శ్రమించారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా షర్మిల యాత్రలు, నిరసనలు చేపట్టినప్పటికీ అనుకున్నంతమేర సక్సెస్ కాలేకపోయారు. చివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పంచన చేరినప్పటిటీ టీపీసీసీ వర్గాల నుండి వ్యతిరేకత రావడంతో ఆమె తన ప్రభావాన్ని చూపించలేకపోయారు. అయితే ఇంతకాలం తండ్రి, అన్న, తన వరకే పరిమితం అయిన రాజకీయాల్లో ఇక నుండి మార్పు కనిపించబోతున్నట్టుగా వెల్లడవుతోంది. ఇంత వరకు షర్మిల రాజకీయ ప్రస్థానంలో తన భర్త బ్రదర్ అనిల్ కుమార్ అంతగా కనిపించిన దాఖలాలు లేవు. కేవలం కుటుంబానికి సంబంధించిన అంశాల్లో మాత్రమే బ్రదర్ అనిల్ కుమార్ కనిపించే వారు. ఒక వేళ రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన చర్యల్లో కనిపించినా ఆయన వైఎస్ కుటుంబానికి అల్లుడిగా మాత్రమే పరిమితం అయ్యేవారు.

ఇప్పుడు మాత్రం…

అయితే తాజాగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే లాంఛనం చేసే ప్రక్రియ ఎట్టకేలకు గురువారం పూర్తయింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో వైస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సారి మాత్రం ఆమెతో పాటు భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఉండడం విశేషం. గతంలో బ్రదర్ అనిల్ కుమార్ తెర మీదకు వచ్చి రాజకీయాలను చేసిన సందర్భాలు అతి తక్కువ సందర్భాలేనని చెప్పవచ్చు. కానీ ఈ సారి మాత్రం అన్నీ తానై అనిల్ సమీకరణాలు చేసినట్టుగా స్పష్టం అవుతోంది. గత కొంతకాలంగా బ్రదర్ అనిల్ కుమార్ ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలను కలిసి చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తోంది.

తండ్రి అడుగు జాడాల్లో…

అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల తన ప్రయాణం ఇక నుండి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిద్దాంతాలకు అనుగుణంగానే ఉంటుందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా ఆదేశించినా తాను ఆ విధంగానే ముందుకు సాగుతానని వెల్లడించారు.

You cannot copy content of this page